NTV Telugu Site icon

చిత్రవిచిత్రాల వి.యస్.ఆర్.స్వామి

తెలుగు చిత్రసీమలోని ఇప్పుడున్న ఎంతోమంది సినిమాటోగ్రాఫర్స్ కు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ గురువుగా నిలిచారు వి.ఎస్.ఆర్.స్వామి. ఆయన కెమెరా పనితనంతో రూపొందిన అనేక చిత్రాలు జనానికి కనువిందు చేశాయి. తెలుగు చిత్రసీమలో తొలి సినిమాస్కోప్-ఈస్ట్ మన్ కలర్ చిత్రంగా తెరకెక్కిన ‘అల్లూరి సీతారామరాజు’కు ఆయనే సినిమాటోగ్రాఫర్. బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే తన కెమెరా పనితనంతో జనాన్ని ఆకట్టుకున్నారు స్వామి. నలుపు-తెలుపు చిత్రాలలో సందర్భానుసారంగా ‘సిల్హౌట్స్’ను ఉపయోగించి మెప్పించారు. రంగుల చిత్రాలలోనూ సందర్భానికి తగిన యాంగిల్స్ తో రంజింపచేశారు. అందుకే ఈ నాటికీ సినిమాటోగ్రాఫర్స్ వి.ఎస్.ఆర్.స్వామి పేరును తలచుకుంటూ ఉంటారు. ఎంతోమంది ఆయన వద్ద శిష్యరికం చేసిన వారు తరువాతి రోజుల్లో సినిమాటోగ్రాఫర్స్ గా పేరు సంపాదించారు.

గుడివాడలో జన్మించిన వి.ఎస్.ఆర్.స్వామి బాల్యం నుంచీ ఫోటోగ్రఫీపై మక్కువ పెంచుకున్నారు. చిత్రసీమలో ప్రవేశించాక అన్నయ్య, సి.నాగేశ్వరరావు వంటి వారి వద్ద పనిచేశారు. ఆ రోజుల్లో ‘వెస్ట్రన్ ఇండియా సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్’ (డబ్ల్యు.ఐ.సి.ఏ)లో పేరు నమోదు చేయించుకోవడం కెమెరా మెన్ ఓ గొప్పగా భావించేవారు. స్వామి తక్కువ కాలంలోనే అందులో తన పేరు నమోదు చేయించుకోగలిగారు. ఆయన పనితనం గమనించిన దర్శకుడు వి.రామచంద్రరావు తన ‘అసాధ్యుడు’ చిత్రం ద్వారా వి.ఎస్.ఆర్.స్వామిని సినిమాటోగ్రాఫర్ గా పరిచయం చేశారు.

read also : అనకాపల్లి మెడికల్‌ కాలేజీపై వైసీపీలో చర్చ!

ఈ చిత్రంలో కథానుసారంగా ఓ సందర్భంలో హీరో కృష్ణ అల్లూరి సీతారామరాజు నాటికలో సీతారామరాజుగా కనిపిస్తారు. ఆ సన్నివేశాన్ని తెరకెక్కించడంలో వి.ఎస్.ఆర్.స్వామి కెమెరా పనితనం భలేగా పనిచేసింది. ‘అసాధ్యుడు’ చిత్రం ప్రేక్షకాదరణ పొందింది. చాలామంది స్వామి కెమెరా వర్క్ గురించి చర్చించుకున్నారు. తరువాత యన్టీఆర్ తో కె.హేమాంబరధర రావు రూపొందించిన ‘కథానాయకుడు’ చిత్రానికి కూడా వి.ఎస్.ఆర్. స్వామి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. అందులో “ఇంతేనయా తెలుసుకోవయా…” పాట రంగుల్లో ఉంటుంది. ఆ పాటను తెరకెక్కించిన తీరు, సందర్భానుసారంగా కెమెరాను నడిపించిన విధానం ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా యన్టీఆర్ మారువేషం వేసుకొని వచ్చిన సమయంలో ఆయన కాలి బూట్ల మధ్య నుండి విలన్స్ ను చిత్రీకరించిన తీరు అప్పట్లో జనం ముచ్చటించుకొనేలా చేసింది.

“మోసగాళ్ళకు మోసగాడు, దేవుడు చేసిన మనుషులు, అందాలరాముడు, భక్త తుకారాం, భక్త కన్నప్ప, సిరి సిరిమువ్వ, ఖైదీ, కొండవీటి దొంగ, రౌడీ ఇన్ స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసిం హనాయుడు, ఇంద్ర” వంటి జనరంజక చిత్రాలకు వి.ఎస్.ఆర్.స్వామి సినిమాటోగ్రఫి దన్నుగా నిలచింది. యన్టీఆర్ హీరోగా ‘ఎదురీత’ చిత్రాన్ని నిర్మించడంలో భాగస్వామిగా వ్యవహరించారు స్వామి. ‘ఆపద్బాంధవులు’, ‘మహాశక్తిమాన్’ అనే చిత్రాలకు దర్శకత్వం వహించారు. దాసరి దర్శకత్వంలో కృష్ణ హీరోగా రూపొందిన చారిత్రక చిత్రం ‘విశ్వనాథ నాయకుడు’ ద్వారా బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా నందిని అందుకున్నారు వి.ఎస్.ఆర్.స్వామి.