NTV Telugu Site icon

Priyanka Chopra: ప్రేమికుల రోజున ప్రియాంక ఏం చేయబోతోంది!?

Love Again

Love Again

Priyanka Chopra: వేలంటైన్స్ డేని తాము బుక్ చేసేసుకున్నామని ప్రియాంక చోప్రా చెప్పేసింది. అది తన భర్త నిక్ జోనాస్ తో కాదు సుమా, స్కాటిష్ యాక్టర్ శామ్ రొనాల్డ్ హ్యూఘన్ తో! విడ్డూరంగా లేదూ అంటారా- ఏం కాదు, ప్రియాంక, శామ్ కలసి నటించిన ‘లవ్ ఎగైన్’ సినిమా ట్రైలర్ రిలీజ్ సందర్భంగా వేలంటైన్స్ డేను ఎంచుకున్నారు వీరు. అందువల్లే, అమ్మడు ఆ మాట అందన్నమాట! ఈ బాలీవుడ్ భామ హాలీవుడ్ లోనూ తన సత్తా చాటుకుంటున్న విషయం తెలిసిందే కదా! ఆమె నటించిన ‘లవ్ ఎగైన్’ మే 12న విడుదల కానుంది. టైటిల్ లోనే ‘లవ్’ అన్న పదాన్ని చేర్చుకున్న ఈ సినిమాకు వేలంటైన్స్ డే నుండి ప్రచారం మొదలు పెట్టడమే మేలని భావించారు. ఆ రోజున ‘లవ్ ఎగైన్’ ట్రైలర్ విడుదల కానుంది.

రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన ‘లవ్ ఎగైన్’ సినిమాకు 2016లో తెరకెక్కిన జర్మన్ మూవీ ‘ఎస్ఎమ్ఎస్ ఫర్ డిచ్’ ఆధారం. ఇందులో తన మాజీ ప్రియుడు లేకపోవడంతో అతని పాత నంబర్ కే తనలోని ప్రేమను, వ్యథను తెలియజేస్తూ మీరా రే అనే అమ్మాయి కవితల రూపంలో మెసేజెస్ పంపుతూ ఉంటుంది. అయితే ఆ నంబర్ రాబ్ బర్న్స్ అనే జర్నలిస్ట్ కు తరువాత కేటాయించి ఉంటారు. తన నంబర్ కు వస్తున్న ఆ సందేశాల్లోని ప్రేమ, అనురాగం అతణ్ణి కట్టిపడేస్తాయి. ఆ తరువాత ఆ మీరాను రాబ్ ఎలా కలసుకున్నాడు, ఆమె మనసు ఎలా గెలుచుకున్నాడు అన్నదే మిగతా కథ! నాలుగు పదులు దాటిన ప్రియాంక చోప్రా ఇందులో మీరా రే పాత్ర పోషించింది. ఇందులో ప్రియాంక ఏ తీరున మురిపిస్తుందో చూడాలని అభిమానులూ ఆశగా ఎదురుచూస్తున్నారు. వారిని ఊరించడానికే ‘వేలంటైన్స్ డే’న సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ను పలకరించబోతోంది ప్రియాంక. మరి ‘లవ్ ఎగైన్’తో ప్రియాంక అభిమానులను ఏ తీరున మురిపిస్తుందో చూడాలి.

Show comments