RS Shivaji: చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ నటుడు, కమెడియన్ RS శివాజీ(66) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ నేటి ఉదయం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శివాజీ తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా మంచి సినిమాల్లో నటించాడు. ముఖ్యంగా చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో.. శ్రీదేవి వెతికే పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో ఆయన నటన అద్భుతమని చెప్పాలి. కేవలం ఆ సినిమానే కాకుండా హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వందకు పైగా సినిమాల్లో నటించాడు.
ఇక గతేడాది సాయి పల్లవి నటించిన గార్గి సినిమాలో ఆయనకు తండ్రిగా.. చిన్నపిల్లను లైంగికంగా వేధించిన కీచకుడిగా ఆయన నటనకు మంచి మార్కులే పడ్డాయి. కమల్ హాసన్ కు శివాజీ మంచి ఫ్రెండ్.. కమల్ తో కలిసి విక్రమ్, సత్య, అపూర్వ సగోదరగళ్, మైఖేల్ మదన కామరాజు, గుణ, చాచి 420, అన్బేశివం లాంటి సినిమాలో నటించి మెప్పించాడు. ఇక శివాజీ.. తండ్రి ఎంఆర్ సంతానం నిర్మాత. ఆయన కూడా కోలీవుడ్ లో మంచి సినిమాలనే నిర్మించాడు. ఇక శివాజీ మృతితో కోలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. శివాజీ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇంకోపక్క ఆయన అభిమానులు సైతం విషాదంలో మునిగిపోయారు.