NTV Telugu Site icon

UnStoppable 2: అదిరిందయ్యా.. బాలయ్య!!

Unstoppable 2

Unstoppable 2

UnStoppable 2: నటసింహ నందమూరి బాలకృష్ణ ‘ఆహా’ ఓటీటీలో నిర్వహించిన ‘అన్ స్టాపబుల్’ కార్యక్రమం జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ‘అన్ స్టాపబుల్’ సీజన్ టూ కూడా వస్తోందని తెలిసినప్పటి నుంచీ అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మొన్న సీజన్ -2లో ఎపిసోడ్ -1 ప్రోమో లోనే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్ పాల్గొనడంతో మరింత క్రేజ్ నెలకొంది. ప్రోమో చూసేసిన జనం ఎప్పుడెప్పుడు ఎపిసోడ్ ను చూసేద్దామా అని ఉర్రూతలూగారు. వారికి కనువిందుచేస్తూ బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్-2’ శుక్రవారం మధ్యాహ్నం 2:17 గంటలకు ‘ఆహా’లో ఆరంభమైంది.

ఈ సారి ఎపిసోడ్-1 ఆరంభంలోనే అదరహో అనేలా సెట్ చేశారు. బాలకృష్ణ ఎంట్రీని చూస్తే ‘రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్’ మూవీ గుర్తుకు రాకమానదు. ‘He came… He ruled… He created History… He is back with the baap all Shows…’ అంటూ బాలయ్య ఎంట్రీకి జనం బ్రహ్మరథం పట్టారు. బాలయ్య ఎంట్రీయే మోటార్ బైక్ పై రావడం మాస్ ను ఆకట్టుకుంది. ఇక తన బ్లాక్ బస్టర్ హిట్ ‘అఖండ’లోని “జై బాలయ్యా…” సాంగ్ కు స్టెప్స్ వేస్తూ మురిపించారు బాలయ్య. దాదాపు ఒక గంట 18 నిమిషాల పాటు ఈ ఎపిసోడ్ రూపొందింది. “మీ చిరునవ్వులో… మీ చిరు ఆశలో మా చిరునామా… చూసుకుంటాం…” అంటూ బాలయ్య ఎపిసోడ్ ను ఆరంభించారు. చంద్రబాబు నాయుడు వేదికపైకి రాగానే అక్కడున్న జనం ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. ఈ ఎపిసోడ్ ను దసరా పండగ నాడు చిత్రీకరించినట్టుంది. పండగ పూట వచ్చిన ఇంటల్లుడికి అంటూ బాలయ్య తన బావ చంద్రబాబుకు ఓ గిఫ్ట్ హ్యాంపర్ అందించారు.

“మొట్టమొదట మా నాన్నగారిని మీరు ఎప్పుడు ఎక్కడ కలిశారు?” అంటూ ఎపిసోడ్ లో తొలి ప్రశ్నను సంధించారు బాలయ్య. అందుకు చంద్రబాబు తన ఫ్లాష్ బ్యాక్ వివరించారు. అలాగే తాను హైదరాబాద్ వచ్చిన కొత్తలో నగరం ఎలా ఉండేదో తెలిపారు. ప్రస్తుతం బాలకృష్ణ నివసిస్తున్న ఇంటి గురించి, దాని చరిత్ర గురించీ చంద్రబాబు చెప్పడం ఆసక్తి కలిగిస్తుంది. జూబ్లీ హిల్స్ అభివృద్ధిని చూసే తనలో హైదరాబాద్‌ను తెలుగుజాతి గర్వించేలా తీర్చిదిద్దాలన్న అభిలాష అప్పుడే కలిగిందని చంద్రబాబు తెలిపారు. విజన్ అన్నప్పుడు తనను అందరూ ఎద్దేవా చేశారనీ ఆయన గుర్తు చేసుకున్నారు. యన్టీఆర్ తనకు స్ఫూర్తి అని పదే పదే చంద్రబాబు చెప్పడం విశేషం.

