Liger Scam: దాదాపు 12 గంటల తరువాత ఎట్టకేలకు విజయ్ దేవరకొండ ఈడీ విచారణ పూర్తయ్యింది. గత కొన్నిరోజులుగా లైగర్ సినిమా మనీ ల్యాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న విషయం విదితమే. సినిమాలో విదేశీ పెట్టుబడులు ఉన్నాయని ఆరోపణలు రావడంతో ఈడీ చిత్ర బృందాన్ని విచారిస్తోంది. ఇప్పటికే డైరెక్ట పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మిని అధికారులు విచారించారు. లైగర్ సినిమా దాదాపు 135 కోట్ల రూపాయలతో నిర్వహించామని, విదేశీ పెట్టుబడులు ఏమి లేవని వారు చెప్పినట్లు సమాచారం. ఇక ఈ స్కామ్ లో నోటీసులు అందుకున్న విజయ్ నేడు విచారణకు హాజరయ్యాడు.
దాదాపు 12గంటలు.. విజయ్ ను ప్రశ్నించారు అధికారులు. ఈ పెట్టుబడుల్లో విజయ్ కు సంబంధం ఉందా..? లేదా అని తెలుసుకున్నారని సమాచారం. సినిమాకు రెమ్యూనిరేషన్ తీసుకున్నారా..? లేక రెవిన్యూ షేరింగ్ అందుకున్నారా..? అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇక విచారణ అనంతరం విజయ్ మాట్లాడుతూ ” ఈడీ కార్యాలయానికి ఉదయమే వచ్చాను. ఈడీ వాళ్లకు కొన్ని క్లారిఫికేషన్ కావాల్సి ఉండింది.. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను.. ప్రేమించే మనుషులు ఉన్నప్పుడు లాభాలు ఉంటాయి..అలానే కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి.రేపు రమ్మని పిలవలేదు. నన్ను విచారణకు రమ్మని పిలవడంతో వచ్చాను. నా డ్యూటీ నేను చేశాను.. వారికి కావాల్సింది వారికి దొరికిందనే అనుకుంటున్నాను” అని చెప్పుకొచ్చాడు. ఇక ఏ కేసు పై విచారించారు అన్న ప్రశ్నకు విజయ్ మాట దాటేశాడు.