అప్పుడే 2022లో ఆరు నెలలు గడచిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా సినిమా పరిస్థితి ఏ మాత్రం చక్కబడలేదు. మన తెలుగు సినిమా రంగం కూడా అందుకు మినహాయింపేమీ కాదు. ఈ ఆరు నెలల్లో తెలుగు సినిమా చేసిన ప్రయాణంలో మొత్తం 135 చిత్రాలను జనం ముందు నిలిపింది. వాటిలో 94 స్ట్రెయిట్ మూవీస్ కాగా, 41 డబ్బింగ్ సినిమాలు. ఈ చిత్రాలలో 15 మూవీస్ ఓటీటీ బాట పట్టాయి.
జనవరి – ఫిబ్రవరి..
జనవరి నెలలో మొత్తం 17 స్ట్రెయిట్ మూవీస్, 2 డబ్బింగ్ సినిమాలు వెలుగు చూశాయి. వీటిలో ఏవీ తమ సత్తా చాటలేక పోయాయనే చెప్పాలి. ఈ సారి సంక్రాంతి బరిలో నాలుగు చిత్రాలే సందడి చేశాయి. అందులో నాగార్జున ‘బంగార్రాజు’ మాత్రమే బిగ్ మూవీ. ‘సూపర్ మచ్చి’, ‘రౌడీ బాయ్స్’, ‘హీరో’ అదే సమయంలో సందిట్లో సడేమియాలా దూరాయి. ‘రౌడీ బాయ్స్’తో దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ హీరో గా పరిచయం అయ్యాడు. కాగా, ‘హీరో’ సినిమాతో నటశేఖర కృష్ణ మనవడు, మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా అరంగేట్రం చేశాడు. జనవరిలో హిట్ అనదగ్గ చిత్రమేదీ లేదనే చెప్పాలి.
ఫిబ్రవరిలో 30 సినిమాలు వెలుగు చూడగా, వాటిలో 22 స్ట్రెయిట్ మూవీస్, ఎనిమిది డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. వీటిలో మూడు ఓటీటీలో వెలుగు చూశాయి. మోహన్ బాబు ‘సన్నాఫ్ ఇండియా’, శ్రీకాంత్ ‘కోతలరాయుడు’, రవితేజ ‘ఖిలాడి’, పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ చిత్రాలు ఫిబ్రవరిలోనే బాక్సాఫీస్ బరిలోకి దూకాయి. వీటిలో పవన్ ‘భీమ్లా నాయక్’ మంచి ఓపెనింగ్స్ చూసింది. ఫిబ్రవరి 18వ తేదీన ఏకంగా 11 సినిమాలు బాక్సాఫీస్ వార్ కు సిద్ధం కాగా, ఏదీ సక్సెస్ చూడలేక పోయింది. తమిళ టాప్ హీరో అజత్ నటించిన ‘వలీమై’ అనువాద రూపంలో పలకరించింది. కానీ, ఆకట్టుకోలేక పోయింది. అయితే అదృష్టవంతులకు అవకాశం అందివస్తుందని సామెత! ఫిబ్రవరి 12న విడుదలైన ‘డి.జె.టిల్లు’ చిత్రం అనూహ్యంగా యువతను ఆకట్టుకుంది. కొద్ది రోజులు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కళ కళ లాడింది. మిగిలిన చిత్రాలన్నీ రెండో నెలలోనూ వచ్చీ రాగానే చాపచుట్టేశాయనే అనాలి.
మార్చి – ఏప్రిల్..
