రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడున్న వర్మ వేరు.. ఒకప్పుడు ఉన్న డైరెక్టర్ వర్మ వేరు.. శివ, క్షణక్షణం, దెయ్యం లాంటి సినిమాలు తీసిన వర్మ.. ఇప్పుడు కథ లేని కొన్ని సినిమాలను తీసేసి ప్రేక్షకుల మీద రుద్దుతున్నాడని ఎంతోమంది ముఖం మీదనే చెప్పేస్తున్నారు. ఇలాంటి కామెంట్స్ చేసినా కూడా వర్మలో మాత్రం మార్పు వచ్చిందే లేదు. నచ్చినవాళ్లు చూస్తారు.. నచ్చనివాళ్ళు మానేస్తారు అని చెప్పుకొచ్చాడు. కానీ మొట్టమొదటిసారి వర్మ నా సినిమా చూడండి అని ప్రేక్షకులను కోరాడు.. అదే ‘లడ్కి’. తెలుగులో అమ్మాయి పేరుతో రిలీజ్ కానుంది. జూలై 15 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా గా హాజరయ్యారు. ఇక ఈ వేదికపై వర్మను విజయేంద్ర ప్రసాద్ ఏకిపారేశారు. ఒకపక్క పొగుడుతూనే ఇంకోపక్క చివాట్లు పెట్టారు.
“పది నెలల క్రితం కనపడుటలేదు సినిమా ఈవెంట్ కు వెళ్లాను. అక్కడ వర్మ కనిపించాడు. దాదాపు పది, పదిహేను సంవత్సరాల నుంచి అతడిపై ఉన్న కోపం, అసహ్యం, చిరాకు, బాధ అన్ని కలిపి వచ్చేశాయి. శివ సినిమా చూసాం. ఆ సినిమా చూసాకా నాలాంటి రచయితలు వందలమంది డైరెక్టర్లు, టెక్నీషియన్లు ప్రేరణ పొంది ఇండస్ట్రీకి వచ్చారు. ఇండస్ట్రీలో నిలబడ్డారు. కానీ, ఇప్పుడు ఆ వర్మ కనిపించడం లేదు. మీకు ఎవరైనా ఆ వర్మ కనిపిస్తే చెప్పండి.. మళ్లీ శివలాంటి సినిమా తీయమని.. అని వేదికపైనే అనేశాను. మళ్లీ ఇప్పుడు చెప్తున్నాను.. రాము గారు ఇన్నాళ్లకు ఆ వర్మ కనిపించాడు. ఎలా కనిపించారు అంటే శివ డైరెక్టర్ కన్నా వందరెట్లు ఎక్కువగా కనిపించారు. ఈ సినిమా 40వేల థియేటర్లో విడుదలవ్వడమంటే సాధారణ విషయం కాదు. నిజంగా తెలుగువారు గర్వపడల్సిన విషయం” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ అమ్మాయి సినిమా వర్మను శివ సిరెక్టర్ గా కంటే ఎక్కువగా నిలబెడుతుందా..? లేదా అనేది చూడాలి.
