NTV Telugu Site icon

Victory Venkatesh: అదే.. ‘విక్టరీ’ వెంకటేష్ విజయ రహస్యం

Venkatesh

Venkatesh

Victory Venkatesh: ప్రస్తుతం నవతరం కథానాయకుల్లో ఎంతోమంది నిర్మాతల తనయులు హీరోలుగా సాగుతున్నారు. వారందరికీ రోల్ మోడల్ ఎవరంటే ‘విక్టరీ’ వెంకటేష్ అనే చెప్పాలి. నిర్మాతల వారసుల్లో నటులుగా మారి ఘనవిజయం సాధించిన స్టార్ హీరోగా వెంకటేష్ తనదైన బాణీ పలికించారు. ఆయన సక్సెస్‌ను చూసిన తరువాతే ఎంతోమంది నిర్మాతలు తమ కుమార రత్నాలను హీరోలుగా పరిచయం చేయడానికి పరుగులు తీశారు. అయితే ఇప్పటి దాకా ఎవరూ వెంకటేష్ స్థాయి విజయాలను అందుకోలేదు. ఒకప్పుడు వరుస విజయాలతో ‘విక్టరీ’నే ఇంటిపేరుగా మార్చుకున్నారు వెంకటేష్. కొన్నిసార్లు ట్రాక్ తప్పినా, మళ్ళీ వైవిధ్యంతోనే విజయపథాన్ని చేరుకుంటున్నారు.

కాలానికి అనుగుణంగా సాగుతున్నారు వెంకటేష్. నవతరం స్టార్లతోనూ జోడీ కడుతూ వినోదం పండిస్తున్నారు. మరోవైపు తన వయసుకు తగ్గ పాత్రలతో ఓటీటీలోనూ సందడి చేస్తున్నారు. అప్పట్లో వెంకటేష్ హీరోగా రూపొందిన ‘నారప్ప’ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలయింది. ఇప్పుడు అదే చిత్రం వెంకటేష్ బర్త్ డే సందర్భంగా డిసెంబర్ 13న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది. వెంకటేష్ తండ్రి డి.రామానాయుడు సొంతంగా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నెలకొల్పి తొలి ప్రయత్నంగా యన్టీఆర్ ద్విపాత్రాభినయంతో ‘రాముడు-భీముడు’ చిత్రం నిర్మించారు.’సురేష్ ప్రొడక్షన్స్’ సంస్థ బ్యానర్ ‘ఎస్.పి.’ లోగోలో కనిపించే ఇద్దరబ్బాయిలు – వెంకటేశ్, ఆయన అన్న సురేష్ బాబు. విశేషమేమిటంటే – బ్యానర్ లోగోలో ‘ఎస్’ అక్షరంపై ఉన్న వెంకటేష్ స్టార్ కాగా, ‘పి’ అక్షరంపై ఉన్న సురేష్ ప్రొడ్యూసర్ అయ్యారు. అలా తొలిసారి తెరపై 1964లోనే బ్యానర్ లోగోలో కనిపించారు వెంకటేష్. తరువాత 1971లో తన తండ్రి నిర్మించిన ‘ప్రేమనగర్’లో చిన్నప్పటి సత్యనారాయణగా నటించారు వెంకీ.

ఇక హీరోగా వెంకటేష్ సినీప్రస్థానం 1986లో రూపొందిన ‘కలియుగ పాండవులు’తో మొదలైంది. ఈ సినిమా ఘనవిజయం సాధించింది. తరువాత వచ్చిన చిత్రాలేవీ అంతగా అలరించలేదు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో వెంకీ హీరోగా ‘బ్రహ్మపుత్రుడు’ నిర్మించారు రామానాయుడు. ఈ సినిమాతో మాస్‌కు చేరువయ్యారు వెంకటేష్. తన తరం హీరోలలో రీమేక్స్‌తో ఎక్కువ విజయాలను చూసిన ఘనత వెంకటేష్‌కే దక్కుతుంది. అతడు తొలిసారి నటించిన రీమేక్ ‘భారతంలో అర్జునుడు’. హిందీలో విజయం సాధించిన ‘అర్జున్’ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. కానీ ఇది పరాజయం పాలైంది. తరువాత హిందీ ‘నసీబ్’ ఆధారంగా వెంకటేష్ ‘త్రిమూర్తులు’ రూపొందింది. ఇది ఏవరేజ్‌గా ఆడింది. తమిళ చిత్రం ‘తాయ్ మేల్ ఆనై’ ఆధారంగా తెరకెక్కిన ‘రక్తతిలకం’ వెంకటేష్‌కు జయాన్ని అందించింది.

