తెలుగునాట ‘రాముడు’ అనగానే గుర్తుకు వచ్చేది మహానటుడు నటరత్న యన్.టి.రామారావే! ఇక ‘రాముడు’ టైటిల్స్ లో రూపొందిన అనేక చిత్రాలలోనూ యన్టీఆర్ నటించి అలరించారు. అరవై ఏళ్ళ క్రితం రామారావు అభినయంతో అలరించిన ‘టైగర్ రాముడు’ ఆ కోవకు చెందినదే! జనబాహుళ్యంలో ఉన్న కథలకు సినిమా నగిషీలు చెక్కి చిత్రాలను రూపొందించడం రచయితలకు పరిపాటే! మొక్కై వంగనిది మానై వంగునా అనే సామెతను గుర్తు చేస్తూంది చిత్రం. అలాగే కన్నబిడ్డలను సన్మార్గంలో నడిపించవలసిన బాధ్యత తల్లిదండ్రులదే అన్న సత్యాన్నీ బోధిస్తుందీ సినిమా. 1960 మార్చి 8న విడుదలైన ‘టైగర్ రాముడు’ మంచి ఆదరణ పొందింది.
కథ పాతదే అయినా, కథనం కొత్తగా ఉండాలన్నది ఏ నాటి నుంచో వినిపిస్తున్న మాట! ‘టైగర్ రాముడు’ కథ అలాంటిదే! చిన్నతనంలో విలువైన వస్తువులు దొంగతనం చేసుకు వస్తున్న కొడుకును ఓ తల్లి ప్రోత్సహిస్తుంది. దాంతో పెద్దయ్యాక అతను పేరు మోసిన దొంగవుతాడు. చివరకు జైలు పాలవుతాడు. పోలీసులు పట్టుకు పోతున్న కొడుకును మందలిస్తుంది తల్లి. ఇదే మందలింపు చిన్నతనంలోనే చేసి ఉంటే నేను దొంగనయ్యేవాణ్ణి కాదు కదమ్మా అంటాడు కొడుకు. చివరకు జైలు శిక్ష అనుభవించడానికి వెళతాడు. ఈ కథ తెలుగునాట సుప్రసిద్ధమయినది.
ఇక దీనిని సినిమాగా మలచిన తీరులో- దొంగతనాలు చేయడంలో ‘టైగర్ రాముడు’గా పేరు మోసిన గజదొంగను పట్టుకోవడానికి స్పెషల్ సి.ఐ.డి. ఆఫీసర్ ప్రభాకర్ వస్తాడు. అతని చేతిలో టైగర్ రాముడు ముఠా సఫా అవుతుంది. టైగర్ రాముడు కూడా చనిపోయాడనుకుంటారు. అయితే రాముడు తప్పించుకొని, మోహన్ అనే పేరుతో బ్రహ్మం అనే మరో దొంగతో కలసి దొంగతనాలు చేస్తూ ఉంటాడు. తాము దొంగలించిన సొమ్ముతో ఓ దుకాణం పెడతారు. ఓ సారి రాధ అనే అమ్మాయిని మోహన్ కాపాడతాడు. తరువాత వారిద్దరూ ప్రేమించుకుంటారు. పోలీస్ ఆఫీసర్ ప్రభాకర్ చెల్లెలు ఈ రాధ. మోహన్ వెనకా ముందు ఎవరూ లేరని తెలుసుకొని, చెల్లెలి పెళ్ళికి అంగీకరిస్తాడు ప్రభాకర్. తరువాత రాధకు తన భర్త మోహన్ ఓ దొంగ అని తెలుస్తుంది. దాంతో అన్న ప్రభాకర్ కు మచ్చ తేరాదని ఇల్లు వదలి వెళ్తుంది. మోహన్ దేశదిమ్మరిలా తిరుగుతాడు. చివరకు భార్య, కొడుకు ఉన్నారని తెలుసుకుంటాడు. కొడుకు ఆరోగ్యం కోసం డబ్బులు అవసరమై బ్రహ్మంను కోరతాడు. అతను లేవని చెబుతాడు. దాంతో అతని వద్ద సొమ్ము బలవంతంగా తీసుకు వెళతాడు మోహన్. బ్రహ్మం పోలీసులకు ఫోన్ చేసి, మోహన్ ‘టైగర్ రాముడు’ అన్న విషయం చెబుతాడు. దాంతో పోలీసులు అతణ్ణి అరెస్ట్ చేసి తీసుకు వెళ్తూండగా, రాముని తల్లి వచ్చి విలవిలలాడుతుంది. చిన్నతనంలోనే తనను మందలించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని చెప్పి రాముడు పోలీసులతో వెళతాడు. అతని భార్య పిల్లాడు ఏడుస్తూంటారు. రాముని తల్లి చనిపోవడంతో కథ ముగుస్తుంది.
లంక కామేశ్వరరావు సమర్పణలో శ్రీశ్రీనివాస ప్రొడక్షన్స్ పతాకంపై వడ్డి శ్రీరాములు, పంతం చిన్నారావు ‘టైగర్ రాముడు’ను నిర్మించారు. సి.యస్.రావు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి ఘంటసాల సమకూర్చిన సంగీతం ఓ ఎస్సెట్. సముద్రాల జూనియర్ రాసిన పాటలు, మాటలు అలరించాయి. ఇందులోని “ఆశ దురాశ వినాశానికే…”, “హిమనగరే…” ,”నవభావనలో… హాయి…”, “ఎన్ని దినాలకు వింటినిరా…”, “ఉలకక పలకక…”, “చందమామ లోకంలో…” పాటలు ఆకట్టుకున్నాయి.
రాజసులోచన నాయికగా నటించిన ఈ చిత్రంలో యస్.వి.రంగారావు, రేలంగి, సి.ఎస్.ఆర్., లంక సత్యం, జగ్గారావు, సంధ్య, గిరిజ, హేమలత నటించారు. ఇందులోని నాటికగా వచ్చే “హిమనగరి…” అనే పాటలో యన్టీఆర్ తొలిసారి ప్రవరాఖ్యునిగా కనిపించారు. తరువాత ‘మనుషుల్లో దేవుడు’లోనూ “అహో హిమవన్నగమూ…” పాటలోనూ ఆయన ప్రవరాఖ్యునిగా నటించారు. ఇక ‘టైగర్ రాముడు’ కథ తెలుగునాట సుప్రసిద్ధమైనదే కావున తరువాతి కాలంలోనూ కొందరు దీనిని ఆధారం చేసుకొని సినిమాలు రూపొందించారు. మోహన్ బాబును ‘కేటుగాడు’ సినిమాతో హీరోగా పరిచయం చేస్తూ దాసరి నారాయణ రావు కూడా ఇదే కథను ఎంచుకున్నారు. రిపీట్ రన్స్ లోనూ ‘టైగర్ రాముడు’ వసూళ్ళు కురిపించింది.
