NTV Telugu Site icon

Ustaad Bhagath Singh: అది ‘తెరి’ రీమేక్ సినిమానే… క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Ustaad Bhagath Singh

Ustaad Bhagath Singh

తెలుగులో పూరి జగన్నాధ్ తర్వాత కేవలం హీరో క్యారెక్టర్ పైనే సినిమాలు చేయగల సత్తా ఉన్న దర్శకుడు హరీష్ శంకర్ మాత్రమే. హీరోకి సూపర్బ్ వన్ లైనర్ డైలాగ్స్ రాయడంలో హరీష్ శంకర్ దిట్ట. పవన్ కళ్యాణ్ కి చాలా పెద్ద ఫ్యాన్ అయిన హరీష్ శంకర్, తన ఫేవరేట్ హీరోకి గబ్బర్ సింగ్ లాంటి హిట్ ఇచ్చాడు. పవర్ స్టార్ అనే పేరుని రిసౌండ్ వినిపించేలా చేసిన ‘గబ్బర్  సింగ్’ చూసిన తర్వాత హరీష్ శంకర్ ఇంకోసారి పవన్ కళ్యాణ్ తో సినిమా ఎప్పుడు చేస్తాడా అని మెగా అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేశారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా అనౌన్స్ అయ్యింది. ఈసారి ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు అంతకు మించి అనే రేంజులో ‘భవదీయుడు భగత్ సింగ్’ పోస్టర్ తో సహా అనౌన్స్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ ఫాన్స్ అంతా ఖుషీ అయ్యారు.

పవన్ అభిమానులకి షాక్ ఇస్తూ హరీష్ శంకర్ ‘తెరి’ సినిమాని రీమేక్ చేస్తున్నాడు అనే రూమర్ స్ప్రెడ్ అయ్యింది. దీంతో పవన్ కళ్యాణ్ ఫాన్స్ అప్సెట్ అయ్యి, #WedontwantTheriRemake అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. కొత్త కథతో సినిమా చెయ్యకుండ ఇంకెన్ని రోజులు పవన్ కళ్యాణ్ తో రిమేక్స్ మాత్రమే చేస్తారు? మా హీరోని సరిగ్గా వాడుకోవట్లేదు అంటూ పవన్ ఫాన్స్ ట్విట్టర్ లో హల్చల్ చేశారు. పవన్ అభిమానుల ఆవేశాన్ని మరింత పెంచుతూ హరీష్ శంకర్, ఫాన్స్ ని బ్లాక్ చేయడం జరిగింది. ఒక సినిమాని రీమేక్ చేయకండి అంటూ మూడు లక్షల ట్వీట్స్ పోల్ అయ్యాయి అంటే పవన్ ఫాన్స్ చేసిన రచ్చ ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో ఈ రచ్చ జరుగుతుండగానే హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ సినిమా పూజా కార్యక్రమాలని పూర్తి చేసేసాడు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ టైటిల్ ని ‘భవదీయుడు భగత్ సింగ్’ నుంచి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అని మార్చాడు. టైటిల్ ని మార్చిన హరీష్ శంకర్, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ‘తెరి’కి రీమేక్ వెర్షనా కాదా అనే విషయంలో ఇప్పటికీ ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేకపోవడం విశేషం.

ఈ విషయంలో ఒక క్లారిటీ ఇస్తూ దర్శకుడు దశరథ్… ‘‘హరీశ్‌ శంకర్‌ తమిళ్‌ ‘తెరి’ చిత్రాన్ని రీమేక్‌ చేస్తున్నారు. దానికి నేను స్క్రీన్ ప్లే రైటర్‌గా పని చేస్తున్నాను. ఆ సినిమా స్ట్రక్చర్‌ తీసుకుని, చాలా మార్పులు చేశాం. కచ్చితంగా అది పవన్‌కల్యాణ్‌ అభిమానులందరికీ నచ్చేలా హరీశ్‌ డిజైన్‌ చేశారు” అంటూ లీక్ ఇచ్చేసాడు. దీంతో సోషల్ మీడియాలో ‘తెరి’ రీమేక్ విషయం మరోసారి హాట్ టాపిక్ అయ్యే ఛాన్స్ ఉంది. మార్పులు, చేర్పులు చేసి మ్యాజిక్ చెయ్యడంలో… ‘మాటలు-మార్పులు’ అంటూ బాక్సాఫీస్ ని షేక్ చెయ్యడంలోనూ హరీష్ శంకర్ కి ‘గబ్బర్ సింగ్’ రూపంలో మంచి హిస్టరీ ఉంది. సో మరోసారి హరీష్ శంకర్ అలాంటి మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి. సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన దశరథ్, 2016లో మంచు మనోజ్ తో ‘శౌర్య’ అనే సినిమా చేశాడు. ఈ మూవీ ఆశించిన విజయం సాదించకపోవడంతో అప్పటి నుంచి దశరథ్ దర్శకత్వంలో మరో సినిమా రాలేదు. ఇప్పుడు హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా హిట్ అయితే మళ్లీ దర్శకుడిగా ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తాడేమో చూడాలి.