తెలుగు, హిందీ భాషల్లో రూపుదిద్దుకున్న ‘మేజర్’ మూవీ నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించిన సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ఇప్పుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ద్విభాషా చిత్రాన్ని నిర్మిస్తోంది. రెనైసెన్స్ పిక్చర్స్ తో కలిసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో భారీ యాక్షన్ డ్రామాను ప్రారంభించింది. 2014లో ‘ముకుంద’ సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ ఇప్పుడు ఈ మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. సోమవారం హైదరాబాద్ లోని చిత్ర నిర్మాణ సంస్థ కార్యాలయంలో జరిగిన పూజ కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైయింది. వరుణ్ తేజ్ తల్లి, పద్మజా కొణిదెల కెమెరా స్విచ్ ఆన్ చేయగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు క్లాప్ ఇచ్చారు. తొలి సన్నివేశానికి బాపినీడు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో అనుభవజ్ఞుడైన యాడ్-ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రాఫర్, వీ ఎఫ్ ఎక్స్ పై గొప్ప ప్యాషన్ వున్న శక్తి ప్రతాప్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ, ”ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ గా నటించే అవకాశం రావడంతో పాటు బిగ్ స్క్రీన్‌పై వారి సాహసాలని చూపిస్తుండటం గర్వంగా భావిస్తున్నాను. గ్లోబల్ దిగ్గజం సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా, దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ భాగస్వామ్యంతో మేం చేస్తున్న ఈ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి గొప్ప నివాళి. ఈ చిత్రంలో ఇదివరకు ఎన్నడూ చేయని పాత్రని చేస్తున్నాను. నా పాత్రలో చాలా లేయర్స్ వుంటాయి. ఈ పాత్రకోసం ప్రత్యేకమైన శిక్షణ పొందాను” అని అన్నారు.
ఇండియా సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ జనరల్ మేనేజర్ లాడా గురుదేన్ సింగ్ మాట్లాడుతూ, ”ఒక స్టూడియోగా దేశం గర్వించదగ్గ నిజమైన హీరోల కథలను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. మా గత చిత్రం ‘మేజర్’ కూడా అదే కోవకు చెందిన సినిమా. ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ అనుభూతిని అందించడానికి వరుణ్ తేజ్, శక్తి ప్రతాప్ సింగ్, సందీప్ ముద్దాతో కలిసి పని చేయడంపై ఆనందంగా ఉంది” అని చెప్పారు. నిర్మాత సందీప్ ముద్దా మాట్లాడుతూ, ”ఈ సినిమా ప్రయాణంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉన్నాను. అందరూ కలిసి ఒక గొప్ప చిత్రాన్ని ఇవ్వడం కోసం కష్టపడుతున్నాం. నవంబర్ లో సెట్స్‌పైకి వెళ్ళబోతున్న ఈ చిత్రం 2023లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది” అని చెప్పారు.
