గత కొంతకాలంగా సినీ పరిశ్రమలోని సమస్యలపై, టికెట్ రేట్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చించడానికి టాలీవుడ్ ప్రముఖులు ప్రయత్నిస్తున్నారు. గత నెల రోజుల నుంచి ఈ విషయం టాలీవుడ్ లో చర్చనీయాంశం అవుతోంది. ఏపీ ప్రభుత్వం నుంచి సినీ పెద్దలకు ఆహ్వానం రావడం, అందరూ కలిసి చిరంజీవి ఇంట్లో మీట్ అవ్వడం, సమస్యల గురించి చర్చించడం చూస్తూనే ఉన్నాము. అయితే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తో ఎప్పుడు భేటీ అవుతారు ? అనే విషయంపై మాత్రం స్పష్టత లేకపోయింది. అయితే నేడు మంత్రి పేర్ని నానితో సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు భేటీ కాబోతున్నారు. ఈ మీటింగ్ లో ఏపీలో ఆన్‌లైన్ టికెటింగ్ విధానంపై చర్చ జరగనుంది.
Read Also : కనికరించండి… ఏపీ సీఎంకు చిరు రిక్వెస్ట్
ఈరోజు ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయంలో తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలతో ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నాని సమావేశం కానున్నారు. ఇండస్ట్రీ తరపున సినిమా పలువురు ప్రముఖ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, పంపిణీదారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఆన్లైన్ టికెట్ వ్యవస్థ, కోవిడ్ వల్ల సినిమా పరిశ్రమకు ఎదురైన ఇబ్బందులు మొదలైన విషయాలపై చర్చించి సినిమా ఇండస్ట్రీ సమస్యలకు ఓ పరిష్కారం తీసుకురానున్నారు. ఆన్లైన్ టికెట్ పై ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం తీస్కోలేదని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆన్లైన్ సినిమా టికెట్ అంశం పై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు నిన్న చిరంజీవి “లవ్ స్టోరీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జగన్ ప్రభుత్వానికి సినిమా పరిశ్రమ సమస్యల పరిష్కారం విషయంపై దృష్టి పెట్టమంటూ విన్నవించడం కూడా హాట్ టాపిక్ గా మారింది.
