NTV Telugu Site icon

LV Prasad Jayanthi Special: చిత్రసీమలో ఎప్పటికీ చెరగని పేరు ఎల్వీ ప్రసాద్

Lv Prasad

Lv Prasad

తెలుగునాట పుట్టినా, భారతీయ చిత్రసీమలోనే తనదైన బాణీ పలికిస్తూ సాగిన ఘనులు దర్శకనిర్మాత నటులు ఎల్.వి.ప్రసాద్. ఆయన చిత్రాల ద్వారా మేటి నటులు చిత్రసీమలో తమ బాణీ పలికించారు. తెలుగు, తమిళ చిత్రరంగాల్లో ఎల్వీ ప్రసాద్ పేరు ఈ నాటికీ మారుమోగుతూనే ఉంది. భారతదేశంలోని ప్రధాన చిత్రపరిశ్రమల్లో ఎల్వీ ప్రసాద్ అన్నది ఓ బ్రాండ్ నేమ్. వారి ప్రసాద్ ల్యాబ్స్ , ఔట్ డోర్ యూనిట్స్ , ఇఎఫ్ఎక్స్ , ప్రసాద్ ఐమాక్స్ అన్నీ సినీజనానికి సుపరిచితాలు. తాను చిత్రసీమలో సంపాదించినది, మళ్ళీ సినిమా రంగంలోనే పెట్టుబడిగా పెట్టారు ప్రసాద్. ఇక ఐ ఇన్ స్టిట్యూట్ నిర్మాణంలోనూ స్వార్థముందని చెప్పారు. ఎందుకంటే తమ ఐ ఇన్ స్టిట్యూట్‌లో చికిత్స పొందిన వారు కళ్ళు బాగయితే మళ్ళీ సినిమాలు చూస్తారు కదా అన్నది ఆయన మాట! అలాగే నేడు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్ స్టిట్యూట్ దేశవ్యాప్తంగా పేరొందింది.

ఎల్వీ ప్రసాద్‌ పూర్తి పేరు అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు. 1907 జనవరి 17న పశ్చిమ గోదావరి ఏలూరు తాలూకా సోమవారప్పాడులో జన్మించారు. చిన్నతనం నుంచీ చదువులో అంత ఆసక్తి చూపించేవారు కాదు. 17 ఏళ్ళ వయసులో ప్రసాద్ కు వివాహమయింది. ఓ బిడ్డ పుట్టిన తరువాత ఇంటి నుండి పోయి, సినిమా రంగంలో రాణించాలని తపించారు. ఎల్వీ ప్రసాద్‌కు తొలి నుంచీ ఏదో సాధించాలన్న తపన ఉండేది. పెళ్ళయి ఓ బిడ్డ తండ్రి అయిన తరువాతే, ముంబయ్ వెళ్ళి అక్కడ పలు పాట్లు పడ్డారు. చిత్రసీమలోనే రాణించాలని ఆశించారు. థియేటర్ గేట్ కీపర్ గా పనిచేశారు. స్టూడియోల్లోనూ పనిచేసి, తిన్నగా సినిమాల్లో వేషాలూ సంపాదించారు. భారతీయుల తొలి టాకీ చిత్రం ‘ఆలమ్ అరా’లోనూ, తెలుగువారి తొలి మాటల సినిమా ‘భక్త ప్రహ్లాద’లోనూ, తెలుగు-తమిళ భాషల్లో రూపొందిన మొదటి చిత్రం ‘కాళిదాస’లోనూ ప్రసాద్ నటించారు. అలా మూడు చోట్లా తొలి టాకీస్ లో ఎల్వీ ప్రసాద్ నటించడం ఓ రికార్డు!

ప్రసాద్ నటిస్తూనే కొంతమంది దర్శకుల వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు. సారథి సంస్థ నిర్మించిన ‘గృహప్రవేశం’తో ఆయన దర్శకుడయ్యారు.ఈ చిత్రంలో కథానాయకుడు కూడా ఆయనే కావడం విశేషం. గూడవల్లి రామబ్రహ్మం ఆరంభించిన ‘పల్నాటి యుద్ధం’ చిత్రం ఆయన మరణంతో ఆగిపోయింది. ఎల్వీ ప్రసాద్ దర్శకునిగా పగ్గాలు చేతబూని ఆ సినిమాను పూర్తిచేశారు. తరువాత ఎమ్.ఆర్.ఏ. ప్రొడక్షన్స్ సంస్థాధినేత పి.కృష్ణవేణి తాము నిర్మించే ‘మనదేశం’ చిత్రానికి ప్రసాద్ ను దర్శకునిగా ఎంచుకున్నారు. అందులో ఆ నాటి మేటి నటులు చిత్తూరు నాగయ్య, సిహెచ్. నారాయణరావు నటించారు. ఇక కృష్ణవేణి నాయికగా మురిపించారు. ఈ చిత్రంతోనే ఎన్టీఆర్ చిత్రసీమలో అడుగు పెట్టారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స్ తొలి చిత్రం ‘షావుకారు’కు దర్శకత్వం వహించిన ఎల్వీ ప్రసాద్, ఆ సంస్థ నిర్మించిన మరో సాంఘిక చిత్రం ‘పెళ్ళి చేసి చూడు’నూ రూపొందించారు. ఈ చిత్రం 1952 ఫిబ్రవరి 29న లీపు సంవత్సరం కానుకగా విడుదలై విజయదుందుభి మోగించింది. ఇప్పటి దాకా ఫిబ్రవరి 29న విడుదలైన ఏ తెలుగు చిత్రమూ అంతటి విజయాన్ని చవిచూడక పోవడం విశేషం. విజయా సంస్థ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మించిన ‘మిస్సమ్మ’కూ ప్రసాదే దర్శకత్వం వహించారు. తెలుగులో ఆయన చివరగా దర్శకత్వం వహించిన చిత్రం ‘అప్పుచేసి పప్పుకూడు’. ఈ సినిమా కూడా విజయా సంస్థ నిర్మించినదే.

