Site icon NTV Telugu

Kantharao : దాసరిని కాంతారావు ఎందుకు కొట్టారు!?

Dasari

Dasari

Kantharao: తెలుగు చిత్రసీమలో అందరి చేత ‘గురువుగారూ…’ అంటూ పిలిపించుకున్న ఘనత దర్శకరత్న దాసరి నారాయణరావుకే చెందుతుంది. నటరత్న యన్టీఆర్ మరణం తరువాత తెలుగు సినిమా రంగానికి పెద్ద దిక్కుగా తనదైన బాణీ పలికించారు దాసరి. ఆ రోజుల్లో దాసరి మాటను తెలుగు చిత్రసీమ వేదవాక్కుగానూ భావించి మసలుకుంది. అంతటి దాసరి నారాయణరావుపై ఓ సందర్భంలో సీనియర్ నటుడు కాంతారావు చేయి చేసుకున్నారట! ఎందుకని?

యన్టీఆర్ హీరోగా నటుడు నాగభూషణం నిర్మాణ భాగస్వామిగా ‘ఒకే కుటుంబం’ నిర్మించారు. ఈ సినిమాకు ఎ.భీమ్ సింగ్ దర్శకుడు. ఆయనకు అసోసియేట్ గా దాసరి నారాయణరావు పనిచేస్తుండేవారు. అదే సమయంలో భీమ్ సింగ్ కు హిందీలో దిలీప్ కుమార్ ‘గోపి’సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ దక్కింది. ఆ విషయం యన్టీఆర్ కు చెప్పి, ఆయన పర్మిషన్ తోనే హిందీ సినిమా చేయడానికి భీమ్ సింగ్ వెళ్ళారు. వెళ్తూ తన అసోసియేట్ దాసరికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. భీమ్ సింగ్ లేకుండా యన్టీఆర్ పై ఓ సీన్ తీసిన దాసరిని చూసి, ‘భవిష్యత్ లో మీరు గొప్ప దర్శకులవుతారు’ అంటూ యన్టీఆర్ దీవించారు. ఇక ఈ రోజు నుంచీ మీరే ఈ సినిమాకు కెప్టెన్ అంటూ ప్రోత్సహించారు రామారావు. అయితే అదే సినిమాలో యన్టీఆర్ కు అన్నగా నటిస్తున్న కాంతారావు ఓ రోజు షూటింగ్ కు ఆలస్యంగా వచ్చారు. ఇది తెలిసిన రామారావు మందలించారు. పెద్దాయన కేకలు వేశారని చకచకా రెడీ అవుతున్న కాంతారావుకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న దాసరి సీన్ వివరించబోయారట! అసలే హడావుడిలో ఉన్న కాంతారావు, దాసరి సీన్ చెప్పబోతే కోపంతో లాగి ఒక్కటిచ్చారట! తరువాత యన్టీఆర్ మిగిలిన సినిమాను దాసరే పూర్తి చేస్తారని చెప్పడంతో కాంతారావు కంగు తిన్నారట. ఆ రోజునే దాసరి తాను ఏ రోజుకైనా దర్శకునిగా మారాక, తన చిత్రంలో కాంతారావుకు వేషం పిలిచి మరీ ఇవ్వాలని తీర్మానించుకున్నారట. అలా, కొన్ని చిత్రాలలో కాంతారావుకు వేషాలు ఇచ్చారు దాసరి. ఈ విషయాన్ని ‘కంటే కూతుర్నే కను’ సెట్ లో కాంతారావు తో పాటు దాసరి గుర్తు చేసుకున్నారు.

Exit mobile version