ఏ మనిషినైనా మంచివాడుగా, చెడ్డవాడుగా చిత్రీకరించేవి – అతని చుట్టూ ఉన్న పరిస్థితులే అని చెప్పవచ్చు. ఓ మనిషి దొంగకావడానికి అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి అని చర్చించవలసి ఉంటుంది. ఈ కోణంలో ఆలోచించే కరడు కట్టిన నేరస్థులలో సైతం పరివర్తన కలిగించాలని సామాజిక ఉద్యమకారులు గోరా, ఆయన కోడలు హేమలతా లవణం నడుం బిగించారు. ఎందరో దొంగలలో సత్ర్పవర్తన కలిగేలా చేశారు. అలా ప్రకాశం జిల్లాలో స్టూవర్ట్ పురం అనే ఊరిలో దొంగలలో మార్పు తీసుకు రాగలిగారు. అప్పట్లో రాష్ట్రంలో ఏదైనా పెద్ద దొంగతనం జరిగితే, అందులో స్టూవర్ట్ పురం దొంగల పాత్ర ఏమైనా ఉందా అని పోలీసులు ఆరా తీసేవారు. ఈ విషయాలను చర్చిస్తూ ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ 1990లో ‘స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్’ అనే సీరియల్ రాశారు. తరువాత అదే నవలగా వెలుగు చూసింది. ఈ కథతోనే మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి జంటగా కె.ఎస్.రామారావు, ఆ కథారచయిత యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలోనే ‘స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్’ చిత్రం నిర్మించారు. 1991 జనవరిలో సంక్రాంతి బరిలో ‘స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్’ నిలచింది. కానీ, జనం మదిని గెలవలేకపోయింది.
సరిగా ‘స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్’ విడుదలయిన సమయంలోనే అదే స్టూవర్ట్ పురం వాసుల నేపథ్యంలో ‘స్టూవర్ట్ పురం దొంగలు’ సినిమా తెరకెక్కింది. సాగర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో భానుచందర్, చరణ్ రాజ్, నాజర్, వల్లభనేని జనార్దన్, బాబూ మోహన్ నటించారు. చిత్రమేమంటే, టాప్ స్టార్స్ ఉన్న ‘స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్’ కంటే ‘స్టూవర్ట్ పురం దొంగలు’ జనాన్ని ఆకట్టుకుంది.
కట్ చేస్తే… మళ్ళీ ఇన్నాళ్ళకు స్టూవర్ట్ పురం నేపథ్యంలో రెండు చిత్రాలు తెరకెక్కనున్నాయి. అందులో ఒక సినిమాను బెల్లంకొండ సురేశ్, తన తనయుడు సాయిశ్రీనివాస్ హీరోగా ‘స్టూవర్ట్ పురం దొంగ’ పేరుతో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కె.ఎస్. దర్శకత్వం వహించనున్నారు. ఆగస్టు 11వ తేదీనే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడింది. అదే స్టూవర్ట్ పురం బ్యాక్ డ్రాప్ లో ఇంకో సినిమాగా ‘టైగర్ నాగేశ్వరరావు’ రూపొందనున్నట్టు నవంబర్ 3న ప్రకటించారు. ఈ చిత్రంలో రవితేజ కథానాయకుడు. ఇంతకు ముందు ‘దొంగాట, కిట్టూ ఉన్నాడు జాగ్రత్త’ చిత్రాలు తెరకెక్కించిన వంశీ ఈ ‘టైగర్ నాగేశ్వరరావు’ను రూపొందించనున్నారు. ఈ ప్రకటన రాగానే దీపావళి సందర్భంగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తో తెరకెక్కబోయే ‘స్టూవర్ట్ పురం దొంగ’ లుక్ రిలీజ్ కావడం గమనార్హం! దీంతో ఆ నాటి రోజులు గుర్తుకు వచ్చాయి. 30 ఏళ్ళ క్రితం స్టూవర్ట్ పురం నేపథ్యంలోనే రెండు చిత్రాలు విడుదలై చర్చ సాగింది. మళ్ళీ ఇన్నాళ్ళకు అదే స్టూవర్ట్ పురం బ్యాక్ డ్రాప్ లో మరో రెండు చిత్రాలు తెరకెక్కబోవడం విశేషమే మరి. ఈ సినిమాలు ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తాయో, వీటిలో ఏ చిత్రం జనం మదిని దోచేస్తుందో చూడాలి.
