Arnold Schwarzenegger: ఒకప్పుడు ప్రపంచంలోనే నంబర్ వన్ యాక్షన్ సూపర్ స్టార్ గా జేజేలు అందుకున్నారు ఆర్నాల్డ్ ష్వాజ్ నెగ్గర్. చిత్రసీమలోనే కాదు రాజకీయాల్లోనూ రాణించారు ఆర్నాల్డ్. 2003-2011 మధ్య కాలంలో కాలిఫోర్నియా గవర్నర్ గానూ పనిచేసిన ష్వాజ్ నెగ్గర్ మళ్ళీ అటు రాజకీయాలవైపు, ఇటు సినిమాల్లోనూ అలరించడానికి సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. ప్రపంచమంతా మెచ్చిన కండలవీరునిగా చరిత్ర సృష్టించిన ఆర్నాల్డ్ తెరపై కూడా తనదైన యాక్షన్ తో మురిపించిన సంగతి తెలిసిందే. కామెడీతోనూ కదం తొక్కిన ఆర్నాల్డ్ తాజాగా ‘ఫ్యూబార్’ అనే కామెడీ సిరీస్ తో తొలిసారి బుల్లితెరపై అలరించబోతున్నారు. ఇదిలా ఉంటే ఆర్నాల్డ్ నోటి నుండి, “ద్వేషాన్ని ప్రచారం చేసేవారు, దయనీయంగా కన్నుమూస్తారు…” అన్న మాటలు వెలువడ్డాయి. ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు అన్నారో ఎవరికి వారు తమ కోణంలో అర్థం చేసుకుంటున్నారు.
Writer Padmabhushan: ‘రైటర్ పద్మభూషణ్’ అప్పుడే ఇంట్లో అడుగుపెడతాడట
ఈర్ష్యాద్వేషాలను రంగరించి, ఎవరూ విజయం సాధించలేదని, ఇప్పటి దాకా చరిత్రను పరిశీలిస్తే అలా చేసిన వారందరూ చివరకు ఓటమి పాలయ్యారనీ ఆర్నాల్డ్ గుర్తు చేస్తున్నారు. గత సంవత్సరం ఆర్నాల్డ్ నాజీ క్యాంప్ ను సందర్శించినప్పుడు ఆయనపై కొందరు విమర్శలు చేశారు. రెండో ప్రపంచ యుద్ధానికి కారకులు యూదులే అంటూ నాజీలు వారిని ఊచకోత కోశారు. ప్రపంచం దీనిని తీవ్రంగా ఖండించినా, అప్పటి జర్మన్ నాయకులు ఊచకోత మానలేదు. కానీ, చివరకు ఆ నాజీలు ఓడిపోయారని ఆర్నాల్డ్ గుర్తు చేశారు. ఆ రోజుల్లో యూదులపై కుట్రలు, కుతంత్రాలు అన్నవి ఎప్పటికీ మరచిపోలేమని ఆయన చెప్పారు. స్వార్థపరులు తమ పబ్బం కోసం అమాయకులైన జనాన్ని రెచ్చగొడుతూ ఉంటారని, ఇలాంటి సంఘటనలు చరిత్రలో ఎన్నో చోటు చేసుకున్నాయనీ ఆర్నాల్డ్ అంటున్నారు. మనం ద్వేషించేవారితో యుద్ధం చేయడంలో మనమే ఓడిపోతూ ఉంటామని, మనతో మనం యుద్ధం చేసుకున్నప్పుడే విజయం సాధించగలుగుతామనీ ఆర్నాల్డ్ చెబుతున్నారు. ఆయన మాటల్లోని ఆంతర్యం కొందరికి అర్థం కాకపోయినా, ప్రపంచశాంతినే ఆయన ఆకాంక్షిస్తున్నట్టు అందరికీ ఇట్టే అర్థమై పోతోంది. ఆర్నాల్డ్ నోట ఇలాంటి మాటలు వస్తున్నాయంటే, మళ్ళీ ఆయనకు రాజకీయాల్లో అడుగు పెట్టే ఉద్దేశం ఏమైనా ఉందేమో అంటున్నారు అమెరికన్లు. ఏమవుతుందో చూద్దాం!