NTV Telugu Site icon

Jana Gana Mana: పూరీ – విజయ్‌ల ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రద్దయ్యిందా?

Jana Gana Mana Shelved

Jana Gana Mana Shelved

Vijay Deverakonda Puri Jagannadh Prestigious Project Jana Gana Mana Shelved: పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండలో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘జన గణ మన’ సినిమా రద్దయ్యిందా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, ఈ సినిమా షూటింగ్‌ని ఆపేశారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం వల్లే, మేకర్స్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. నిజానికి.. లైగర్ సినిమా మీద కాన్ఫిడెంట్‌తో ‘జన గణ మన’ సినిమాను ప్రారంభించారు. మార్చి చివర్లోనే ప్రాజెక్ట్‌ని అధికారికంగా ప్రకటించి, ఆ సమయంలోనే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. అనంతరం జూన్ 4వ తేదీన షూటింగ్ మొదలుపెట్టి, ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేశారు.

ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ సినిమాను సైతం ప్యాన్ ఇండియా సినిమాగానే తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఏకంగా రూ. 200 కోట్ల బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మించాలని అనుకున్నారు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ కావడం వల్లే, డైరెక్టర్ పూరీ బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా చాలా గ్రాండ్‌గా రూపొందించాలని భావించాడు. ఏరికోరి మరి.. హ్యాపెనింగ్ బ్యూటీ పూజా హెగ్డేని హీరోయిన్‌గా రంగంలోకి దింపాడు. పేరుగడించిన టెక్నీషియన్లను రంగంలోకి దింపాడు. కానీ.. లైగర్ బోల్తా పడిన తర్వాత ‘జన గణ మన’ ప్లాన్స్ అన్ని చెల్లాచెదురయ్యాయి. లైగర్ భారీ నష్టాలు మిగల్చడంతో.. జన గణ మన బడ్జెట్ విషయంలో తేడాలు వచ్చేశాయి. అందుకే, ఈ ప్రాజెక్ట్ ఆపేయాలని నిర్ణయించినట్టు వార్తలొస్తున్నాయి.

లైగర్ రిజల్ట్ వచ్చిన తర్వాత విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్, నిర్మాతలు కూర్చొని.. ‘జన గణ మన’ సినిమాపై సుదీర్ఘంగా చర్చలు జరిపారట! చివరికి బడ్జెట్ సరిపోదని తేలడంతో, ఈ ప్రాజెక్ట్‌ని ఆపేయడమే శ్రేయస్కరమని కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్నారట! ఒకవేళ ఇదే నిజమైతే, పూరీ జగన్నాథ్ సరైన నిర్ణయమే తీసుకున్నాడని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. లైగర్‌తో చాలా నష్టాలొచ్చాయని కాబట్టి, జన గణ మన నిర్మాణ సమయంలో కచ్ఛితంగా ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని, దాంతో ఆ ప్రాజెక్టు ఎటూ కాకుండా పోతుందని అంటున్నారు. అంత రిస్క్ తీసుకోవడం కంటే, ప్రాజెక్ట్ ఆపేయడం బెటరంటున్నారు. అయితే.. దీనిపై అధికార సమాచారం రావాల్సి ఉంది.