బడ్జెట్ ను బట్టి టిక్కెట్ రేట్లు పెంచుకొనే వెసలుబాటు తెలంగాణలో కల్పించారు. అయితే, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ప్రభుత్వం ససేమిరా అంటూ పెద్ద సినిమాలకు సైతం మామూలు రేట్లనే నిర్ణయించింది. దాంతో కొన్ని సినిమాలకు గండి పడింది. ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ విడుదలైన దగ్గర నుంచీ ఇదిగో అప్పుడు, అదుగో ఇప్పుడు అంటూ ఏపీలోనూ టిక్కెట్ రేట్లు పెంచుకొనే వీలు కోసం సినీజనం ఎదురుచూశారు. మార్చి మొదటివారంలో ఏపీ ప్రభుత్వం ఆ వీలు కల్పించింది. ప్రభాస్ ‘రాధేశ్యామ్’ తమ బడ్జెట్ కు తగ్గ రేటుతో ఏపీలోనూ విడుదలయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ చూసింది. అయితే ఈ సినిమా చప్పున చల్లారి పోయింది. మార్చి నెలలో మొత్తం 18 చిత్రాలు విడుదల కాగా, వాటిలో 13 స్ట్రెయిట్, 5 డబ్బింగ్ ఉన్నాయి. వీటిలో రెండు సినిమాలు ఓటీటీలోకి వెళ్ళాయి. ఈ నెలలో పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రంగా వచ్చిన అనువాదం ‘జేమ్స్’ పరవాలేదనిపించింది.
శర్వానంద్, రష్మిక నటించిన ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయింది. సునీల్ కుమార్ రెడ్డి యువతను ఆకట్టుకొనే ప్రయత్నంలో తెరకెక్కించిన ’69 సంస్కార్ కాలనీ’ హీరోయిన్ అందాల ఆరబోతతో సాగాలనుకుంది. ఫలితం దక్కలేదు. మార్చి 25న “మాకు మేమే సాటి..” అంటూ వచ్చిన రాజమౌళి, జూ.యన్టీఆర్, రామ్ చరణ్ చిత్రం ‘ట్రిపుల్ ఆర్’ జనాన్ని విశేషంగా థియేటర్లకు రప్పించింది. అందుకు ‘బాహుబలి’ సిరీస్ తరువాత వచ్చిన రాజమౌళి చిత్రం ఇదే కావడం ఓ కారణం కాగా, ఈ తరం టాప్ స్టార్స్ నటించిన అసలు సిసలు మల్టీస్టారర్ గానూ ‘ట్రిపుల్ ఆర్’ భలేగా సందడి చేసింది. అయితే, రాజమౌళి ‘బాహుబలి’ సిరీస్ తో పోలిస్తే, ‘ట్రిపుల్ ఆర్’ ఆ స్థాయిలో సందడి చేయలేక పోయిందని అందరూ అంగీకరించారు.
ఏప్రిల్ నెలలో మొత్తం 22 సినిమాలు విడుదల కాగా, వాటిలో 13 స్ట్రెయిట్, 9 డబ్బింగ్, వీటిలో మూడు సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. తాప్సీ ‘మిషన్ ఇంపాజిబుల్’, విజయ్ డబ్బింగ్ మూవీ ‘బీస్ట్’, సమంత, నయనతార, విజయ్ సేతుపతి నటించిన అనువాదం ‘కే.ఆర్.కే.’, కన్నడ డబ్బింగ్ ‘కేజీఎఫ్-2’ కూడా అటు ఇటుగా ఏప్రిల్ ప్రథమార్ధంలోనే సందడి చేసే ప్రయత్నం చేశాయి. అయితే ‘కేజీఎఫ్-2’ విజయకెరాటల ముందు మిగిలినవి కొట్టుకుపోయాయనే చెప్పాలి. సరైన సమయంలో తమ చిత్రాలను విడుదల చేసుకోవడంలో మెగా కాంపౌండ్ హీరోలకు మంచి ప్రణాళిక ఉంటుందని ప్రతీతి. అదే తీరున ‘కేజీఎఫ్-2’ వచ్చిన రెండు వారాలకు చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ కలసి నటించిన ‘ఆచార్య’ను విడుదల చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అనూహ్యంగా జనాన్ని ఆకట్టుకోలేక పోయింది. ఇక మిగిలిన సినిమాల సంగతి సరే సరి!
మే – జూన్..