తమిళ ‘చిన్నతంబి’ ఆధారంగా రూపొందిన ‘చంటి’ 1992 బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఆ సినిమా ఘనవిజయంతో వరుసగా “చినరాయుడు, సుందరకాండ, కొండపల్లి రాజా, అబ్బాయిగారు” రీమేక్‌లలో నటించారు వెంకటేష్. తమిళ చిత్రం ‘తాయ్ కులమే తాయ్ కులమే’ ఆధారంగా ‘ఇంట్లో ఇల్లాలు- వంటింట్లో ప్రియురాలు’ తెరకెక్కి, విజయం సాధించింది. “సూర్యవంశం, రాజా” చిత్రాలు సైతం రీమేక్స్‌గా తెరకెక్కి వెంకటేష్‌కు ఘనవిజయాలను అందించాయి. అతడు నటించిన “జెమినీ, సంక్రాంతి, ఈనాడు, నాగవల్లి, బాడీగార్డ్, మసాల, దృశ్యం, గోపాల గోపాల, గురు, నారప్ప, దృశ్యం-2” చిత్రాలు సైతం రీమేక్స్ కావడం విశేషం. అంటే వెంకటేష్ ఇప్పటికీ రీమేక్స్ పై ఆధారపడి సాగుతున్నారని చెప్పవచ్చు.

చిరంజీవి, బాలకృష్ణ తెరపై కలసి కనిపించిన ఏకైక చిత్రం ‘త్రిమూర్తులు’. ఈ సినిమాలోవెంకటేష్ హీరో. హిందీ ‘నసీబ్’ ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని టి.సుబ్బరామిరెడ్డి నిర్మించారు. ఇదే సీన్ లో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు కూడా కనిపించడం విశేషం. నంది అవార్డుల్లోనూ వెంకటేష్ ఓ ప్రత్యేకత చూపించారనే చెప్పాలి. ‘ప్రేమ’ చిత్రం ద్వారా 1988 సంవత్సరం ఉత్తమ నటునిగా నంది అవార్డును అందుకున్నారు. ఇదే ఆయన బెస్ట్ యాక్టర్ గా అందుకున్న తొలి నంది అవార్డు. తరువాత ‘ధర్మచక్రం’ ద్వారా 1995 ఉత్తమనటునిగానూ నందిని సొంతం చేసుకున్నారు. ఆపై 1998లో ‘గణేష్’ చిత్రం ద్వారా, 1999లో ‘కలిసుందాం…రా’ సినిమాతోనూ ఉత్తమ నటునిగా నంది అవార్డులను అందుకున్నారు. 2007లో ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రంతోనూ ఉత్తమనటునిగా నందిని తనతో తీసుకువెళ్ళారు. ఇలా మొత్తం ఐదు సార్లు ఉత్తమనటునిగా నిలచిన ఏకైక హీరోగా వెంకటేష్ చరిత్ర సృష్టించారు.

“జయమ్ము నిశ్చయమ్మురా, సోగ్గాడు, కృష్ణం వందే జగద్గురుమ్, ప్రేమమ్, అజ్ఞాతవాసి” చిత్రాలలో అతిథిగా కనిపించారు వెంకటేష్. ఆయన హీరోగా రూపొందిన ‘గురు’ చిత్రంలో “జింగిడి…” పాటతో గాయకునిగానూ మారారు. టాప్ స్టార్స్ లో ఓటీటీ బాట పట్టిన తొలి హీరో వెంకటేష్ అనే చెప్పాలి. ఆయన నటించిన “నారప్ప, దృశ్యం-2” నేరుగా ఓటీటీల్లో విడుదలై అలరించాయి. ఇటీవల ‘ఓరి దేవుడా’ చిత్రంలో దేవుని పాత్రలో కనిపించిన వెంకటేష్ ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తోన్న హిందీ సినిమా ‘కిసీ కా భాయ్, కిసీ కా జాన్’ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో వెంకటేష్ “అనారీ, తక్దీర్ వాలా” వంటి హిందీ చిత్రాలలో హీరోగా నటించారు. అలాగే నెట్ ఫ్లిక్స్ కోసం ‘రానా నాయుడు’ అనే వెబ్ సీరీస్ లో నటిస్తున్నారు. అందులో నాయుడు పాత్రలో ఆయన కనిపించనున్నారు.

Read Also: ఇప్పటివరకు ఒక్క ప్లాప్ కూడా అందుకొని దర్శకులు..

ఇలా ఎప్పటికప్పుడు వైవిధ్యాన్ని ఆసరా చేసుకుని వెంకటేష్ సాగుతున్నారు. అందువల్లే విజయాలు ఆయనను వరిస్తున్నాయని చెప్పవచ్చు. మునుపటిలా భారీ విజయాలేమీ ఆయన చూడకున్నా, ఉన్నంతలో సక్సెస్ సొంతం చేసుకుంటున్నారు వెంకీ. వైవిధ్యమే వెంకటేష్ విజయరహస్యమని చెప్పక తప్పదు.

(డిసెంబర్ 13న వెంకటేష్ పుట్టినరోజు)

Show comments