Vijayendra Prasad Reveals His Success Secret: దర్శకధీరుడు రాజమౌళి ఓటమి ఎరుగని దర్శకుడిగా ఎదగడంలో.. విజయేంద్ర ప్రసాద్ ప్రధాన కారణమని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే.. ఆయన రాసిన కథలతోనే జక్కన్న సినిమాలు తీశారు. జక్కన ఊహాత్మక ప్రపంచానికి తన కలంతో రంగలు అద్దారు. ఒక్క జక్కన్న చిత్రాలకే కాదండోయ్.. ఎన్నో హిందీ, తమిళం, కన్నడ సినిమాలకూ స్టోరీలు అందించారు. ప్రస్తుతం జక్కన్న, మహేశ్ సినిమా కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. అలాంటి విజయేంద్ర ప్రసాద్.. తాను స్టోరీలు రాయను, దొంగలిస్తానంటూ షాకింగ్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
త్వరలో గోవాలో జరగబోయే 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో (IFFI) భాగంగా.. తాజాగా ఫిల్మ్ రైటింగ్‌పై విజయేంద్ర ప్రసాద్ స్పెషల్ క్లాసెస్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అబద్ధాలు చెప్పేవారే మంచి స్టోరీ రైటర్స్ అని కామెంట్ చేశారు. ఏం లేని దాన్నుంచి కొత్తగా క్రియేట్ చేసి, ఆసక్తికర అంశాన్ని వెలికి తీయడమే రచయిత ముఖ్య లక్షణమని తెలిపారు. హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్‌తో పాటు ప్రేక్షకులను మెప్పించే కథలను రాయాలని.. అయితే ఈ విషయంలో మనం వెనుకబడి ఉన్నామని పేర్కొన్నారు. ఒక అబద్దాన్ని అందంగా చూపించడమే కథా రచన అని వివరించారు. తాను కొత్తగా కథలు రాయనని, దొంగలిస్తానని చెప్పారు.
మన చుట్టే ఎన్నో కథలు ఉంటాయని, నిజ జీవితంలోనూ అనేక కథలుంటాయని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. అలాగే మన ఇతిహాసాలు, రామాయణం, మహాభారతం, మన చరిత్రల నుంచి అనేక కథలు వస్తాయని.. తాను కూడా అక్కడి నుంచే కథలను తీసుకుంటానని చెప్పారు. ఆ కథలని మనదైన శైలిలో రచించాలని విశదీకరించారు. ఇదే తన సక్సెస్ సీక్రెట్ అని చెప్పుకొచ్చారు. కాగా.. విజయేంద్ర ప్రసాద్ ఇటీవలె రాజ్యసభ పదవికి ఎంపికైన సంగతి తెలిసిందే!
