Jamuna: దాదాపు మూడు దశాబ్దాలు కథానాయికగా రాణించిన జమున హుందాగా ఆ పాత్రలకు దూరమయ్యారు. ఆ తర్వాత కూడా తనకు నచ్చిన పాత్రలు, లభిస్తేనే సినిమాల్లో చేశారు. ‘వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని ఉంటే, ఐదు వందలకు పైగా సినిమాల్లోనే నటించి ఉండే దాన్ని’ అని జమున చెబుతుండేవారు. వెండితెర నాయికగా, ప్రజానటిగా గొప్ప పేరు తెచ్చుకున్న జమున అనేక సేవాకార్యక్రమాలనూ నిర్వహించారు. సినీ, రంగస్థల వృద్థ కళాకారులకు ఆమె కొన్నేళ్ళ పాటు పింఛన్ అందచేశారు. సినిమా నటనకు జమున దూరంగా ఉంటడానికి, ఎంతో ఒత్తిడి మేరకు కొన్ని పాత్రలు చేయడానికి ఓ కారణం ఉంది. ఆమె దశాబ్దాల కాలంగా మెడ నరాల సమస్యతో బాధపడుతూ ఉన్నారు. తల ఎక్కువగా ఊగిపోతుండేది. దానివల్ల తలను స్థిరంగా పెట్టి నటించడం, సంభాషణలను స్పష్టంగా పలకడం కష్టమౌతుండేది. కానీ కొందరి ఒత్తిడి మేరకు అలానే కొన్ని సినిమాల్లోనూ నటించారు. రెండేళ్ళ క్రితం కూడా ఆమె ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’ సినిమాలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చారు జమున. ఇదిలా ఉంటే… అసలు జమునకు ఈ మెడ నరాల సమస్య ఎలా వచ్చింది? ఎప్పుడు వచ్చింది? దీనికి కారణం ఏమై ఉంటుందనే ప్రశ్న చాలామందిలో ఉదయించడం సహజం.
‘లేత మనసులు’ సినిమా తమిళ వెర్షన్ లో నటిస్తుండగా జమున మెడకు పెద్ద దెబ్బ తగిలింది. ‘అందాల ఓ చిలుకా… ‘ పాట తమిళ వెర్షన్ అప్పుడు చిత్రీకరిస్తున్నారు. హీరో జయశంకర్ అప్పటికి కొత్తవాడు. సీనియర్ హీరోయిన్ జమునతో చేస్తున్నాననే కంగారు అతనికి తెలియకుండానే లోలోపల ఉంది. ఆ పాటలో గడ్డిమేట మీద నుంచి జారుకుంటూ కిందకు వచ్చి హీరోయిన్ పక్కకు చేరాల్సి సందర్భం ఒకటి ఉంది. అందులో అతను గడ్డి మేట మీద నుండి చూసుకోకుండా అడ్డదిడ్డంగా వచ్చి జమున నెత్తి మీద పడ్డాడు. అంతే… ఆవిడ మెడ విరిగినంత పనయింది. షూటింగ్ కు పేకప్ చెప్పేశారు. జమునకు వైద్యం చేయించారు. ఆ తర్వాత అంతా సర్దుకుంది. కానీ చాలా ఏళ్ళ తర్వాత ఆ దెబ్బ తాలుకు ప్రభావం జమునపై పడింది. మెడ నొప్పి సమస్య తిరగబెట్టింది. సున్నితమైన మెడ నరాలు దెబ్బతినడం వల్ల తల ఊగిపోవడం మొదలైంది. ‘రాజపుత్ర రహస్యం’ సినిమాలో కూడా ఈ సమస్యతో ఆమె ఇబ్బంది పడినట్టు కనిపిస్తుంది. వైద్యం కోసం పలువురిని ఆమె సంప్రదించారు. ఆమెకున్న సమస్య పార్కిన్సన్ కాదనేవారు వైద్యులు. మొత్తానికి ఆమె మెడ నరాల సమస్యకు పూర్తి స్థాయిలో పరిష్కారమైతే లభించలేదు. ఆ సమస్యను ఆమె తదుపరి జీవితకాలం అంతా భరిస్తూనే వచ్చారు. ‘లేత మనసులు’ సమయంలో జరిగిన ఓ ప్రమాదం… తదుపరి సంవత్సరాలలో జమున కెరీర్ మీద తీవ్ర ప్రభావం చూపించిందని అనుకోవచ్చు. ఈ సమస్యే లేకుంటే జమున మరిన్ని సినిమాల్లో మరింత ప్రభావంతమైన పాత్రలను చేసి ఉండేవారు.