NTV Telugu Site icon

35 ఏళ్ళ ‘కలియుగ పాండవులు’

Venkatesh's Kaliyuga Pandavulu Completes 40 Years

(ఆగస్టు 14న ‘కలియుగ పాండవులు’కు 35 ఏళ్ళు పూర్తి)
విక్టరీ వెంకటేశ్ హీరోగా తెరపై కనిపించిన తొలి చిత్రం ‘కలియుగ పాండవులు’ ఆగస్టు 14తో 35 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. అంటే, హీరోగా వెంకటేశ్ 35 ఏళ్ళు పూర్తి చేసుకున్నారన్న మాట! తొలి చిత్రంతోనే హీరోగా సక్సెస్ ను సొంతం చేసుకున్నారు వెంకటేశ్. ఈ చిత్రాన్ని కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో డి.రామానాయుడు తమ సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రం ద్వారాను ఖుష్బూ తెలుగు తెరకు పరిచయం అయ్యారు.

‘కలియుగ పాండవులు’ కథలో హీరో విజయ్ మొదట్లో దుర్యోధనునిలా కనిపిస్తాడు. తన ధనగర్వంతో ఇతరులను చులకనగా చూస్తూంటాడు. తనకు నచ్చిన అమ్మాయి భారతిని చెరపట్టాలని చూస్తాడు. అదే అతనిలోని మనిషిని నిద్రలేపుతుంది. భారతి మంచితనం తెలిసి, ఆమెను ప్రేమిస్తాడు. పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. అయితే విజయ్ తండ్రి కోటీశ్వరుడైన చక్రపాణి అందుకు అంగీకరించడు. అంతేకాదు, ఓ ప్లాన్ ప్రకారం భారతిని వేశ్యగా చిత్రీకరిస్తారు. అందుకు ఎమ్.ఎల్.ఏ. ఏకాంబరం, డాక్టర్ వాయునందనరావు, ఎస్.ఐ. మూర్తి, లాయర్ జలంధరరావు, భూదేవి అనే ఆమె సహకరిస్తారు. వీరితో పాటు భారతి బావ భైరవమూర్తి కూడా చేయి కలుపుతాడు. ఎందుకంటే భైరవ, భారతిని పెళ్ళాడాలని చూస్తాడు. చివరకు అవమానభారంతో భారతి ఆ ఊరు వదలి వెళ్తుంది. దాంతో తండ్రితో పోట్లాడి విజయ్ ఇంటి నుండి బయటకు వస్తాడు. భారతి కథ తెలుసుకున్న భీష్మనారాయణ అనే వ్యక్తి, ఆమెకు అండగా నిలుస్తాడు. ఆయన కూడా ఒకప్పుడు ఈ దుర్మార్గుల కారణంగా నష్టపోయి ఉంటాడు. భీష్మనారాయణ ఆదేశంతో విజయ్, అతని ముగ్గురు మిత్రులు, భారతి కలసి ‘కలియుగ పాండవులు’గా మారి అన్యాయాలను అక్రమాలను ఎదుర్కొంటూ ఉంటారు. చివరకు అసలు నేరస్థులను చట్టానికి పట్టిస్తారు. భారతి నిర్దోషి అని నిరూపిస్తారు. భవిష్యత్ లోనూ అన్యాయానికి గురయిన వారిని ఆదుకొనేందుకు ‘కలియుగ పాండవులు’ కొనసాగడంతో కథ ముగుస్తుంది.

వెంకటేశ్, ఖుష్బూ జంటగా నటించిన ఈ చిత్రంలో రావు గోపాలరావు, సరిత, అశ్వినీ, నూతన్ ప్రసాద్, రంగనాథ్, రాళ్ళపల్లి, శక్తి కపూర్, రాధారవి, రాజీవ్, నర్రా వెంకటేశ్వరరావు, చలపతిరావు, జె.వి.సోమయాజులు, పి.జె.శర్మ, పి.ఎల్.నారాయణ, మిక్కిలినేని, సూర్య, చిట్టిబాబు నటించారు. ఈ చిత్రానికి కథ, మాటలు పరుచూరి బ్రదర్స్ సమకూర్చగా, కె.ఎస్.ప్రకాశ్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. వేటూరి పాటలకు చక్రవర్తి సంగీతం తోడై అలరించింది. “ఒక పాపకు పదహారేళ్ళు…”, “హా హా హా ఆగవా…”, “నేను పుట్టినరోజు…”, “ఎందుకో ఒళ్ళు…”, “బుగ్గా బుగ్గా చెప్పాలి…”, “ఈ కౌరవ ఈ దానవ …” పాటలు ఆకట్టుకున్నాయి.

‘కలియుగ పాండవులు’ చిత్రం మంచి విజయం సాధించింది. వెంకటేశ్ ను హీరోగా నిలిపింది. ఖుష్బూకు తెలుగులో ఆదరణ లభించేలా చేసింది. వెంకటేశ్ అభిమానులు ఇప్పటికీ ఈ చిత్రాన్ని గుర్తు చేసుకుని మురిసిపోతూనే ఉండడం విశేషం!