మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్, మాజీ పీసీసీ అధ్యక్షులు కొణిజేటి రోశయ్య అనారోగ్యం కారణంగా ఈరోజు ఉదయం కన్నుమూశారు. రోశయ్య మృతికి 4, 5, 6 తేదీల్లో మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిపిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అజాత శత్రువు కన్నుమూతతో రాజకీయాల్లో ఒక శకం ముగిసింది అంటూ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రొడ్యూసర్ కాట్రగడ్డ ప్రసాద్ తదితరులు రోశయ్య మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు.
Read Also : రాజకీయాలలో ఓ శకం ముగిసింది : చిరంజీవి
రాజకీయాన్నిశ్వాసగా, రాజకీయాన్ని అవపోసన పట్టి, రాజకీయ భాషను కొత్త పుంతలు తొక్కించి, అప్రతిహతఘటనా సమర్ధులైన రాజకీయ భీష్ములు, రాజకీయ దురంధురులు కొణిజేటి రోశయ్యగారు ఆకస్మికంగా భువి నుంచి దివికేగడం తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది. ముఖ్యమంత్రిగా వారు ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని ముక్కోటి దేవతలను కోరుకుంటున్నాను – మంచు మోహన్ బాబు
సహనశీలి, అజాత శత్రువు, రాజకీయ భీష్మాచారుడు శ్రీ కొణిజేటి రోశయ్య గారి మరణం విని దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు మాజీ గర్వర్నర్ గా ఎన్నో సేవలు అందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థికశాఖ మంత్రిగా రోశయ్య తన సేవలను అందించారు. 2009-10 బడ్జెట్‌తో కలిపి మొత్తం 16 సార్లు రాష్ట్ర బడ్జెట్‌ను ఆయన ప్రవేశపెట్టారు. అదొక రికార్డు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ నుంచి మేము వెళ్లి సహాయం అడిగితే వెంటనే స్పందించే వారు. ఆయన అకాల మరణం బాధాకరం – ప్రొడ్యూసర్ కాట్రగడ్డ ప్రసాద్
రాజకీయాలలో.. పితామహుడు, సహనశీలి.. నిరాడంబరుడు. మాజీ తమిళనాడు గవర్నర్.. శ్రీ కొణిజేటి రోశయ్య గారి మరణం.. తెలుగు రాష్ట్రాలకు, తమిళనాడుకు తీరనిలోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని.. ” తెలుగు దర్శకుల సంఘం ” కోరుకుంటుంది – వై. కాశీ విశ్వనాథ్, తెలుగు దర్శకుల సంఘం ప్రెసిడెంట్
