Tollywood: అక్టోబర్ మాసంలో కన్నడ అనువాద చిత్రం ‘కాంతార’ సూపర్ హిట్ అయ్యి, ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. విశేషం ఏమంటే… నవంబర్ నెలలో కూడా అనువాద చిత్రానిదే పై చేయి అయ్యింది. 25వ తేదీ విడుదలైన తమిళ డబ్బింగ్ ఫిల్మ్ ‘లవ్ టు డే’ ఈ నెలలో రిలీజ్ అయిన చిత్రాలన్నింటిలోకి బెస్ట్ కలెక్షన్స్ సాధించబోతోంది. ‘లవ్ టుడే’ మొదటి రోజునే దాదాపు రెండున్నర కోట్ల గ్రాస్ కలెక్షన్ల ను సాధించింది. ఈ వారం విడుదలైన ఇతర చిత్రాలేవీ, ఇందులో సగం కలెక్షన్స్ కూడా సాధించలేదు. దాంతో నవంబర్ మొత్తానికీ ‘లవ్ టు డే’నే బెస్ట్ మూవీగా నిలువబోతోంది.
నవంబర్ ఫస్ట్ వీకెండ్ లో ఎనిమిది సినిమాలు విడుదలయ్యాయి. అందులో అల్లు శిరీష్ నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ కూడా ఒకటి. ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కు మంచి ఓపెనింగ్సే వచ్చినా… ఆ తర్వాత కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. వచ్చిన టాక్ కూ… థియేటర్లలో కలెక్షన్స్ కు సంబంధం లేకపోయింది. అదే శుక్రవారం సంతోష్ శోభన్ నటించిన ‘లైక్ షేర్ సబ్ స్క్రైబ్’ కూడా రిలీజ్ అయ్యింది. బట్… ప్రీ రిలీజ్ బజ్ కు తగ్గట్టుగా ఈ మూవీకి ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఇక నందు నటించిన ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ సైతం ఆడియెన్స్ ను మెప్పించలేకపోయింది. ఇదే వారం తమిళ డబ్బింగ్ మూవీ ‘ఆకాశం’, కన్నడ అనువాద చిత్రం ‘బనారస్’ వచ్చాయి. కానీ జనాలు ఈ మూవీస్ గురించి మాట్లాడుకోలేదు. ఇదిలా ఉంటే కొన్ని దశాబ్దాలుగా లాబ్ లోనే మగ్గిపోయిన అక్కినేని నాగేశ్వరరావు ‘ప్రతిబింబాలు’ సినిమా ఎట్టకేలకు నవంబర్ 5న రిలీజ్ అయ్యింది. ఈ మూవీ పరాజయం పాలు కావడంతో నిర్మాత, పంపిణీదారులు మధ్య మనస్పర్థలు ఏర్పడి, పోలీస్ కేసులయ్యాయి.
నవంబర్ సెకండ్ వీకెండ్ లో వచ్చిన సినిమాల్లో అందరి దృష్టి సమంత నటించిన ‘యశోద’ పైనే ఉంది. ఊహించిన దానికంటే ఈ మూవీకి బెటర్ టాక్ వచ్చింది. సమంత నటించిన గత లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కు ‘యశోద’ పూర్తి భిన్నంగా ఉందని, ఇది తప్పకుండా జనాలను ఆకట్టుకుంటుందని అంతా భావించారు. కానీ థియేటర్లలో ఈ సినిమా పెద్దంత సందడి చేయలేకపోయింది, మూవీ జస్ట్ యావరేజ్ గా నిలిచిపోయింది. ఈ వారం వచ్చిన హాలీవుడ్ మూవీ ‘బ్లాక్ పాంథర్’ దానికున్న క్రేజ్ కు తగ్గట్టు మంచి ఓపెనింగ్స్ ను సాధించింది. ఇక థర్డ్ వీకెండ్ లో వచ్చిన సినిమాలలో హారర్ థ్రిల్లర్ ‘మసూద’ టెక్నికల్ గా బెస్ట్ మూవీ అనిపించుకుంది. ఇదే వారంలో ‘జబర్దస్త్’ ఫేమ్ సుడిగాలి సుధీర్ నటించిన ‘గాలోడు’ కూడా విడుదలైంది. మసూద’ కలెక్షన్లు క్రమంగా పెరుగుతుంటే… ‘గాలోడు’కు మంచి ఓపెనింగ్స్ దక్కాయి. వీటితో పాటే వచ్చిన మరే సినిమా గురించి జనం మాట్లాడుకోలేదు.
నవంబర్ లాస్ట్ వీకెండ్ లో వచ్చిన సినిమాలలో థాట్ ప్రొవోకింగ్ మూవీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘అల్లరి’ నరేశ్ ‘నాంది’ మూవీతో కొందరు దీనిని పోల్చినా, ఆ స్థాయి విజయం ఈ సినిమాకు దక్కదనేది ఓపెనింగ్స్ బట్టీ తేలిపోయింది. ఇదిలా ఉంటే ఇప్పటికే తమిళంలో ఘన విజయం సాధించిన ‘లవ్ టుడే’ మూవీ కూడా 25వ తేదీన వచ్చింది. యూత్ ను టార్గెట్ చేస్తూ, ప్రదీప్ రంగనాథ్ తెరకెక్కించి, నటించిన ‘లవ్ టు డే’కు తెలుగునాట హిట్ టాక్ వచ్చేసింది. ఇదే శుక్రవారం హిందీ చిత్రం ‘బేడియా’ను తెలుగులో ‘తోడేలు’గా అనువదించి, అల్లు అరవింద్ విడుదల చేశారు. త్రీడీలో రూపొందిన ఈ హారర్ మూవీ జనాలను మెప్పించడంలో విఫలమైంది. మరో రెండు, మూడు చిన్న సినిమాలు ఈ వీకెండ్ లో జనం ముందుకు వచ్చినా, ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాయి. దాంతో ఈ నెల విజేత ‘లవ్ టుడే’ అని చెప్పొచ్చు!