ప్రసాద్ చిత్రాల ద్వారా ఎందరో మహానటులు వెలుగు చూశారు. ఇక తెలుగువారికి ఎల్వీ ప్రసాద్ గుర్తుండటానికి ముఖ్యకారణం మహానటుడు యన్టీఆర్ ను తెరకు పరిచయం చేసింది ఆయనే కాబట్టి. ఇక తమిళ నాటకరంగంలో రాణిస్తున్న శివాజీగణేశన్ ను తన దర్శకత్వంలో రూపొందిన ‘పరదేశి’ ద్వారా తెరకు పరిచయం చేశారు ప్రసాద్. నిజానికి ఇదే శివాజీగణేశన్ తొలి చిత్రం. అయితే తమిళంలో ఆయన నటించిన ‘పరాశక్తి’ ముందుగా విడుదలయింది. ఆ తరువాత ప్రసాద్ తెరకెక్కించిన ‘మనోహర’ చిత్రంతో తమిళ, తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు శివాజీగణేశన్. అప్పటి దాకా జానపద చిత్రాలతోనే సాగుతోన్న ఏయన్నార్‌ను తన ‘సంసారం’తో సాంఘిక చిత్రాలకు పరిచయం చేశారు. ఈ చిత్రంలోనే ఓ పాటలో మెరుపుతీగెలా కనిపించారు సావిత్రి. ఇక సావిత్రిని నటిగా ‘పెళ్ళిచేసి చూడు’లో తీర్చిదిద్దిందీ ప్రసాదే. తరువాత ‘మిస్సమ్మ’గా సావిత్రిని జనం మదిలో నిలిపిందీ ఆయనే. ‘మిస్సమ్మ’ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రసాద్ దర్శకత్వంలోనే రూపొందింది. ఈ మూడు చిత్రాలలోనూ జమున నటించడం విశేషం.

తరువాతి రోజుల్లో ఎల్వీ ప్రసాద్ నిర్మాతగా మారి తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లోనూ సినిమాలను నిర్మించారు. తాను నిర్మాతగా వ్యవహరిస్తూ డి.యోగానంద్ దర్శకత్వంలో అక్కినేని, అంజలీదేవి ప్రధాన పాత్రల్లో ‘ఇలవేల్పు’ చిత్రం తెరకెక్కించారు. ఇదే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో ‘శారద’ పేరుతో హిందీలో నిర్మించారు. రాజ్ కపూర్, మీనాకుమారి ఇందులో నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ప్రసాద్ నిర్మాతగానూ ఉత్తరాదిన మంచి పేరు సంపాదించారు. ఆపై దక్షిణాదిన విజయం సాధించిన పలు చిత్రాలను హిందీలో నిర్మించారు ప్రసాద్. 1978లో కె. బాలచందర్ తెరకెక్కించిన తెలుగు చిత్రం ‘మరో చరిత్ర’ ఘనవిజయం సాధించింది. ఈ సినిమాను బాలచందర్ దర్శకత్వంలోనే హిందీలో ‘ఏక్ దూజే కేలియే’ పేరుతో రీమేక్ చేశారు ప్రసాద్. ‘ఏక్ దూజే కేలియే’తోనే కమల్ హాసన్ తొలిసారి హిందీ చిత్రసీమలో అడుగుపెట్టాడు. హిందీలోనూ ఈ సినిమా ఘనవిజయం సాధించింది.
కమల్ హాసన్ నిర్మించిన తొలి చిత్రం ‘రాజా పారవై’. తెలుగులో ఈ సినిమా ‘అమావాస్య చంద్రుడు’గా విడుదలయింది. ఈ చిత్రంలో ఎల్వీ ప్రసాద్ హీరోయిన్ మాధవి తాత పాత్రలో నటించారు. అలా నిర్మాతగా కమల్ తొలి చిత్రం ఎల్వీ ప్రసాద్ కు నటునిగా చివరి చిత్రం కావడం విశేషం.

భారతీయ సినిమా రంగంలో ఎల్వీ ప్రసాద్ ఓ వటవృక్షం. ఆయన నీడన ఎందరో కళాకారులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు రాణించి, చిత్రసీమలో చోటు సంపాదించగలిగారు. చిత్రసీమలో తాను సంపాదించినది, అందులోనే పెట్టుబడిగా పెట్టి అనేక శాఖలకు విస్తరించారు. తెలుగు చిత్రసీమకే కాదు భారతీయ సినిమారంగానికే ఎల్వీ ప్రసాద్ చేసిన సేవలు మరపురానివి…మరువలేనివి. భారతీయ చిత్రసీమలో అతిప్రతిష్ఠాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు ఎల్వీ ప్రసాద్. ఆయన భౌతికంగా లేకున్నా, ప్రసాద్ చూపిన బాటలో వారసులు నడుస్తూ ఆయనను గుర్తు చేస్తూనే ఉన్నారు. జనవరి 17న ఎల్వీ ప్రసాద్ 116వ జయంతిని పురస్కరించుకొని ఆయన తనయుడు ప్రసాద్స్ మల్టీప్లెక్స్ అధినేత రమేశ్ ప్రసాద్ ఓ సంస్మరణ సభ నిర్వహిస్తున్నారు.

(ఎల్వీ ప్రసాద్ జయంతి జనవరి 17న)