తెలుగు ఇండియన్ ఐడిల్ లో పాల్గొన్న ఫైనలిస్టులకు సూపర్ ఛాన్సెస్ అదే వేదిక మీద దక్కాయి. మరీ ముఖ్యంగా కంటెస్టెంట్స్ లో చిన్నదైన వైష్ణవికి ఏకంగా సౌతిండియన్ స్టార్ హీరోయిన్ నయనతారకు ప్లే బ్యాక్ పాడే ఛాన్స్ దక్కింది. ప్రస్తుతం నయనతార, చిరంజీవి మూవీ ‘గాడ్ ఫాదర్’లో ఆయన చెల్లిగా నటిస్తోంది. వీరిద్దరి మీద వచ్చే ఓ పాటలో నయన్ కు వైష్ణవితో ప్లేబ్యాక్ పాడిస్తానంటూ తమన్ ఈ వేదిక మీద మాట ఇచ్చాడు.
వైష్ణవి పెర్ఫార్మెన్స్ పూర్తి కాగానే చిరంజీవి ఆమెకు ఓ రిస్ట్ వాచ్ గిఫ్ట్ గా ఇస్తూ…. ‘ఇది చేతికి పెట్టుకోగానే వైష్ణవి టైమ్ మారిపోవాల’ని కోరుకున్నారు. అంతేకాదు… తమన్ ఆమెకు ఛాన్స్ ఇస్తే బాగుంటుందని అన్నారు. దాంతో చిరంజీవి పర్మిషన్ తో వైష్ణవితో తాను ‘గాడ్ ఫాదర్’ మూవీలో పాట పాడిస్తానని తమన్ హామీ ఇచ్చాడు. ఆ పాటను వచ్చే ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో విడుదల అవుతుందని, వైష్ణవి పాడే తొలి సినిమా గీతాన్ని అప్పుడు వినవచ్చునని చిరంజీవి చెప్పారు. ఇదే సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న అందరినీ చిరంజీవి కోసం స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వమని తమన్ కోరాడు. మణిశర్మ గారి అబ్బాయి సాగర్ మహతి ‘భోళా శంకర్’కు సంగీతం అందిస్తున్నాడని, చిరంజీవి పెద్ద మనసుతో అతనికి అవకాశం ఇచ్చారని, ఇలా కొత్తవారికి ఛాన్స్ ఇచ్చే వారు చాలా తక్కువ అని తమన్ అన్నాడు. తెలుగు చిత్రసీమలో చిరంజీవి ఎవరెస్ట్ శిఖరం లాంటి వారంటూ తమన్ చెప్పడం విశేషం.
