NTV Telugu Site icon

సిరివెన్నెలకు చివరి నివాళి… ఇండస్ట్రీ కన్నీటి పర్యంతం

Sirivennela

Sirivennela

ఫిలిం ఛాంబర్ లో సిరివెన్నెల భౌతిక కాయానికి సినీ ప్రముఖులు, అభిమానులు చివరిసారిగా నివాళులు అర్పిస్తున్నారు. సిరివెన్నెల పార్థివదేహాన్ని చూసి కంటతడి పెడుతున్నారు టాలీవుడ్ ప్రముఖులు.

తెలుగు ఇండస్ట్రీలో సిరివెన్నెల గ్రేటెస్ట్ రైటర్… ఆయన చాలా మంచి వ్యక్తి… బొబ్బిలి రాజా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే నుంచి మొన్న నారప్ప వరకు కలిసి పని చేశాము. ఆయనతో చాలా క్లోజ్ గా ఉండేవాడిని. ఈరోజు ఆయన లేరు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. సిరివెన్నెల ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను – వెంకటేష్

సిరివెన్నెల ఫ్యామిలీ మెంబర్ లాంటి వారు.. ఆయన లేరన్న విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాము. ఇప్పుడు ఆయన గురించి ఏం మాట్లాడినా తక్కువే అవుతుంది. ఇప్పటికీ షాకింగ్ గా ఉంది.. ఇండస్ట్రీకి సిరివెన్నెల మృతి పెద్ద లాస్ – నాని

తెలుగు సినీ సాహిత్య చరిత్రలో ఒక యుగం ముగిసిందని చెప్పాలి. ఆయన నాకు తండ్రిలాంటి వారు. ఆత్మీయ బంధువు. మా నాన్నగారి చివరి బుక్ ను ఆయనే లాంచ్ చేశారు. ఆయన లేని లోటు తీర్చలేనిది. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు, సినీ సాహిత్యానికి దురదృష్టకరమైన రోజు – డైరెక్టర్ మోహన్ కృష్ణ

నేను హైదరాబాద్ వచ్చాక కలిసిన మొదటి వ్యక్తి… ఆరోజు మమ్మల్ని ఎలా చూసుకున్నారో ఈరోజుకీ అలాగే చూసుకున్నారు. అందరూ నన్ను సునీల్ అని పిలుస్తారు. ప్రపంచంలో ఈయన ఒక్కరే నన్ను సునీలా అని పిలుస్తారు. చాలాసార్లు ఇంటికి తిరిగి వెళ్ళిపోదామని అనుకున్న సమయంలో సిరివెన్నెల పాటలు ధైర్యాన్ని ఇచ్చాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను – సునీల్

ఒక తెలుగు సినిమా రచయితలకు జరిగిన నష్టం కాదు. యావత్ తెలుగు సినిమా పరిశ్రమకు జరిగిన నష్టం. పాటే శ్వాసగా జీవించిన మా సిరివెన్నెల లేడన్న విషయం వింటే గుండె తరుక్కుపోతోంది. ఇటువంటి సాహిత్యం, ఎటువంటి వ్యక్తిత్వం, సంస్కారం ఆయన సూర్యుడు, రచనలో ఆయన చంద్రుడు… ఆకాశంలో ఆ ఇద్దరూ వేరు కావచ్చు. కానీ ఇండస్ట్రీలో ఆ రెండూ సిరివెన్నెలే… ఆయన కుటుంబానికి న ప్రగాఢ సానుభూతి – పరుచూరి గోపాలకృష్ణ

పాట పార్థివదేహమైపోయింది… మహానుభావుడు… సాహిత్యం ఎంత గొప్పదో ఆయన వ్యక్తిత్వం అంత గొప్పది… ఆయన గురువు కంటే ఎక్కువ – సాయి మాధవ్ బుర్రా

ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి చనిపోయారన్న విషయం అందరికీ దిగ్భ్రాంతిని కలిగించింది. ఇప్పటికి ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నాము. ఆయన సిరివెన్నెల కాదు చిరునవ్వుల సీతారామశాస్త్రి – మురళి మోహన్

మేము సినీ కెరీర్లో చాలా మంది రైటర్లను చూశాము. వాళ్ళ రోజుల్లో సాహిత్యం వేరు… ఈరోజుల్లో సాహిత్యం వేరు… అలాంటి ఈరోజుల్లో ఆయన అగ్రజుడు – సి.కళ్యాణ్

మహాకవి, తెలుగు జాతికి ఆయన మరణం తీరని లోటు. తెలుగు భాష కుప్పకూలిన రోజు నిన్న. నా జీవితంలో నేను ఫస్ట్ సినిమా నుంచి ఆత్రేయ గారు, సుందర రామ్మూర్తి గారు తరువాత నేను అన్ని పాటలూ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారితో రాయించినవే. ఆయన ఆఖరి రోజుల్లో మాతోనే ఉన్నారు. మా సినిమా పాటలు రాశారని చెప్పుకోవడానికి నేను ఎంతో గర్విస్తున్నాను. ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కే’కు 5 పాటలూ ఆయనే రాయాలి. అది మాకు చాలా పెద్ద లాస్ – అశ్వనీదత్

పాటలు రాయాలన్న ఒక ఇంట్రెస్ట్ ఉందని అన్నందుకు ఆయన దగ్గరకు తీసుకుని, నా మిస్టేక్స్ దూరం చేసి సదా నన్ను బిడ్డలా చూసుకున్న మా గురువు గారు… వారం క్రితం కూడా బాగా మాట్లాడారు. ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదు. ఆయన సినిమా ఇండస్ట్రీకి, సాహిత్యానికి చేసిన కృషి మరపురానిది – రామజోగయ్య శాస్త్రి

ఆయన మొట్టమొదటిసారి నిద్ర పోవడం చూస్తున్నాను. పాటలతో, ఆలోచనలతో బిజీగా ఉండే ఆయన ఇలా నింపాదిగా పడుకోవడం జీర్ణించుకోలేని విషయం. ఏం పాపం చేశామో తెలీదు… ముందుగా బాలు గారు వెళ్లిపోయారు… పాట వెళ్ళిపోయింది. మొన్న శివశంకర్ మాస్టర్ వెళ్లిపోయారు… ఆట వెళ్ళిపోయింది… నేడు ఈయన వెళ్లిపోవడం బాధాకరంగా ఉంది – సింగర్ సునీత

ఎప్పుడు కనబడినా, ఎక్కడ కనబడినా చాలా తీయగా మాట్లాడేవారు. మహా రచయితను ఫిలిం ఇండస్ట్రీ కోల్పోయింది – ఎస్వీ కృష్ణారెడ్డి

నా మొదటి చిత్రం నుంచి రుద్రమదేవి వరకు కూడా… నా చిత్రాల్లో సగం సినిమాలకు పైగా సిరివెన్నెలా లేదా వేటూరి రాసేవారు. ముఖ్యంగా శాస్త్రిగారితో నాకున్న అనుబంధం ప్రత్యేకమైనది. ఇద్దరమూ దాదాపుగా ఒకేసారి కెరీర్ మొదలు పెట్టాము. భౌతికంగా మనకు ఆయన దూరం కావచ్చు. కానీ ఆయన పాటలు ఎప్పుడూ మనతోనే ఉంటాయి. మనల్ని ముందుకు తీసుకెళ్తాయి – దర్శకుడు గుణశేఖర్