Site icon NTV Telugu

Bhupinder Singh: బాలీవుడ్ లో విషాదం… ప్రముఖ గాయకుడి కన్నుమూత!

Bhupinder Singh

Bhupinder Singh

 

హిందీ సినీ సంగీత ప్రపంచానికి చెందిన లతా మంగేష్కర్, ఆశాభోస్లే, మహ్మద్ రఫీ, ఆర్డీ బర్మన్, మదన్ మోహన్ వంటి వారితో పనిచేసిన ప్రముఖ గాయకుడు, గిలారిస్ట్ భూపేందర్ సింగ్ (82) అనారోగ్యంతో సోమవారం రాత్రి ముంబైలో కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యానర్ తో పోరాటం చేస్తున్న ఆయన కరోనా బారిన పడ్డారు. ఆరోగ్యపరమైన ఇతర సమస్యల కారణంగా భూపేందర్ సింగ్ కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. ‘మౌసమ్’లో ఆయన పాడిన పాట ‘దిల్ దూండ్తా హై ఫిర్ వహీ పుర్సత్ కే రాత్ దిన్’ పాటను ఎవరూ అంత తేలికగా మర్చిపోలేరు. వైవిధ్యమైన పలు గీతాలను పాడటంతో పాటుగా గిటారిస్టుగా ఆయన అందించిన వాద్య సహకారం ఎంతో గొప్పది.

అమృత్ సర్ లో పుట్టిన భూపేందర్ సింగ్ పెరిగింది ఢిల్లీలోని వెస్ట్ పటేల్ నగర్ లో. తండ్రి ప్రొఫెసర్ నాథా సింగ్ వాద్యకారులు కావడంతో ఆయన దగ్గరే సంగీతాన్ని అభ్యసించాడు భూపేందర్. యుక్తవయసులోనే వివిధ వాద్య పరికరాలను ఉపయోగించడం అలవాటైంది. గిటార్ లో ప్రావీణ్యం సంపాదించుకున్నాక ఆల్ ఇండియా రేడియోలో సతీశ్ భాటియా నేతృత్వంలో క్యాజువల్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించారు. భూపేందర్ గొంతులోని మాధుర్యాన్ని గుర్తించిన సతీశ్‌ భాటియా… ఓసారి మదన్ మోహన్ ఢిల్లీ వచ్చినప్పుడు ఆయనకు భూపేందర్ ను పరిచయం చేశారు. ఆ తర్వాత మదన్ మోహన్ ‘హకీకత్’ మూవీలో పాట పాడే అవకాశాన్ని భూపేందర్ సింగ్ కు ఇచ్చారు. ఆ తర్వాత రఫీ, మన్నాడే, తలత్ మహమూద్ తదితరులతో మదన్ మోహన్ ద్వారానే పరిచయం ఏర్పడింది. ఆర్డీ బర్మన్ టీమ్ లో చాలా కాలం భూపేందర్ సింగ్ గిటార్ ప్లేయర్ గా ఉన్నారు. ఆయన గొంతులోని గాంభీర్యత రెగ్యులర్ పాటలు పాడటానికి ఉపయోగపడలేదు. అందుకే విషాద గీతాలను, విరహ గీతాలను మాత్రమే సంగీత దర్శకులు ఆయనతో పాడిస్తూ వచ్చారు. 1980 నుండి ఆయన తన భార్య మిథాలీ ముఖర్జీతో కలిసి ప్రైవేట్ ఆల్బమ్స్ పాడటం మొదలు పెట్టారు. గజల్స్ మీద ఉన్న ఆసక్తితో వాటికే ప్రాధాన్యమిచ్చారు. అలానే అనేక స్టేజ్ షోస్ ఇచ్చారు. లలిత సంగీత విభాగంలో ఆయనకు సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా లభించింది. భూపేందర్ సింగ్ మృతికి దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మ‌హారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే తదితరులు సంతాపం తెలిపారు. సినీ ప్రముఖులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని నివాళులు అర్పించారు.

Exit mobile version