నాయకులను గౌరవించాలన్న ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ కాకపోయినా కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు పార్కులకు పెట్టిన వైనాన్ని వివరించారు చంద్రబాబు. ఇదే సందర్భంలో ‘మా నాన్న ఏమీ కాంట్రిబ్యూట్ చేయలేదని, మెడికల్ యూనివర్సిటీకి పేరు మార్చారు’ అని బాలయ్య అనగానే, ‘దురదృష్టమది…’ అన్నారు చంద్రబాబు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ విషయంలోనూ ఎన్టీఆర్ పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఫైట్ చేశామని అన్నారు. భారతదేశంలో మెడికల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన తొలి వ్యక్తి ఎన్టీఆర్ అనీ చెప్పారు. ఎన్టీఆర్ వంటి నాయకుని పేరు మార్చడమన్నది తెలుగువారిని అవమానించడం అనీ వ్యాఖ్యానించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ‘రాజశేఖర్ రెడ్డి’ పేరున ఉన్న జిల్లా, హార్టీకల్చరల్ పేరు మార్చాలంటే ఒక్క నిమిషం పని అనీ, కానీ గౌరవించామని అది తన సంస్కారమని చంద్రబాబు వివరించడం ఆకట్టుకుంది. మళ్ళీ ఎన్టీఆర్ పేరును హెల్త్ యూనివర్సిటీకి పెడతామని, అది తన ఒక్కడి కోరిక కాదని, యావత్ తెలుగుజాతి కోరుకుంటోందని చంద్రబాబు అన్నారు. బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ కంపెనీ హైదరాబాద్‌లో పెట్టడానికీ ఎలా ప్రయత్నించిందీ వివరించారు బాబు.

Read Also: Manchu Vishnu: మోసం చేశాడు.. ప్రభాస్ పై మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు

కాసేపు రాజకీయాల చుట్టూ తిరిగిన సంభాషణ, తరువాత సరదాగా మారడం అందరినీ అలరిస్తుంది. అక్కడ ఉన్న ఎమోజీస్ తీస్తూ బాలయ్య ప్రశ్నలు వేయడం, బాబు జవాబులు చెప్పడం సాగింది. ‘ఫ్రెండ్స్’ గురించి అడిగినప్పుడు చిన్నప్పటి నుంచీ గుర్తు చేసుకున్నారు చంద్రబాబు. రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచీ ఐదేళ్ళు తానూ, రాజశేఖర్ రెడ్డి ఎంతో అన్యోన్యంగా కలసి తిరిగామని చెప్పారు. తరువాత స్క్రీన్ పై ప్రత్యక్షమైన మాటలను బట్టి తన జీవితంలో జరిగిన అంశాలను చంద్రబాబు గుర్తు చేసుకోవడం కూడా అలరించింది. బిగ్ డే, బిగ్ అలయన్స్, బిగ్ మిస్టేక్, బిగ్ ఫియర్, బిగ్ డెసిషన్, అన్న పదాలకు చంద్రబాబు సమాధానమిచ్చారు. ముఖ్యంగా ‘బిగ్ డెసిషన్’కు ఆయన ఇచ్చిన జవాబు ఆసక్తి కలిగిస్తుంది. తన లైఫ్ లో ఎన్టీఆర్ ఒక ఆరాధ్య దైవం అని చంద్రబాబు చెప్పడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆ రోజు మనం తీసుకున్న నిర్ణయం తప్పా? అంటూ చంద్రబాబు అడిగిన ప్రశ్నకు బాలయ్య తడుముకోకుండా ‘కాదు’అని చెప్పారు.

తరువాత చంద్రబాబు, బ్రహ్మణికి ఫోన్ చేయడం, భువనేశ్వరితో మాట్లాడడం కూడా ఆకట్టుకుంది. ఆపై నారా లోకేశ్ స్టూడియోలోకి ఎంట్రీ ఇవ్వడమూ అలరించింది. తరువాత మామ బాలయ్య అడిగిన ప్రశ్నలకు అల్లుడు లోకేశ్ ఇచ్చిన సమాధానాలు సైతం అందరినీ మురిపించాయి. ఆపై ఫిట్ నెస్ ట్రైనర్ ఫర్జానా బేగం ఏవీ ప్రదర్శించడం, ఆమె ఆ వేదికపైకి రావడం జరిగాయి. బాలకృష్ణ, చంద్రబాబును లోకేష్ ప్రశ్నలు అడగడమూ ఆకట్టుకుంది. చివరగా రాబోయే రోజుల్లో భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రస్థానం ఆక్రమించాలని చంద్రబాబు కోరారు. ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న ప్రేక్షకుల నుండి ముగ్గురిని ఎన్నుకోని, వారి ద్వారా ఈ ఎపిసోడ్‌లో ఏమి నచ్చిందో చెప్పమన్నారు బాలయ్య. ఇలా సాగిన ‘అన్ స్టాపబుల్’ రెండో సీజన్ మొదటి ఎపిసోడ్ మరి ఎందరిని ఆకట్టుకుంటుందో చూడాలి.

Read Also: Crazy Fellow Movie Review Telugu : క్రేజీ ఫెలో

Show comments