V. N. Aditya: ప్రముఖ దర్శకుడు వి. ఎన్. ఆదిత్య తెరకెక్కించిన సినిమా ‘వాళ్ళిద్దరి మధ్య’. విరాజ్ అశ్విన్, నేహా కృష్ణ జంటగా అర్జున్ దాస్యన్ నిర్మించిన ఈ సినిమా ఎప్పుడో విడుదలకు సిద్ధమైంది. అయితే అనివార్య కారణాల వల్ల థియేటర్లలో రిలీజ్ కాలేదు. అయితే, ఈ నెల 16 నుండి ఆహాలో తమ చిత్రం వీక్షకుల కోసం రెడీగా ఉంటుందని దర్శకుడు వి. ఎన్. ఆదిత్య తెలిపారు. వెంకట్ సిద్దారెడ్డి, బిందు చంద్రమౌళి, సాయిశ్రీనివాస్ వడ్లమాని, జయశ్రీ రాచకొండ, శ్రీకాంత్ అయ్యంగార్, నీహారిక రెడ్డి, ప్రశాంత్ సిద్ధి, సప్రజ, కృష్ణకాంత్, అలీ, భార్గవ్, రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు మధు స్రవంతి సంగీతం సమకూర్చగా, సత్యానంద్ స్క్రీన్ ప్లే అందించారు.
చిత్రం ఏమంటే… ఎంతో కాలంగా దర్శకుడిగా రాణిస్తున్న వి. ఎన్. ఆదిత్య సైతం తన చిత్రాల విడుదల విషయంలో ప్రతికూల ఫలితాలనే పొందుతున్నారు. ముఖ్యంగా థియేటర్లలో సినిమా విడుదల చేయాలంటే చిన్న చిత్రాల నిర్మాతలకు చుక్కలు కనిపిస్తున్నాయి. బహుశా ఆ కారణంగానే కావచ్చు… ‘వాళ్ళిద్దరి మధ్య’ చిత్రాన్ని థియేటర్లలో కాకుండా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కు దర్శక నిర్మాతలు సిద్ధపడ్డారు. ఇదే విషయమై వి. ఎన్. ఆదిత్య స్పందిస్తూ, తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు చిత్రసీమలో సైతాను రాజ్యమేలుతున్నాడని, దేవుడు కాదని ఆయన అన్నారు. వాడి, వేడీగా తన మనోభావాలను ఆయన సోషల్ మీడియాలో ఈ క్రింది విధంగా పోస్ట్ చేశారు.
”మనం ఇష్టపడో , కష్టపడో చేసిన పని ప్రేక్షకుల ముందుకు రావడం కన్నా గొప్ప విషయం ఇంకొకటి లేదు. పదేళ్ల క్రితం వరకూ, సినిమా ప్రేక్షకుల ఆమోదం పొందితే గానీ మాకు మనుగడ ఉండేది కాదు. ఇప్పుడు ప్రేక్షకుడి ఆమోదంతో పనిలేదు. నచ్చినా నచ్చకపోయినా చూస్తే చాలు. వాచ్ అవర్స్! మొబైల్ లో, లాప్ టాప్ లో, స్మార్ట్ టీవీలో, హోమ్ థియేటర్ లో సినిమా రన్ చేసి ఎవరి పని వాళ్లు చేసుకోవచ్చు. మేము బతికి బట్ట కట్టేస్తాం. ఇప్పుడు సినిమాకి ఆమోదం అక్కరలేదు. కానీ, సినిమా వాడికి ఆమోదం కావాలి ‘మార్కెట్’ అనే ఒక పెద్ద మాఫియా నుంచి!! ఈ మార్కెట్టే ప్రేక్షకుడి నుంచి సినిమాని క్రమంగా వేరు చేసినది. అప్పటి నుంచే సినిమాల్లో ప్రతిభ కన్నా ప్రచారం ఎక్కువ రాజ్యమేలుతోంది. విరివిగా మంచి సినిమాలు చూసి, ఆదరించడమే ప్రేక్షకులు చేయాల్సిన పని. అప్పుడే మార్కెట్ మళ్లీ ప్రేక్షకుడి చేతుల్లోకి వస్తుంది. అప్పుడే జంక్ తగ్గి, క్వాలిటేటివ్ సినిమా రాజ్యమేలుతుంది. అప్పుడే ప్రేక్షకుడు మళ్లీ దేవుడవుతాడు. ప్రస్తుతం సైతాను రాజ్యమేలుతున్నాడు. దేవుడు కాడు. డిసెంబరు 16, 2022 న ‘ఆహా’ లో ‘వాళ్ళిద్దరి మధ్య’ సినిమా చూసి, నన్ను, మా నిర్మాతని, నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని అందర్నీ ఇండస్ట్రీలో కొంతకాలం బతికి బట్ట కట్టించమని మనవి.”
దర్శకుడు వి. ఎన్. ఆదిత్య ఆవేదన చూస్తుంటే… చిన్న చిత్రాల దర్శక నిర్మాతల మనోవేదన అర్థం అవుతుంది. మరి సైతాను రాజ్యంపోయి… దేవుడి రాజ్యం ఎప్పుడు వస్తుందో!! సినిమా పెద్దలు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.