Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, చాందినీ చౌదరి జంటగా నటించిన గామి సినిమా మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8వ తేదీన ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అయింది. విద్యాధర కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మొదట క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిర్మించాలని అనుకున్నారు. 40% షూటింగ్ పూర్తి అయిన తర్వాత యువి క్రియేషన్స్ సంస్థ టేక్ అప్ చేసి సినిమాను నిర్మించింది. ధీరజ్ మొగిలినేని ఈ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశారు. సినిమా రిలీజ్ అయిన మొదటి ఆట నుంచి సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే ఆఫ్ బీట్ సినిమా కావడంతో అందరికీ కనెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువే కానీ ఎక్కువగా విమర్శకుల నుంచి మాత్రం సినిమాకి ప్రశంసలు దక్కాయి. అయితే కొంతమంది మాత్రం గామికి నెగెటివ్ రేటింగ్ ఇస్తున్నారు. ఈ సినిమా మీద బుక్ మై షో లో నెగిటివ్ రేటింగ్స్ వేయిస్తున్నారు అంటూ మేకర్స్ అధికారికంగా తెలిపారు.
తాజాగా ఈ నెగెటివ్ రేటింగ్స్ పై విశ్వక్ ఒక పోస్ట్ పెట్టాడు. ప్రియమైన గౌరవప్రదమైన ప్రేక్షకులు మరియు తోటి సినీ ఔత్సాహికులకు.. గామి విపరీతమైన విజయానికి సహకరించినందుకు మీలో ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక దీని రేటింగ్ విషయంలో నా దృష్టికి వచ్చిన సమస్య గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. బుక్‌మైషో వంటి ప్లాట్‌ఫారమ్‌లలో చలనచిత్ర ప్రతిష్టపై నిరంతర దాడులు జరుగుతున్నాయని నా దృష్టికి వచ్చింది. కొందరు కావాలనే 10కి 1 రేటింగ్ ఇస్తున్నారు. రకరకాల యాప్స్ ఉపయోగించి ఫేక్ రేటింగ్ ఇవ్వడం వల్ల 9 ఉన్న రేటింగ్ 1కి పడిపోయింది. మీరు ఎన్నిసార్లు కిందకు లాగినా నేను పైకి లేస్తూనే ఉంటాను. ఈ చర్యల వెనుక ఉన్న ఉద్దేశ్యాలు లేదా వ్యక్తుల గురించి నాకు తెలియదు. ఒక మంచి సినిమా విడుదల సమయంలో సపోర్ట్ చేసిన వారికి నా కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను. మా సినిమాను సపోర్ట్ చేస్తున్న ఆడియెన్స్, మీడియాకు థ్యాంక్స్. ఈ వ్యవహారంపై చట్టపరంగా ముందుకెళ్తాను.. భం భోలే నాధ్ .. జైహింద్” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
