అందాల అభినేత్రిగా జనం మదిలో నిలచిపోయిన శ్రీదేవి అంటే ఇప్పటికీ అభిమానులకు ఓ ఆనందం, ఓ అద్భుతం, ఓ అపురూపం. శ్రీదేవికి మాత్రమే ఎందుకంత ప్రత్యేకత! ఆమెలాగే బాల్యంలోనే నటించి, తరువాత కూడా నాయికలుగా రాణించిన వారు ఎందరో ఉన్నారు. అయినా, శ్రీదేవి ఓ స్పెషల్!?
నిజమే, శ్రీదేవిలాగే బాలనటిగానూ, తరువాత నాయికలుగానూ మురిపించిన వారు ఎందరో ఉన్నారు. అయితే ఎవరి సరసనైతే తాను మనవరాలుగా, కూతురుగా, చెల్లెలుగా నటించిందో సదరు హీరోలతోనే నాయికగానూ శ్రీదేవి మురిపించడం అరుదైన విషయమే! శ్రీదేవి ఎన్ని భాషల్లో నటించినా, ఆమెకు తారాపథం చూపించిన ఘనత తెలుగువారిదే. కానీ, చివరలో శ్రీదేవి ఇటు తెలుగు, అటు తమిళంలో అవకాశాలు లభిస్తే తెలుగువైపు రాకుండా అరవంవైపు అర్రులు చాచింది. అది ఒక్కటే తెలుగువారిని వేధించిన విషయం. అయినా, అంతకు ముందు ఆ తరువాత ఆమెను ఆరాధించిన విషయంలో ఏ మాత్రం భేదం చూపించలేదు మనవాళ్ళు. అదీ తెలుగువారి మదిలో శ్రీదేవికి ఉన్న స్థానం.
అంతటి స్థానం శ్రీదేవికి లభించడానికి కారణం, బాలనటిగా ఆమె మురిపించిన వైనం. అందాలభామగా అలరించిన తీరు కారణమని చెప్పక తప్పదు. ‘బడిపంతులు’లో మహానటుడు యన్టీఆర్ కు మనవరాలుగా నటించి, ఆ తరువాత ఆయన సరసనే ‘వేటగాడు’తో నాయికగా మురిపించింది. పైగా ఆ ‘వేటగాడు’తోనే శ్రీదేవికి స్టార్ హీరోయిన్ అన్న గుర్తింపు లభించింది. ఇలాంటి జిమ్మిక్ బహుశా తెలుగునాట ఎవరూ చేసి ఉండరు. అక్కడితో ఆగిపోతే, ఆమె శ్రీదేవి ఎందుకవుతుంది. వరుసగా నాలుగేళ్ళు యన్టీఆర్ తో బ్లాక్ బస్టర్స్ చూసి, ఓ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇలాంటి రికార్డు తెలుగునాట మరే తారకూ కనిపించదు. 1979లో ‘వేటగాడు’, 1980లో ‘సర్దార్ పాపారాయుడు’, 1981లో ‘గజదొంగ’, ‘కొండవీటి సింహం’, 1982లో ‘జస్టిస్ చౌదరి’, ‘బొబ్బిలిపులి’- ఇలా రామారావుతో శ్రీదేవి సిల్వర్ జూబ్లీస్, గోల్డెన్ జూబ్లీస్, డైమండ్ జూబ్లీ చూశారు. యన్టీఆర్-శ్రీదేవి జంటలాగా అలరించిన మరో హిట్ పెయిర్ కూడా మనకు కానరాదు.
ఏయన్నార్ తో ‘ప్రేమాభిషేకం’ వంటి బ్లాక్ బస్టర్ చూశారు శ్రీదేవి. తెలుగునాట తొలి ప్లాటినమ్ జూబ్లీగా నిలచిందీ చిత్రం. శోభన్ బాబుతో ‘ఇల్లాలు’, ‘దేవత’, కృష్ణతో ‘కిరాయి కోటిగాడు, వజ్రాయుధం’, కృష్ణంరాజుతో ‘పులిబిడ్డ, త్రిశూలం’ వంటి విజయాలనూ చవిచూశారు శ్రీదేవి. ఇక తరువాతి తరం హీరోలు చిరంజీవితో ‘జగదేకవీరుడు-అతిలోకసుందరి’, నాగార్జునతో ‘ఆఖరి పోరాటం’, వెంకటేశ్ తో ‘క్షణక్షణం’ చిత్రాల్లో నటించి అలరించారు. ఉత్తరాదిన సైతం మూడు తరాల హీరోలతో శ్రీదేవి నటించినా, వారెవరికీ శ్రీదేవి మనవరాలుగా, కూతురుగా, చెల్లిగా నటించలేదు. అందువల్ల తెలుగునాటనే శ్రీదేవి అరుదైన విజయాలను చవిచూడటమే కాదు, అపూర్వంగా చరిత్ర లిఖించారు అని చెప్పక తప్పదు. అందువల్ల ఖచ్చితంగా శ్రీదేవి ఓ స్పెషల్! తెలుగువారికి ఆమె మరింత స్పెషల్ అని చెప్పక తప్పదు.