వెంకటేశ్, పవన్ కళ్యాణ్ మధ్య అనుబంధం గురించి అందరికీ తెలిసినదే. వెంకీ అంటే పవన్ కి ఎంతో అభిమానం. ఆ అభిమానంతోనే ‘గోపాల గోపాల’ సినిమాలో పవన్ శ్రీకృష్ణుడి పాత్రలో కనిపించి మురిపించారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య దేవుడి పాత్రలతో పోటీ ఏర్పడింది. విషయానికి వస్తే వెంకటేశ్ ఓ సినిమాలో దేవుడి పాత్రలో కనిపించబోతున్నాడు. తమిళ రొమాంటిక్ ఫాంటసీ ‘ఓ మై కడవులే’ రీమేక్ లో దేవుడిగా నటిస్తున్నాడు. తమిళ సినిమా డైరెక్ట్ చేసిన అశ్వత్ మారిముత్తు తెలుగు వెర్షన్ కి కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. విశ్వక్సేన్, మిథిలా ఫాల్కర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తమిళంలో విజయ్ సేతుపతి దేవుడి పాత్రను పోషించాడు. జీవితంలో తప్పులను సరిదిద్దుకోవడానికి హీరో పాత్రధారికి అవకాశం ఇచ్చే దేవుడి పాత్రనే వెంకీ పోషిస్తున్నాడు. వెంకటేశ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది.
ఇక ఇదలా ఉంచితే తమిళంలో సముతిరఖని దర్శకత్వం వహించిన ఫీల్ గుడ్ ఫాంటసీ డ్రామా ‘వినోదాయ సీతం’ సినిమాను అతని దర్శకత్వంలోనే పునర్మిస్తున్నారు. తమిళంలో తంబిరామయ్య, సముతిరఖని ముఖ్యపాత్రలు పోషించారు. ప్రత్యేకించి సముతిరఖని దేవుడి పాత్రను పోషించి ఆకట్టుకున్నాడు. ఓ మధ్యతరగతి మనిషి అర్ధంతరంగా తనువుచాలించాల్సి వచ్చినపుడు జీవితంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవడానికి ఓ అవకాశం కల్పించే దేవుని పాత్ర అది. ఇప్పుడు ఈ పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ పోషిస్తుండటమే అసలైన న్యూస్. ఇక తంబిరామయ్య పాత్రను కొద్దిగా మార్చి యుత్ గా చేసి సాయిధరమ్ తేజ్ తో చేయిస్తున్నారు. సో అలా ఒకే తరహాలో అటు వెంకీ, ఇటు పవన్ ఇద్దరు వ్యక్తుల జీవితాలను దిద్దుకునే అవకాశం కల్పించే దేవుని పాత్రలను పోషిస్తున్నారు. ఒకరంటే ఒకరికి అభిమానం ఉన్న ఈ ఇద్దరు హీరోలు దేవుని పాత్రలలో ఎలా కనిపిస్తారు? ఎవరు ఎక్కువగా ప్రేక్షకులను మురిపించి ఆకట్టుకుంటారు? ఎవరు దేవునిగా బాక్సాఫీస్ కొల్లగొడతారు అన్నది తేలాల్సి ఉంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ.
