NTV Telugu Site icon

Tollywood: ఈ వీకెండ్ మూవీస్ ఇవే!

Tollywood

Tollywood

Tollywood: గత వారం విడుదలైన సినిమాల్లో సుడిగాలి సుధీర్ నటించిన ‘గాలోడు’ కొద్దో గొప్పో ఓపెనింగ్స్ ను సాధించింది. అయితే రాహుల్ యాదవ్ నిర్మించిన హారర్ చిత్రం ‘మసూద’ కలెక్షన్లను నిదానంగా పెంచుకుంటూ స్టడీగా ముందుకు సాగుతోంది. మిగిలిన సినిమాల గురించి ఎవరూ మాట్లాడుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఈ శుక్ర, శనివారాల్లో మరో ఆరు సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. ‘మసూద’ను రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేసిన ‘దిల్’ రాజు… ఈ వారం తమిళంలో ఇప్పటికే విజయవంతమైన ‘లవ్ టుడే’ను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించి, హీరోగా నటించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తెలుగు వారినీ మెప్పిస్తుందని ‘దిల్’ రాజు గాఢంగా నమ్ముతున్నారు. ఇదే సమయంలో మరో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సైతం హిందీ సినిమా ‘బేడియా’ తెలుగు డబ్బింగ్ వర్షన్ ‘తోడేలు’ను రిలీజ్ చేస్తున్నారు. వరుణ్‌ ధావన్ కు తెలుగులో పెద్దంత మార్కెట్ లేకపోయినా, అందులో నాయికగా నటించిన కృతీసనన్ ‘వన్ – నేనొక్కడినే’, ‘దోచెయ్’ చిత్రాలతో తెలుగువారికి సుపరిచితురాలే. సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ మూవీ ‘తోడేలు’ కథాంశం తెలుగు వారికి నచ్చుతుందని అల్లు అరవింద్ భావిస్తున్నారు.

ఈ రెండు డబ్బింగ్ సినిమాలతోనూ ‘అల్లరి’ నరేశ్‌ నటించిన స్ట్రయిట్ తెలుగు సినిమా ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ పోటీ పడబోతోంది. ఓ గిరిజన గ్రామంలో జరిగే ఎన్నికల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తమిళ వాడైన ఎ. ఆర్. మోహన్ తెరకెక్కించారు. ఆనందిని హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నరేశ్ కు ‘నాంది’ లాంటి పేరు తెచ్చిపెడుతుందని అందరూ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే… ఈ సినిమాతో పాటు మరో మూడు చిన్న సినిమాలు కూడా ఈ వీకెండ్ లో వస్తున్నాయి. మల్హోత్రా ఎస్. శివమ్, శంకర్, అనుశ్రీ హీరో హీరోయిన్లుగా నటించిన ‘మన్నించవా’ శుక్రవారం రిలీజ్ అవుతోంది. రమేశ్ గౌడ్ దర్శకత్వంలో మంజుల చవన్ దీన్ని నిర్మించారు. యువ దర్శకుడు సిద్ధార్థ్‌ పెనుగొండ రూపొందించిన ‘వల’ సినిమా సైతం శుక్రవారమే జనం ముందుకు వస్తోంది. సైబర్ క్రైమ్ నేపథ్యంలో సిద్దార్థ్ ఈ మూవీని తెరకెక్కించాడు. రంజిత్ రాఘవ్, అభయ్ బేతిగంటి, మౌనిమా, చాందినీ రావ్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. విశేషం ఏమంటే… ఆ మర్నాడే అంటే శనివారం వస్తున్న ‘రణస్థలి’ మూవీలోనూ చాందినీ రావు కీలక పాత్రను పోషించింది. ఈ సినిమాను పరశురామ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూరెడ్డి విష్ణు నిర్మించారు. ధర్మ, చాందినీరావు, ప్రశాంత్, శివ, అశోక్ సంగా ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీలో కీలక పాత్రలను చేశారు. మరి సినిమాలు ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తాయో చూడాలి.