Site icon NTV Telugu

Nithin: ప్లాపులే ఎక్కువ.. అయినా కానీ

New Project (5)

New Project (5)

ముప్పై తొమ్మిదేళ్ళు పూర్తి చేసుకొని నలభయ్యో ఏట అడుగుపెట్టినా ఇంకా లవర్ బోయ్ ఇమేజ్ తోనే సాగుతున్నాడు నితిన్. జయాపజయాలకు అతీతంగా నితిన్ పయనం సాగింది. యువతలో నితిన్ కు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నితిన్ ను పరాజయాలు పలకరించినప్పుడు, తప్పకుండా ఈ సారి మా హీరో సక్సెస్ సాధిస్తాడు అనే నమ్మకంతో ఉండేవారు అభిమానులు. అందుకు తగ్గట్టుగానే అనూహ్యంగా నితిన్ ను విజయం వరించేది. త్వరలో ‘మాచర్ల నియోజకవర్గం’ అనే సినిమాతో జనం ముందుకు రాబోతున్న నితిన్ జూన్ 14తో నటునిగా ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నాడు. నితిన్ తొలి చిత్రం ‘జయం’ 2002 జూన్ 14ననే ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాతోనే నితిన్ మొదటి సూపర్ హిట్ నూ తన కిట్ లో వేసుకున్నాడు. ఈ ఇరవై ఏళ్ళ చిత్రప్రయాణంలో నితిన్ కొన్నిసార్లు ఉవ్వెత్తున ఎగసిన కెరటాన్ని తలపించాడు, మరికొన్ని సార్లు ఉస్సూరుమంటూ కూలిన వైనాన్నీ చూపించాడు.

నితిన్ తన 20 ఏళ్ళ కెరీర్ లో 30 చిత్రాలలో హీరోగా పలకరించాడు. ఆరంభంలో వరుస విజయాలూ చూశాడు. నితిన్ రెండో సినిమా ‘దిల్’ యూత్ ను కిర్రెక్కించింది. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో నితిన్ మాస్ నూ ఆకట్టుకున్నాడు. నితిన్ మూడో సినిమా ‘సంబరం’, నాలుగో చిత్రం ‘శ్రీఆంజనేయం’ భలేగా ఊరించాయే కానీ, ఆశించిన విజయాన్ని అందించలేకపోయాయి. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘సై’ నితిన్ కు మరింత క్రేజ్ సంపాదించి పెట్టింది. ‘సై’ తరువాత నితిన్ కు మునుపటిలా ఘనవిజయాలేవీ దరిచేరలేదు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నితిన్ ద్విపాత్రాభినయం చేసిన ‘అల్లరి బుల్లోడు’ కానీ, ‘జయం’లాంటి ఘనవిజయం అందించిన తేజ దర్శకత్వంలో నితిన్ నటించిన ‘ధైర్యం’ కానీ కోరుకున్న సక్సెస్ ను అందించలేక పోయాయి. వరుస పరాజయాలు పలకరించాయి. అయినా, నితిన్ కు యువతలో ఫాలోయింగ్ ఉండేది. ఆ సమయంలో రామ్ గోపాల్ వర్మ తన ‘అగ్యాత్’తో నితిన్ ను హిందీ చిత్రసీమకూ పరిచయం చేశాడు. అక్కడా ఆశించిన స్థాయిలో విజయం లభించలేదు. ‘సై’ తరువాత దాదాపు డజన్ సినిమాలు నితిన్ కు చేదు అనుభవాన్ని రుచి చూపించాయి. ప్రతి సినిమాలోనూ నితిన్ వైవిధ్యం పలికించే ప్రయత్నమే చేశాడు. కానీ, కోరుకున్న సక్సెస్ మాత్రం దూరంగా జరుగుతూనే ఉండేది. ఆ సమయంలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, ఆయన మిత్రుడు విక్రమ్ గౌడ్ కలసి ‘ఇష్క్’ సినిమా నిర్మించారు. నితిన్ సరసన నిత్య మీనన్ నటించిన ‘ఇష్క్’ యువతను విశేషంగా అలరించింది. ఇందులోనే నితిన్ తొలిసారి గళం విప్పి “లచ్చమ్మ…” పాట పాడి మురిపించాడు.

‘ఇష్క’ తరువాత ‘గుండెజారి గల్లంతయ్యిందే’ కూడా హిట్ గా నిలచింది. ఇందులోనూ నిత్య మీనన్ తో జోడీ కట్టాడు. అలాగే “డింగ్ డింగ్ డింగ్…” అనే పాట పాడీ ఆకట్టుకున్నాడు నితిన్. చాలా రోజుల తరువాత వరుస విజయాలు పలకరించగానే నితిన్ అభిమానులు ఆనందించారు. మళ్ళీ కొన్ని పరాజయాలు పలకరించాయి. ఆ పై త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందిన ‘అ ఆ’ అనూహ్య విజయం సాధించింది. నిజం చెప్పాలంటే ‘జయం’ తరువాత మళ్ళీ నితిన్ కు ఆ స్థాయి సక్సెస్ అందించిన చిత్రం ‘అ ఆ’ అనే అనాలి. నితిన్ తాను పవన్ కళ్యాణ్ అభిమానిని అని చెప్పుకొనేవాడు. అంతేకాదు, తన హీరో సినిమాల్లోని పాటలను రీమిక్స్ చేసీ నటించి మురిపించాడు. ఈ నేపథ్యంలోనే నితిన్ తో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ‘చల్ మోహనరంగ’ చిత్రాన్ని నిర్మించారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కూడా ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామి. ‘అ ఆ’ తరువాత మూడు సినిమాలు నిరాశ పరిచాయి. ఆ తరువాత వచ్చిన ‘భీష్మ’ నితిన్ కు మరో సాలిడ్ సక్సెస్ అందించింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ‘భీష్మ’లో నితిన్ సరసన రశ్మిక నాయికగా నటించింది. ఈ సినిమా సక్సెస్ రూటులో సాగుతుండగానే ‘లాక్ డౌన్’ మొదలయింది. లేని పక్షంలో ‘భీష్మ’ మరింతగా థియేటర్లలో సందడి చేసేదని చెప్పవచ్చు. ఈ సినిమా ఓటీటీలోనూ భలేగా ఆకట్టుకుంది.

‘భీష్మ’ తరువాత జనం ముందు నిలచిన నితిన్ మూడు సినిమాలు అంతగా మురిపించలేకపోయాయి. యమ్.యస్. రాజశేఖర్ రెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నికితారెడ్డి ‘మాచర్ల నియోజకవర్గం’ అనే చిత్రం నిర్మిస్తున్నారు. ఆగస్టు 12న ‘మాచర్ల నియోజకవర్గం’ విడుదల కానుంది. ఈ సినిమాపైనే నితిన్, ఆయన అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. హీరోగా 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో నితిన్ కు మళ్ళీ మునుపటి స్థాయిలో ‘మాచర్ల నియోజకవర్గం’ విజయాన్ని అందిస్తుందని ఆశిద్దాం.

Exit mobile version