పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం ప్రతి ఒక్కరినీ కలచి వేసింది. ఇండస్ట్రీలోకి వాళ్ళే కాదు అభిమానులతో పాటు అందరూ ఆయన ఇక లేరన్న విషయాన్నీ జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ కు ఇండస్ట్రీలో ఉన్న మంచి స్నేహితుల్లో విశాల్ ఒకరు. విశాల్, పునీత్ రాజ్‌కుమార్ ఇద్దరూ మంచి స్నేహితులు. తాజాగా పునీత్ మృతి గురించి ఎమోషనల్ అయ్యారు విశాల్. అంతేకాదు అయన కోసం ఓ కొత్త బాధ్యతను భుజానికెత్తుకున్నారు.
Read Also : బాలయ్య “అన్‌స్టాపబుల్”లో ఎన్టీఆర్, ప్రభాస్
విశాల్ తన కొత్త సినిమా “ఎనిమీ” ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం ఆదివారం హైదరాబాద్ వచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం పునీత్ రాజ్‌కుమార్‌కు సంతాపం తెలిపింది. పునీత్ రాజ్‌కుమార్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్న విశాల్, పునీత్ రాజ్‌కుమార్‌ని కోల్పోవడం కేవలం చిత్ర పరిశ్రమకే కాకుండా సమాజానికి కూడా తీరని లోటు అని వెల్లడించారు. తన ప్రసంగంలో పునీత్ ప్రారంభించిన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని విశాల్ ప్రకటించాడు. ”1800 మంది పిల్లల చదువులను పునీత్ రాజ్‌కుమార్ చూసుకుంటున్నారు. ఆయన దానిని ప్రారంభించినందుకు నేను గర్వపడుతున్నాను. దాన్ని కొనసాగిస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాను. ఇక నుంచి పునీత్ తరపున వారి చదువులు నేను చూసుకుంటాను’ అని విశాల్ చెప్పుకొచ్చారు.
“ఎనిమీ” చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించగా, ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని మినీ స్టూడియోస్ బ్యానర్‌పై వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆర్య మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మృణాళిని రవి, మమతా మోహన్‌దాస్, ప్రకాష్ రాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. “ఎనిమీ” నవంబర్ 4న గ్రాండ్ రిలీజ్ కానుంది.