ఒక డైరెక్టర్.. ఎంతో ఇష్టపడి కథను రాసుకొని, కష్టపడి ఆ కథను ఒక సినిమాగా మలిచి.. ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఎంతో శ్రమిస్తాడు. సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు తన సొంత బిడ్డను చూసుకున్నట్లు చూసుకుంటారు. ఆ సినిమా కు ఏదైనా డ్యామేజ్ జరిగినా, సినిమా ప్రేక్షకులకు నచ్చకపోయినా ఎంతో మానసిక వేదనకు గురవుతారు.. తాజాగా ఇదే పరిస్థితిని తాను ఎదుర్కొన్నాను అని చెప్పుకొచ్చాడు దర్శకుడు వేణు ఉడుగుల. నీది నాది ఒకే కథ చిత్రంతో విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్న వేణు.. ఈ సినిమా తరువాత రానా దగ్గుబాటిని డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు. విరాట పర్వం లాంటి ఒక మంచి కథను ఎంచుకొని దానిని సెట్స్ మీదకు తీసుకెళ్లి, ఎన్నో రోజులు కష్టపడి సినిమాను పూర్తిచేశాడు. అన్ని సవ్యంగా జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది అన్నట్లు సినిమా రిలీజ్ డేట్ విడుదల అవ్వడం ఆలస్యం కరోనా లాక్ డౌన్ ప్రకటించారు. ఆ తర్వాత కొత్త రిలీజ్ డేట్.. మరోసారి వాయిదా.. మళ్లీ కొద్దిరోజులకు మరో కొత్త రిలీజ్ డేట్.. మరోసారి వాయిదా.. ఇలా జరుగుతూనే వచ్చింది.
అస్సలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా..? అని కొందరు.. ఓటిటీ లో వస్తుందంట అని మరికొందరు రకరకాల విమర్శలు చేసినా చిత్ర బృందం మాత్రం వెనుకడుగు వేయలేదు.. మంచి సినిమాను ఎప్పుడు ప్రేక్షకులకు అందించే సురేష్ ప్రొడక్షన్స్ ఎట్టకేలకు జూన్ 17 న విరాట పర్వం విడుదలకు రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఈ ప్రమోషన్ లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో వేణు ఇన్నాళ్ల తన ఆవేదనను పంచుకున్నాడు. “ఈ చిత్రం ఆలస్యం అవుతున్న కొద్దీ నేను మానసికంగా చాలా బాధ పడేవాడిని.. ఈ సినిమాను ఎన్నో ఓటిటీలు విడుదల చేయడానికి ముందుకు వచ్చాయి. కానీ వాటిని అన్ని వదులుకొని ఈ చిత్రాన్ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నందుకు నిర్మాతలకు థాంక్స్ చెప్తున్నాను.” అని ఎమోషనల్ అయ్యాడు. ఇక ఈ చిత్రంలో రానా సరసన సాయి పల్లవి నటిస్తోంది. మరి ఇన్నేళ్ల కష్టానికి ఎలాంటి ప్రతిఫలం దక్కుతుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే