అనకాపల్లి మెడికల్‌ కాలేజీపై వైసీపీలో చర్చ!

ఆయనో యువ ఎమ్మెల్యే. రాజకీయ ఉద్ధండులకు దక్కని అవకాశం లభించింది. లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ సాధించామని సంబరాలు చేసుకుంది ఎమ్మెల్యే వర్గం. అంతా ఓకే అనుకున్న వేళ కిరికిరి మొదలైంది. దీంతో ఉపేక్షించకూదని భావిస్తున్న ఆ యువ ఎమ్మెల్యే.. తాడేపేడో తేల్చుకోవడానికి సిద్ధమైనట్టు సమాచారం.

అట్టహాసంగా మెడికల్‌ కాలేజీకి శంఖుస్థాపన

విశాఖ జిల్లా రాజకీయాల్లో అనకాపల్లిది సెపరేట్ స్టైల్. ఇక్కడ పాలిటిక్స్ అన్నీ సామాజిక సమీకరణాలతో ముడిపడి ఉంటాయి. ఈ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రులు కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావ్, గంటా శ్రీనివాస్ వంటి ఉద్ధండులు ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుతం అనకాపల్లి ఎమ్మెల్యేగా గుడివాడ అమర్‌నాథ్‌ కొనసాగుతున్నారు. తన నియోజకవర్గంలో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి, మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి చొరవ తీసుకున్నారు అమర్‌నాథ్‌. గ్రామీణ ప్రాంతంలో నివశిస్తున్న లక్షలమంది ప్రజలు.. వైద్య అవసరాల కోసం విశాఖపైనే ఆధారపడాల్సి వస్తోంది. అదే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అనకాపల్లిలో ఏర్పాటైతే ఎక్కువ మందికి మేలు జరుగుతుంది. పార్లమెంటరీ నియోజకవర్గానికి ఓ మెడికల్ కాలేజ్, ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ గతఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యరూపంలో పెట్టారు. ఇటీవల శంఖుస్థాపనలు అట్టహాసంగా జరిగాయి.

also read : ఏపీ కరోనా అప్డేట్… ఇవాళ ఎన్నంటే ?

వ్యవసాయ పరిశోధనా కేంద్రంలోని 50 ఎకరాలు కేటాయింపు

అనకాపల్లిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, మెడికల్ కాలేజ్ నిర్మాణానికి 500 కోట్లను ప్రభుత్వం వెచ్చించనుండగా.. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలోని 50 ఎకరాలను జిల్లా యంత్రాంగం కేటాయించింది. ఇక్కడి వరకు అంతా సాఫీగానే జరిగింది. ఆస్పత్రి నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలంపై ఇప్పుడు వివాదం మొదలైంది. వ్యవసాయ పరిశోధన కేంద్రం భూములను కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ఓ సామాజిక కార్యకర్త కోర్టును ఆశ్రయించారు. యధాతథస్థితిని కొనసాగించాలని కోర్టు ఆదేశించింది.

ఆస్పత్రికి భూమిని కేటాయించొద్దని కోర్టులో పిటిషన్‌

వాస్తవానికి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి 100 ఏళ్ల పైబడిన చరిత్ర ఉంది. ఇప్పటి వరకు 32 చెరకు వంగడాలపై ప్రయోగాలు జరిగాయి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పరిశోధన కేంద్రం భూములను ఆస్పత్రికి కేటాయించ వద్దని కోర్టులో వేసిన పిటిషన్‌లో కోరారు. నిజానికి ప్రాంతీయ పరిశోధనా కేంద్రంలో తీసుకునే భూమికి ప్రత్యామ్నాయంగా పట్టణ శివార్లలో భూమిని జిల్లా యంత్రాంగం ప్రతిపాదించింది. అందుకు ప్రభుత్వ అనుమతి లభించింది. అయితే అంతర్గత రాజకీయాల్లో భాగంగానే కోర్టులో పిటిషన్లు వేస్తున్నారని గట్టిగా నమ్ముతోంది ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ వర్గం.

అనకాపల్లి వైసీపీలో మూడు గ్రూపులు
రాజకీయ ఎత్తుగడలే వివాదానికి కారణమా?

ప్రభుత్వ నిర్ణయమే అయినప్పటికీ.. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం జరిగితే తమకు ఎక్కడ పొలిటికల్‌ మైలేజ్ వస్తుందనే అక్కసుతో ఇదంతా చేస్తున్నారని ఎమ్మెల్యే వర్గం మండిపడుతోంది. అనకాపల్లి రాజకీయాల్లో ప్రస్తుతం సీనియర్ నేత దాడి వీరభద్రరావు, ఎమ్మెల్యే అమర్‌నాథ్‌, ఎంపీ సత్యవతి గ్రూపులు ఉన్నాయి. వీరంతా పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేసినప్పటికీ వ్యక్తిగత మైలేజ్ దగ్గరకు వచ్చేసరికి రాజీపడటం లేదు. ఆస్పత్రి నిర్మాణం కోసం కేటాయించిన భూములపై వివాదం రాజుకోవడానికి స్థానిక రాజకీయ ఎత్తుగడలే కారణమని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

పేర్లు ప్రస్తావించకుండా ఎమ్మెల్యే ఘాటైన కామెంట్స్‌

ఈ పరిణామాలపై ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ తీవ్ర అసహనంతో ఉన్నారట. పేర్లు ప్రస్తావించకుండానే బహిరంగ వేదికలపై ఘాటైన కామెంట్స్‌ చేస్తున్నారట. రాజకీయ ఎత్తుగడలు బహిరంగ రహస్యమే కనుక మళ్లీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముందనే అభిప్రాయంలో ఎమ్మెల్యే ఉన్నట్టు తెలుస్తోంది. కాకపోతే ఈ అంశంపై తాడేపల్లిలోనే తాడోపేడో తేల్చుకోవడానికి అమర్‌నాథ్‌ సిద్ధపడినట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-