Vishwa Karthikeya: ”జానకి వెడ్స్ శ్రీరామ్, ఆ నలుగురు, గోరింటాకు, విష్ణు, శివశంకర్, లేతమనసులు, అధినాయకుడు” వంటి యాభై సినిమాలలో బాలనటుడిగా తన ప్రతిభను చాటుకున్నాడు విశ్వ కార్తికేయ. అంతేకాదు… ‘ఈ నిజం అబద్ధం అయితే’ అనే టెలీఫిల్మ్ తో ఉత్తమ బాలనటుడిగానూ నంది అవార్డునూ అందుకున్నాడు. ఇది నిన్నటి మాట. ఇవాళ అతను ఎదిగి, నటనలో మరింత పరిణతి సాధించి పలు చిత్రాలలో నటిస్తూ తనకంటూ ఓ గుర్తింపు కోసం కృషి చేస్తున్నాడు. ఇప్పటికే ‘కళాపోషకులు, జైసేన’ చిత్రాలలో నటించిన విశ్వ కార్తికేయ ఇప్పుడు పలు చిత్రాలలో గుర్తింపు తెచ్చే పాత్రలు చేస్తున్నాడు. విశేషం ఏమంటే అతను హీరోగా నటించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కాబోతున్నాయి. సహజంగా హీరోయిన్స్ విషయంలో అలా జరుగుతోంది. ఇక హీరోలకైతే… కెరీర్ మొత్తం ఒకటి రెండు సార్లు మాత్రమే అలా జరుగుతుంది. కానీ ఇప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్న విశ్వ కార్తికేయ విషయంలో ఇలా జరగడం చిత్రమనే చెప్పాలి.
ఈ శుక్రవారం 10వ తేదీ మొత్తం తొమ్మిది సినిమాలు జనం ముందుకు వస్తున్నాయి. అందులోని రెండు సినిమాలు విశ్వ కార్తికేయ నటించినవే కావడం విశేషం. ఇందులో మొదటిది ‘అల్లంత దూరాన…’. ఈ సినిమాలో విశ్వ కార్తికేయ సరసన ఆమని మేనకోడలు హ్రితిక శ్రీనివాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలీతో పాటు ఆమని, భాగ్యరాజా కూడా ప్రధాన పాత్రలు పోషించారు. చలపతి పువ్వల దర్శకత్వంలో దీనిని ఎన్. చంద్రమోహన్ రెడ్డి నిర్మించారు. అలానే ఇదే రోజున వస్తున్న ‘ఐపిఎల్’ మూవీలోనూ విశ్వ కార్తికేయ హీరోగా నటించాడు. ‘ఇట్స్ ప్యూర్ లవ్’ అనేది దీని ట్యాగ్ లైన్. విశ్వ కార్తికేయ సరసన అవంతిక మున్ని హీరోయిన్ గా నటించగా, పోసాని, సుమన్, బబ్లూ, పృథ్వీరాజ్, భరణి ప్రధాన పాత్రలు పోషించారు. సురేశ్ లంకలపల్లి దీనికి దర్శకత్వం వహించాడు. విశ్వ కార్తికేయ తండ్రి రామాంజనేయులు పలు చిత్రాలను నిర్మించారు.