Animation Universe: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. ‘ఆర్య’ కోసం యానిమేటెడ్ యూనివర్స్ సిద్ధం!

Animation Universe1

Animation Universe1

Animation Universe : తెలుగు సినిమా అంటే ఇప్పటివరకు భారీ సెట్లు, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, స్టార్ హీరోల మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే అభిప్రాయం ఉండేది. అయితే ఇప్పుడు ఆ పరిధిని దాటి టాలీవుడ్ మరో కొత్త దిశగా అడుగులు వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్‌లో మార్వెల్, డీసీ వంటి సంస్థలు విజయవంతంగా అమలు చేసిన యూనివర్స్ కాన్సెప్ట్‌ను ఇప్పుడు తెలుగు చిత్రసీమ కూడా తనదైన శైలిలో స్వీకరిస్తోంది. ఈ పరిణామం టాలీవుడ్ కథల పరిధిని మరింత విస్తరిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మార్పుకు మొదటి బలమైన సంకేతం ప్రభాస్ నటించిన కల్కి 2898 AD విడుదలకు ముందే కనిపించింది. సినిమా ప్రపంచాన్ని ప్రేక్షకులకు ముందుగానే పరిచయం చేయాలనే ఉద్దేశంతో చిత్రబృందం B&B యానిమేటెడ్ సిరీస్‌ను తీసుకొచ్చింది. ఇందులో భైరవ, బుజ్జి పాత్రలను ముందుగానే పరిచయం చేయడం ద్వారా సినిమా ప్రపంచంపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిన కథను మరింత సులభంగా అర్థమయ్యేలా చేయడంలో ఈ వ్యూహం కీలక పాత్ర పోషించింది. సినిమా విడుదలకు ముందే ప్రేక్షకులను ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లే ఈ ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇచ్చిందనే అభిప్రాయం వ్యక్తమైంది.

ఇదే దారిలో ఇప్పుడు బాహుబలి ఫ్రాంచైజీ కూడా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ కథను మరింత విస్తరించే ప్రయత్నంలో భాగంగా వచ్చే ఏడాది ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ పేరుతో యానిమే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో బాహుబలి ప్రపంచాన్ని మరో కోణంలో ఆస్వాదించే అవకాశం అభిమానులకు లభించనుంది. అయితే ప్రస్తుతం ఇదే రూట్ లో అల్లు అర్జున్ మూవీ కూడా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. అల్లు అర్జున్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ఆర్య పాత్ర చుట్టూ ప్రత్యేక యానిమేటెడ్ యూనివర్స్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు దిల్ రాజు కూడా ఇటీవల ధృవీకరించారు. భారీ యాక్షన్ కథలు, ఫాంటసీ ప్రపంచాలకు యానిమేషన్ సహజంగా సరిపోతుందని చాలామంది భావిస్తారు. కానీ ప్రేమకథ ఆధారంగా రూపొందిన ఆర్యలాంటి పాత్రకు కూడా యానిమేషన్ రూపంలో కొత్త కథ చెప్పాలని నిర్ణయించడం ఇండస్ట్రీలో కొత్త ప్రయోగంగా మారింది. ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో తెలుగు చిత్రసీమలో ఎన్నో క్లాసిక్ పాత్రలు కొత్త యానిమేటెడ్ రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.