ప్రముఖ దర్శక నిర్మాత రామానంద్ సాగర్ రూపొందించిన బుల్లితెర ధారావాహిక ‘రామాయణ్’ను ఎవరూ అంత తేలికగా మర్చిపోలేరు. అందులో కీలక పాత్రలు పోషించిన పలువురు నటీనటులు ఆ తర్వాత రాజకీయ జీవితంలోనూ ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఈ సీరియల్ లో రావణాసురుడి పాత్రకు ప్రాణం పోసిన అరవింద్ త్రివేది (82) మంగళవారం రాత్రి ముంబైలో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన మేనల్లుడు కౌస్తభ్ త్రివేది తెలియచేస్తూ, ‘కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే ముందు గుండెపోటుకు గురయ్యారు, ఆ తర్వాత మిగిలిన అవయవాలు పనిచేయడం మానేశాయి. దాంతో తుది శ్వాస విడిచారు’ అని తెలిపారు. బుధవారం ఉదయం కాందివలీ వెస్ట్ లోని శ్మశాన వాటికలో అరవింద్ త్రివేది అంత్యక్రియలను పూర్తి చేశారు.
‘రామాయణ్’తో పాటు పాపులర్ టీవీ షో ‘విక్రమ్ ఔర్ బేతాళ్’లోనూ అరవింద్ త్రివేది నటించారు. అలానే గుజరాతీ చిత్రసీమతో ఆయనకు మూడు దశాబ్దాల అనుబంధం ఉంది. ఆయన సోదరుడు ఉపేంద్ర త్రివేది కూడా పేరున్న నటుడే. ప్రముఖ గుజరాతీ చిత్రం ‘దేశ్ రే జోయా దాదా పరదేశ్ జోయా’ మూవీ అరవింద్ త్రివేదికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాను తెలుగులో ఎమ్మెస్ రెడ్డి ‘వెలుగు నీడలు’ పేరుతో రీమేక్ చేశారు. గుజరాతీలో అరవింద్ త్రివేది పోషించిన పాత్రను తానే పోషించారు. అరవింద్ త్రివేది 1991 నుండి 1996 వరకూ, అలానే 2002 – 2003 వరకూ పార్లమెంట్ సభ్యునిగానూ వ్యవహరించారు. సి.బి.ఎఫ్.సి. యాక్టింగ్ ఛైర్మన్ గానూ ఆయన కొంతకాలం వ్యవహరించారు. అరవింద్ త్రివేది మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.