పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సెప్టెంబర్ 2న పెద్ద పండగే జరుపుకోబోతున్నారు! బర్త్ డే స్పెషల్ గా పలు కేంద్రాలలో ఎంపిక చేసిన థియేటర్లలో ‘జల్సా’ మూవీని 1న స్పెషల్ షోస్ వేస్తున్నారు. దీని ద్వారా ఓ సరికొత్త రికార్డ్ సృష్టించాలని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ మూవీ సెట్స్ పై ఉంది. క్రిష్ దర్శకత్వంలో ఎ. ఎం.రత్నం సమర్పణలో ఆయన సోదరుడు దయాకరరావు దీన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ రాబోతున్నాయి.
ఇటీవల ఈ మూవీని 2023 మార్చి 30న విడుదల చేయబోతున్నట్టుగా ఎ. ఎం. రత్నం చెప్పారు. అయితే బాలెన్స్ షూటింగ్ ఎప్పుడు ప్రారంభించేది ఆయన ప్రకటించలేదు. పవన్ కళ్యాణ్ బర్త్ డే కు రెండు రోజుల ముందే అంటే… ఆగస్ట్ 31 వినాయక చవితి సందర్భంగా ‘హరిహర వీరమల్లు’ మూవీ అప్ డేట్స్ ను ఫ్యాన్స్ కు అందించబోతున్నారు. ఓ స్పెషల్ పోస్టర్ తో పాటు, అభిమానులు ఊహించని విధంగా ఓ స్పెషల్ వీడియోను క్రిష్ రూపొందిస్తున్నారు. ఆ మూడు రోజులు సోషల్ మీడియాలో ‘హరిహర వీరమల్లు’ అప్ డేట్స్ రచ్చ చేయడం ఖాయమని అంటున్నారు.
అలానే పనిలో పనిగా దర్శకుడు హరీశ్ శంకర్ తో పవన్ చేస్తున్న ‘భవదీయుడు భగత్ సింగ్’ మూవీ, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవర్ స్టార్ చేయబోతున్న సినిమా అప్ డేట్స్ కూడా వస్తాయని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులంతా… ఆయన తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి ‘వినోదాయ సీతం’ రీమేక్ లోకి ఎప్పుడెప్పుడు ఎంటర్ అవుతారా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా బర్త్ డే సందర్భంగా రావచ్చని భావిస్తున్నారు. ఏదేమైనా పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఈ బర్త్ డే సమ్ థింగ్ మెమొరబుల్ గా ఉండబోతోంది!!
