Vijay Deverakonda Fans Trending Unstoppable Liger Trend: బాలీవుడ్‌లో ఇప్పుడు బాయ్‌కాట్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే! ఆల్రెడీ ఈ ట్రెండ్ దెబ్బకు ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలు నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’, ‘రక్షా బంధన్’ సినిమాలు బలి అయిపోయాయి. కాసుల వర్షం కురిపిస్తాయనుకున్న ఆ చిత్రాలు.. బాయ్‌కాట్ ట్రెండ్ ప్రభావానికి ఘోరంగా చతికిలపడ్డాయి. ఇప్పుడు లైగర్‌ని కూడా బాయ్‌కాట్ చేయాలంటూ హిందీ ఆడియన్స్ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే #BoycottLiger అనే హ్యాష్‌ట్యాగ్‌ను విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు.
‘లైగర్’ సినిమాను హిందీలో ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహర్ విడుదల చేస్తున్నాడు. అతనిపై అక్కడ భారీ స్థాయిలో నెగెటివిటీ ఉంది కాబట్టి, అతని ప్రాజెక్టుల్ని బ్యాన్ చేయాలని హిందీ ఆడియన్స్ ఫిక్సయ్యారు. లేటెస్ట్‌గా ‘లైగర్’ని ఆయన విడుదల చేస్తున్నాడు కాబట్టి.. ఈ చిత్రాన్ని బహిష్కరించాలన్న ఉద్దేశంతో, #BoycottLiger అనే ట్రెండ్‌కి తెరలేపారు. అయితే.. ఇది పూర్తిస్థాయి కరణ్ జోహర్ ప్రాజెక్ట్ కాదు. కేవలం హిందీలో రిలీజ్ చేసేందుకు ఆయన్ను ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం చేసుకున్నారు. హిందీ రిలీజ్ వరకే ఆయన పాత్ర ఉందే తప్ప.. అంతకుమించి ఇంకేం లేదు. అందుకే.. #BoycottLiger ట్రెండ్‌కి కౌంటర్‌గా రౌడీ ఫ్యాన్స్, తెలుగు సినీ ప్రియులు #iSupportLIGER #UnstoppableLiger అనే హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్ చేస్తున్నారు.
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించిన విజయ్ దేవరకొండ లాంటి హీరో సినిమాని బాయ్‌కాట్ చేయాలని ట్రెండ్ చేయడం సరికాదని ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. విజయ్ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్లే.. లైగర్‌ను బాయ్‌కాట్ చేయాలని చూస్తున్నారని మండిపడుతున్నారు. దీనికితోడు.. ఇప్పటికే బాలీవుడ్‌పై దక్షిణాది పరిశ్రమ ఆధిపత్యం చెలాయిస్తుంది. ఇప్పుడు లైగర్ కూడా విడుదలై, బ్లాక్‌బస్టర్ హిట్ కొడుతుందన్న భయంతోనే.. ఇలా బాయ్‌కాట్‌కు పిలుపు ఇస్తున్నట్టు కనిపిస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా బాయ్‌కాట్ ట్రెండ్ చిత్ర పరిశ్రమకు కొత్త సమస్యగా మారింది. మరి, దీన్ని ‘లైగర్’ ఎలా అధిగమిస్తుందో చూడాలి.