Kamal Haasan: లోకనాయకుడు అని అభిమానులు గౌరవంగా పిలుచుకునే కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీతో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య క్లయిమాక్స్ లో మెరుపులా మెరిసి, మూవీని మరో స్థాయికి తీసుకెళ్ళాడు. 67 సంవత్సరాల వయసులో కమల్ చేసిన యాక్షన్ సీన్స్ ఆయన అభిమానులలో ఆనందాన్ని నింపాయి. అంతేకాదు… కమల్ హాసన్ లో కొత్త ఉత్సాహాన్నీ కలిగించాయి. అందుకే ఆయన తన రాబోయే పుట్టిన రోజున ‘విక్రమ్’ శతదినోత్సవ వేడుకను జరుపబోతున్నారు.
Read Also: Comedian Ali: బిగ్ బ్రేకింగ్.. ఆలీకి కీలక పదవి కట్టబెట్టిన జగన్
యాక్షన్ చిత్రాల దర్శకుడుగా పేరుతెచ్చుకున్న లోకేష్ కనకరాజు ఇప్పుడు ‘విక్రమ్’ సీక్వెల్ కథను రాసుకోవడంలో బిజీగా ఉన్నాడని అంటున్నారు. ప్రస్తుతం రాజకీయ రంగంలోనూ ఉన్న కమల్ హాసన్… ‘విక్రమ్’ మూవీ విజయోత్సవాన్ని నవంబర్ 7వ తేదీ చెన్నైలోని కలైవానర్ అరంగమ్ ఆడిటోరియంలో జరుపబోతున్నారు. నిజానికి ఇలా ఓ సినిమాకు శతదినోత్సవం జరిగి చాలా కాలమే అయ్యింది. సో… ఈ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొనే ఆస్కారం ఉంది. ఈ సినిమాను తెలుగులో హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేశారు. తమిళంతో పాటు తెలుగులోనూ ‘విక్రమ్’ చక్కని విజయాన్ని సొంతం చేసుకోవడం విశేషం.