మే నెలలో 17 సినిమాలు రాగా, వాటిలో పది స్ట్రెయిట్, ఏడు డబ్బింగ్ మూవీస్ వచ్చాయి. వీటిలో నాలుగు ఓటీటీ దారి పట్టాయి. ‘అశోకవనంలో అర్జునకళ్యాణం’ కోసం హీరో స్వయంగా ‘ప్రాంక్’ ప్లే చేసి, హంగామా చేశాడు.ఆ సినిమాతో పాటు వచ్చిన ‘భళా తందనాన’, ‘జయమ్మ పంచాయితీ’ ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయాయి. కాగా, ఆంగ్ల అనువాద చిత్రం ‘డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మేడ్నెస్’ అదరహో అనిపించింది. అదే రోజున వచ్చిన మరో డబ్బింగ్ మూవీ ‘కశ్మీర్ ఫైల్స్’ అంతకు ముందే జనాన్ని ఆకట్టుకుంది. తరువాత తెలుగువారినీ అలరించింది. ఈ యేడాది తెలుగువారికి ఊరట కలిగించిన మాసం ఏది అంటే మే నెల అనే చెప్పాలి? ఎందుకంటే ‘సర్కారు వారి పాట’తో పాటు, వెంకటేశ్, వరుణ్ తేజ్ నటించిన ‘ఎఫ్ 3’ సైతం థియేటర్లలో కొన్నాళ్ళు సందడి చేసింది. పది సినిమాల్లో రెండు చిత్రాలు విజయం సాధించాయంటే, ఇరవై శాతం సక్సెస్ రేటు ఉన్నట్టేగా! అందుకని, మే ఈజ్ ద బెస్ట్ అనే చెప్పాలి.
ఆరో నెల జూన్ అదరహో అనిపించింది. 19 స్ట్రెయిట్ మూవీస్, 10 డబ్బింగ్ వెరసి 29 సినిమాలు వెలుగు చూడగా, వాటిలో మూడు ఓటీటీ బాట పట్టాయి. స్ట్రెయిట్ మూవీస్ లో ‘మేజర్’ భలేగా జనాన్ని ఆకట్టుకుంది. అదే రోజున వచ్చిన కమల్ హాసన్ డబ్బింగ్ ‘విక్రమ్’ కూడా ప్రేక్షకులను మురిపించింది. ఈ సినిమాలకు ఓ రోజు ముందు నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన మళయాళం ‘జనగణమన’ డబ్బింగ్ కూడా జనాన్ని కట్టి పడేసింది. ఇలా జూన్ భలేగా రంజింపచేసింది. కానీ, నాని ‘అంటే సుందరానికీ’, రాణా ‘విరాటపర్వం’ చిత్రాలు ఉసూరుమనిపించాయి. జూన్ 24న ‘సమ్మతమే, ‘చోర్ బజార్’, ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’. ‘7డేస్ 6 నైట్స్’ వంటి 7 సినిమాలు జనం ముందు నిలచినా ఏవీ సక్సెస్ మాట అటుంచి కనీస ఓపెనింగ్స్ కూడా సాధించలేక పోయాయి. జూన్ 30న ‘మినియన్స్ : ది రైజ్ ఆఫ్ గ్రూ’ కంప్యూటర్ గ్రాఫిక్స్ మూవీ డబ్బింగ్ తో జనం ముందు నిలచింది.
ఈ ఆరు నెలలనూ పరిశీలిస్తే పరాజయాల సంఖ్యముందు, విజయాల సంఖ్య చిన్నబోయిందనే చెప్పాలి. కనీసం, 135 చిత్రాలలో 14 కూడా విజయం సాధించలేకపోయాయి. అంటే సక్సెస్ రేటు 10 శాతం కూడా లేదన్న మాట! రాబోయే ఆరు నెలల్లో వచ్చే చిత్రాలలో ఎన్ని విజయకేతనం ఎగురవేస్తాయో, సక్సెస్ రేటును ఏ మేరకు పెంచుతాయో చూడాలి.