Chiranjeevi – Balakrishna: నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ చిత్రం జనవరి 12న విడుదలవుతున్నట్టు అఫిసియల్ గా ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించవలసి ఉంది. కొందరు ‘వీరసింహారెడ్డి’ విడుదలైన మరుసటి రోజు అంటే జనవరి 13న ‘వాల్తేరు వీరయ్య’ ఆగమనం ఉంటుందని అంటున్నారు. మరికొందరు జనవరి 7వ తేదీన చిరంజీవి సోలోగా వస్తున్నారనీ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి, బాలకృష్ణ సినిమాల్లో ఏది ముందు ఏది వెనుక అన్న చర్చ సాగుతోంది. ఇక్కడే ఆ ఇద్దరు స్టార్స్ ఫ్యాన్స్ నడుమ ఆసక్తికరమైన చర్చ కూడా నడుస్తోంది. ఇప్పటి దాకా చిరంజీవి, బాలకృష్ణ బాక్సాఫీస్ బరిలో 24 సార్లు పోటీపడ్డారు. వీటిలో చిరంజీవి సినిమా ముందు వచ్చి, తరువాత బాలకృష్ణ చిత్రం విడుదలైన సందర్భాలు 16 సార్లు ఉన్నాయి. ఇక బాలయ్య చిత్రం. చిరు సినిమా కంటే ముందు విడుదలైన సందర్భాలు ఏడు సార్లు మాత్రమే ఉన్నాయి. ఒకే ఒక్కసారి 2001 జనవరి 11న ఇద్దరి సినిమాలు ఒకే రోజున విడుదలయ్యాయి.
చిరంజీవి సినిమాలు బాలకృష్ణ చిత్రాల కంటే ముందు విడుదలైన సందర్భాలలో 12 సార్లు చిరంజీవిదే పైచేయిగా సాగింది. ఇక బాలయ్య సినిమా చిరు చిత్రం కంటే ముందు విడుదలైన ఏడు సందర్భాలలో ఐదు సార్లు బాలయ్యదే పైచేయిగా ఉంది. ఒకే రోజు విడుదలైన ‘నరసింహనాయుడు’, ‘మృగరాజు’ చిత్రాల్లో బాలయ్య సినిమాకే జనం జై కొట్టారు. మిగిలిన సందర్భాలలో ఇద్దరి చిత్రాలూ అంతగా అలరించలేక పోయాయనే చెప్పాలి. ఏది ఏమైనా చిరంజీవి సినిమా ముందు విడుదలైతేనే మెగాస్టార్ కు మంచి ఫలితాలు దక్కినట్టు లెక్కలు చెబుతున్నాయి. బాలయ్య సినిమా తరువాత చిరు చిత్రం విడుదలైన సందర్భాల్లో కేవలం రెండు సార్లు మాత్రమే మెగాస్టార్ ది పైచేయి అనిపించుకుంది. అందువల్ల ‘వాల్తేరు వీరయ్య’ను ‘వీరసింహారెడ్డి’ కన్నా ముందు విడుదల చేస్తే బాగుంటుందని అభిమానుల అభిలాష. కానీ, ఈ సారి విచిత్రం ఏమిటంటే- చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరి చిత్రాలను నిర్మించిన సంస్థ ఒక్కటే కావడం! మరి నిర్మాతలపై అభిమానులు ఎలాంటి ఒత్తిడి తెస్తారో? చిరంజీవి సినిమాను ముందే విడుదల చేసే పరిస్థితి నెలకొంటుందేమో చూడాలి.
