Site icon NTV Telugu

Victory Venkatesh: విరాటపర్వం అవార్డ్ విన్నింగ్ సినిమా అవుతుంది

Venky Speech At Virata Parvam

Venky Speech At Virata Parvam

‘విరాటపర్వం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన విక్టరీ వెంకటేశ్.. తనకు సినిమాలంటే ఎంతో గౌరవమని, విరాటపర్వం లాంటి సినిమాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నానని, అందుకే తాను ఈ ఈవెంట్‌కి వచ్చానని అన్నారు. అనంతరం విరాటపర్వంలోని ఓ డైలాగ్ చెప్పి వేదికని ఉర్రూతలూగించిన వెంకటేశ్.. రానాపై పొగడ్తల వర్షం కురిపించారు. లీడర్ నుంచి రానా ప్రతీ పాత్రను చాలా సిన్సియర్‌గా పోషిస్తున్నాడని, సినీ ప్రియులూ అతడ్ని ఆదరిస్తున్నారని, అతని పాత్రల్ని మెచ్చుకుంటున్నారని, అందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు.

రేపు హానెస్ట్ సినిమాల ప్రస్తావన వస్తే, విరాటపర్వం పేరు కచ్ఛితంగా వస్తుందని.. దర్శకుడు అంత గొప్పగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడని వెంకటేశ్ అన్నారు. రైటింగ్ దగ్గర నుంచి ప్రొడక్షన్ దాకా ప్రతీదీ చక్కగా కుదిరాయన్న ఆయన.. సినిమా చూశాకే ఇది ఎంత మంచి చిత్రమో అర్థమవుతుందని చెప్పారు. ఈ చిత్రంలో ప్రతిఒక్కరూ అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేశారని నటీనటుల్ని కొనియాడారు. ముఖ్యంగా.. సాయి పల్లవి ఈ చిత్రంలో అదరగొట్టేసిందన్నారు. ఇది ఆమె కెరీర్‌లోని ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోతుందని వెంకీ వెల్లడించారు.

సాయి పల్లవి స్మైల్ చాలా క్యూట్‌గా ఉంటుందని చెప్పిన వెంకటేశ్.. ఈ చిత్రానికి గాను ఉత్తమ నటిగా సాయి పల్లవి కచ్ఛితంగా జాతీయ పురస్కారం అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మాట తానే కాదు, సినిమా చూసిన ప్రతిఒక్కరూ చెప్తారన్నారు. తన పాత్రలో ఆమె జీవించేసిందన్నారు. తన సన్నిహితులు సైతం సాయి పల్లవి ప్రదర్శనకు ఫిదా అయ్యారన్నారు. జూన్ 17న వస్తోన్న ఈ సినిమా చూశాక.. అందరూ ‘సూపర్, ఎక్స్‌ట్రార్డినరీ, అదిరిపోయిందిగా’ అని అంటారని తన ఎఫ్3 సినిమాలోని డైలాగ్‌ని వెంకటేశ్ ఉచ్ఛరించారు.

Exit mobile version