ఆయన కత్తెర వేటుతో వందలాది చిత్రాలు కళకళలాడాయి. ఆయన `కత్తెర కళ`ను మెచ్చి ప్రభుత్వ `నందులు` నడచుకుంటూ ఆయన ఇంటికి వెళ్ళాయి. సినిమా ఎడిటింగ్ లో మాన్యువల్ మొదలు అవిడ్ దాకా అన్నిటా పనిచేసి భళా అనిపించుకున్నారు ఎడిటర్ గౌతమ్ రాజు. ధవళ వస్త్రాలు దరించి, పొడవాటి జుట్టుతో, తీక్షణమైన చూపులతో, అతి సాధారాణంగా కనిపించే గౌతమ్ రాజు ఎడిటింగ్ తోనే వందలాది చిత్రాలు విజయతీరాలను చేరాయంటే వినడానికి ఆశ్చర్యం కలుగుతుంది. గౌతమ్ రాజు మితభాషి. ఆయనకు తెలిసిన భాష ఒక్కటే కష్టించి పనిచేయడం. కొన్ని రోజుల పాటు సూర్యుని వెలుగు కూడా చూడకుండా గౌతమ్ రాజు పనిచేశారని ఆయన సన్నిహితులు అంటారు. ఇక గౌతమ్ రాజు శిష్య, ప్రశిష్యులు తమ గురువును మించిన వారు లేరనీ చెబుతారు. అన్నిటినీ వింటూ చిద్విలాసంగా తన పనిలో తాను నిమగ్నమై, తన దరికి చేరిన సినిమాను జనరంజకంగా మలచడానికి తపించేవారు గౌతమ్ రాజు.
గౌతంరాజు 1954లో జన్మించారు. స్వస్థలం ఒంగోలు. అయితే ఆయన తండ్రి వృత్తిరీత్యా మద్రాసులో ఓ కంపెనీలో పనిచేసేవారు. అందువల్ల గౌతమ్ రాజు చదువు, సంధ్య అన్నీ అక్కడే సాగాయి. గౌతమ్ రాజుకు ఇద్దరు సోదరులు, ఓ సోదరి. మొత్తం కుటుంబానికి తండ్రి జీతమే ఆధారం. గౌతమ్ రాజు బి.ఏ. సెకండ్ఇయర్ చదువుతూ ఉండగా, తాను కూడా పనిచేస్తే తండ్రికి అంతో ఇంతో ఆదరంగా ఉంటుందని భావించారు. దాంతో చదువుకు స్వస్తి పలికి మొదట్లో చిన్నచిన్న పనులు చేశారు. ఓ తెలిసిన వ్యక్తి ద్వారా ప్రముఖ దర్శకుడు, ఎడిటర్ అక్కినేని సంజీవి (ఎల్.వి.ప్రసాద్ సోదరులు, ఈ నాటి మేటి ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ తండ్రి) వద్ద అసిస్టెంట్ గా చేరారు గౌతమ్ రాజు. సంజీవి వద్ద ఉండగానే పలు చిత్రాలకు అసిస్టెంట్ ఎడిటర్ గా ఉండి, మెలకువలు నేర్చుకున్నారు. సంజీవి ఎడిటింగ్ లోనే జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత వి.బి.రాజేంద్ర ప్రసాద్ తెరకెక్కించిన చిత్రాల కూర్పు సాగేది. రాజేంద్రప్రసాద్ తమిళంలోనూ కొన్ని చిత్రాలు రూపొందించారు. ఆ సమయంలో ఆయనకు అసోసియేట్ డైరెక్టర్ గా ఎస్.ఏ.చంద్రశేఖర్ (నేటి తమిళ స్టార్ హీరో విజయ్ తండ్రి) పనిచేసేవారు. ఆయనతో గౌతమ్ రాజుకు పరిచయం ఏర్పడింది. గౌతమ్ రాజు `కటింగ్ కళ` మెచ్చిన చంద్రశేఖర్ తాను తొలిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి ఆయనను ఎడిటర్ గా ఎంచుకున్నారు. ఎస్.ఏ.చంద్రశేఖర్ తొలిసారి దర్శకత్వం వహించిన `అవల్ ఒరు పచై కుళందై` చిత్రమే ఎడిటర్ గా గౌతమ్ రాజు తొలి సినిమా! తరువాత ఎస్.ఏ.చంద్రశేఖర్ రూపొందించిన చిత్రాలకు ఎడిటర్ గా పనిచేశారు. అందులో చిరంజీవి హీరోగా చంద్రశేఖర్ తెలుగులో రూపొందించిన `చట్టానికి కళ్ళులేవు` ఒకటి. ఈ సినిమాకు గౌతమ్ రాజు రూ.8000 పారితోషికం అందుకున్నారు. తెలుగులో అదే ఆయన అందుకున్న తొలి పారితోషికం.
జంధ్యాల తెరకెక్కించిన `నాలుగు స్తంభాలాట`తో గౌతమ్ రాజు, జంధ్యాల బంధం కుదిరింది. తరువాత జంధ్యాల తెరకెక్కించిన `శ్రీవారికి ప్రేమలేఖ` ద్వారానే బెస్ట్ ఎడిటర్ గా తొలి నంది అవార్డును అందుకున్నారు గౌతమ్ రాజు. తరువాత యేడాది `మయూరి`తోనూ ఉత్తమ కూర్పరిగా నందిని సొంతం చేసుకున్నారాయన.1981లో ఎడిటర్ గా ప్రయాణం మొదలెట్టిన గౌతమ్ రాజు 1985 నాటికే వంద చిత్రాలు పూర్తిచేయడం విశేషం! సంచలన విజయం సాధించిన ఉషాకిరణ్ మూవీస్ వారి `ప్రతిఘటన` గౌతమ్ రాజు నూరవ చిత్రం. చందమామ రావే (1987), హాయ్ హాయ్ నాయకా (1988), భారతనారి (1989) చిత్రాలతో బెస్ట్ ఎడిటర్ గా `హ్యాట్రిక్` సాధించారు గౌతమ్ రాజు. తరువాత వి.వి.వినాయక్ తొలి చిత్రం `ఆది`తోనూ బెస్ట్ ఎడిటర్ గా నిలిచారు. మొత్తం ఆరు సార్లు బెస్ట్ ఎడిటర్ గా నంది అవార్డును సొంతంచేసుకొని ప్రత్యేకంగా నిలిచారు గౌతమ్ రాజు. ఇప్పటి దాకా దాదాపు 800 పై చిలుకు చిత్రాలకు ఆయన ఎడిటర్ గా పనిచేశారు. ఆయన వద్ద అసిస్టెంట్స్ గా పనిచేసిన వారెందరో నేడు చిత్రసీమలో ఎడిటర్స్ గా రాణిస్తున్నారు. వృత్తినే దైవంగా భావించి సాగిన గౌతమ్ రాజు ఎందరో భావి కూర్పరులకు స్ఫూర్తిగా నిలిచారు. భౌతికంగా గౌతమ్ రాజు లేకున్నా,ఆయన `కటింగ్ కళ`తో రూపొందిన పలు చిత్రాలు జనాన్ని భవిష్యత్ లోనూ అలరిస్తూనే ఉంటాయని చెప్పవచ్చు.