తమిళనాడు ముఖ్యమంత్రి , తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్‌కు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. ఆయన సతీమణి సంగీత తన విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకోవడంతో ఈ సుదీర్ఘ వివాదానికి తాత్కాలికంగా తెరపడింది. చెంగల్పట్టులోని కుటుంబ సంక్షేమ కోర్టులో నడుస్తున్న ఈ విడాకుల కేసును సంగీత వెనక్కి తీసుకోవడంతో న్యాయమూర్తి కేసును పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు..
గతంలో అంటే 2025 డిసెంబరు 5న సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించి విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ఈ కేసు విచారణకు సంగీత నేరుగా రాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. విచారణ సందర్భంగా తన విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ఆమె కోర్టుకు తెలియజేశారు. దీనిపై విజయ్ తరఫు న్యాయవాదులు కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో, న్యాయస్థానం కేసును అధికారికంగా క్లోజ్ చేసింది.
హఠాత్ నిర్ణయం వెనుక కారణమేంటి?
విజయ్ , సంగీతల విడాకుల వ్యవహారం గత కొంతకాలంగా తమిళనాడు రాజకీయాలతో పాటు సినీ వర్గాల్లోనూ తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే, హఠాత్తుగా సంగీత ఈ పిటిషన్‌ను ఎందుకు వెనక్కి తీసుకున్నారు అనే దానిపై మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక స్పష్టత రావలసి ఉంది. ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదిరిందా లేదా ఇతర కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి సీఎం విజయ్‌కు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశంగా మారింది.

