‘అల్లరోడు’గా జనం మదిలో నిలచిన నరేష్ హీరోగా తెరకెక్కిన తొలి చిత్రం ‘అల్లరి’ సినిమా విడుదలై మే 10వ తేదీకి ఇరవై సంవత్సరాలు అవుతోంది. హీరోగా నరేష్ కు, దర్శకునిగా రవిబాబుకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ‘అల్లరి’ చిత్రం 2002 మే 10న విడుదలయింది.
‘అల్లరి’ చిత్రం కథ ఏమిటంటే – రవి, అపర్ణ చిన్ననాటి స్నేహితులు. ఒకే అపార్ట్ మెంట్స్ లో ఉంటారు. రుచి అనే అమ్మాయి వాళ్ళుండే అపార్ట్ మెంట్స్ లో చేరుతుంది. అప్పటి నుంచీ ఆమెపై మనసు పారేసుకుంటాడు రవి. రుచికి ఓ ప్రేమలేఖ రాస్తాడు. ఆ లెటర్ ను అపర్ణకు ఇచ్చి, రుచికి ఇవ్వమంటాడు. అపర్ణ ఆ లెటర్ చదువుతుంది. అందులో రవి పిల్లచేష్టలు కనిపిస్తాయి. దాంతో అపర్ణ మరో లేఖ తయారు చేస్తుంది. చివరకు ఆ లెటర్ పలు చోట్ల మారుతుంది. ఓ రోజు రుచి ఇంట్లో ఎవరూ లేరని, రవిని రమ్మంటుంది. ఓ ‘స్పెషల్ గిఫ్ట్ ‘ ఇస్తాననీ చెబుతుంది. ఆశగా వెళ్ళిన రవికి రుచి గిఫ్ట్ ఇచ్చే లోపు ఆమె పేరెంట్స్ వస్తారు. అక్కడ నుండి పలు మలుపులు తిప్పుతుంది లెటర్. అదే సమయంలో అపర్ణకు వైజాగ్ మెడికల్ కాలేజ్ లో సీట్ రావడంతో ఆ ఊరు విడిచి వెళ్ళాలను కుంటుంది. చివరకు రవి లెటర్ అతని దగ్గరకే వస్తుంది. దానిని చదివిన రవికి అపర్ణ మనసు తెలుస్తుంది. నిజంగా ఆమె లేకుంటే తన జీవితం ఏమయ్యేదో అనిపిస్తుంది. తనను క్షమించమని అడుగుతాడు రవి. అపర్ణ అతణ్ణి క్షమించి మెడిసిన్ చదవడానికి వైజాగ్ వెళ్తుంది. మరుసటి సంవత్సరం వైజాగ్ లో అదే కాలేజ్ లో రవి చేరుతాడు. ర్యాంగింగ్ కు గురవుతున్న రవిని తీసుకొని అపర్ణ పరుగు తీయడంతో సినిమా ముగుస్తుంది.
ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ పతాకంపై రవిబాబు నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నరేశ్, శ్వేతా అగర్వాల్, నీలాంబరి, చలపతిరావు, కోట శ్రీనివాసరావు, సుభాషిణి, అపూర్వ, తనికెళ్ళ భరణి, సుధ, లక్ష్మీపతి, కల్పనారాయ్, బేబీ సత్య, సంజయ్ నటించారు. ఈ చిత్రానికి పాల్ .జె సంగీతం సమకూర్చగా, సీతారామశాస్త్రి పాటలు రాశారు. ఇందులోని “రా పోదాం…”, “అత్తయ్యో మామయ్యో…”, “నర నరం…”, “ఓ ముద్దిస్తావా…” అంటూ సాగే పాటలు ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ సమర్పణలో రూపొందింది. యువతను భలేగా ఆకట్టుకుంది. ఈ చిత్ర విజయంతో రవిబాబు మరికొన్ని వైవిధ్యమైన చిత్రాలు రూపొందించారు. ‘అల్లరి’ అన్నది నరేశ్ ఇంటి పేరుగా మారిపోయింది.