Site icon NTV Telugu

ఉత్సుకత రేకెత్తిస్తున్న ‘కొండపొలం’ ట్రైలర్!

ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామి రెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. సాహితీలోకంలో మంచి గుర్తింపును పొందింది. అదే పేరుతో ప్రముఖ దర్శకుడు క్రిష్‌ ఆ నవలను తెరకెక్కించాడు. రాయలసీమ ప్రాంతానికి చెందిన గొర్రెల కాపరుల కథ ఇది. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం రాకపోవడంతో దిక్కుతోచక ఊరికి వచ్చిన మనవడికి తాత ఓ హిత బోధ చేస్తాడు. కరువు కారణంగా గొర్రెలకు పశుగ్రాసం లభించకపోవడంతో వాటి కడుపు నింపడం కోసం ఊరిలోని పశువుల కాపరులంతా కొండపొలంలోకి వాటిని తోలుకు పోతారు. కొన్ని రోజుల పాటు అక్కడే ఉండాలన్నది వారి ఆలోచన. వారితో కథానాయకుడూ జత కలుస్తాడు. ఆ అడవిలో ఓ పెద్దపులి తిరుగుతుంటుంది. ఆ పులిని మించి అడవిని తమ సొత్తుగా భావించే ఓ వర్గమూ ఉంటుంది. ఆ క్రూరమృగం నుండి, దోపిడీ దారుల నుండి కథానాయకుడు ఎలా తమ గొర్రెలను కాపాడాడు? ఆ ప్రయాణంలో ఏ జీవిత సత్యాన్ని గ్రహించాడన్నదే ఈ నవల సారాంశం.

తొలి చిత్రం ‘ఉప్పెన’లో జాలరిగా నటించి మెప్పించిన వైష్ణవ్ తేజ్ ఇందులో గొర్రెల కాపరిగా నటించాడు. ఆ పాత్రలో అతను చక్కగా ఒదిగిపోయాడని ఈ 2.45 నిమిషాల ట్రైలర్ చూస్తుంటే అర్థమైపోతోంది. అయితే ప్రేక్షకులకు స్వీట్ సర్ ప్రైజ్ మాత్రం రకుల్ ప్రీత్ అనే చెప్పాలి. ఈ తరహా గ్రామీణ యువతి పాత్రను రకుల్ తెలుగు తెరపై ఇంతవరకూ చేయలేదు. ఇక హీరో తాతగా సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు, తండ్రిగా సాయిచంద్ నటించారు. కీరవాణి నేపథ్య సంగీతం, జ్ఞానవేల్ సినిమాటోగ్రఫీ ఏ స్థాయిలో ఉండబోతున్నాయో ఈ ట్రైలర్ ను చూస్తే అర్థమౌతోంది. పైగా పెద్దపులితో హీరో పోరాడే సన్నివేశాలను ఇందులో చూపించలేదు కానీ, సిల్వర్ స్క్రీన్ మీద వాటిని చూసినప్పుడు గూజ్ బంబ్స్ కలగడం ఖాయం. రాజీవ్ రెడ్డి, సాయిబాబు సంయుక్తంగా నిర్మించిన ‘కొండపొలం’ అక్టోబర్ 8న థియేటర్లలో సందడి చేయబోతోంది. విశేషం ఏమంటే… సరిగ్గా ఈ సినిమాకు వారం ముందే అంటే అక్టోబర్ 1న వైష్ణవ్ అన్న సాయితేజ్ నటించిన ‘రిపబ్లిక్’ కూడా విడుదల అవుతోంది.

Exit mobile version