Telugu Movies: సంక్రాంతి కానుకగా నందమూరి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలు విడుదలైన నేపథ్యంలో ఆ తర్వాత వచ్చిన శుక్రవారం మరే సినిమాలు విడుదల కాలేదు. దాంతో జనవరి నెలాఖరులో రాబోతున్న సినిమాలపై అందరి దృష్టి పడింది. ఇందులో షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ మూవీ కాస్తంత ముందుగానే బుధవారం రిలీజ్ అవుతోంది. హిందీతో పాటు ఇది ఇతర దక్షిణాది భాషల్లోనూ డబ్ అయ్యింది. సూపర్ హిట్ పెయిర్ షారుఖ్ ఖాన్, దీపికా పదుకునే నటించిన ‘పఠాన్’ విడుదలకు ముందే వివాదాలకు గురి కావడంతో వాతావరణం హీట్ ఎక్కింది. పనిలో పనిగా విశేష ప్రచారమూ జరిగింది. ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని నిలువరిస్తూ షారుఖ్ ఖాన్ రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు మొదలెట్టారు. తానే స్వయంగా అస్సాం ముఖ్యమంత్రికి ఫోన్ చేసి, సినిమా విడుదల సాఫీగా సాగేలా చూడమని కోరారు. ఆ రకంగా ‘పఠాన్’ మూవీ గత కొన్ని రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. దాంతో దీనికి భారీ ఓపెనింగ్స్ ఖాయమనిపిస్తోంది.
ఇదిలా ఉంటే ఆ మర్నాడే అంటే 26వ తేదీ రిపబ్లిక్ డే రోజున సుధీర్ బాబు ‘హంట్’ మూవీ థియేటర్లలో సందడి చేయబోతోంది. శ్రీకాంత్, భరత్ కీలక పాత్రలు పోషించిన ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ చిత్రాన్ని మహేశ్ తెరెక్కించాడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ మూవీకి యాక్షన్ కొరియోగ్రాఫర్స్ గా హాలీవుడ్ నుండి టెక్నీషియన్స్ ను తెప్పించడం విశేషం. ఇక శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ ప్రధాన పాత్రధారులుగా శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సిందూరం’ చిత్రం కూడా 26నే రాబోతోంది. నక్సలిజం నేపథ్యంలో ప్రవీణ్ రెడ్డి జంగా దీనిని నిర్మించారు. ఇదే రోజున సునీల్, చైతన్య రావు మదాడి ప్రధాన పాత్రలు పోషించిన ‘వాలెంటైన్స్ నైట్’ మూవీ రిలీజ్ అవుతోంది. దీన్ని అనిల్ గోపీరెడ్డి దర్శకత్వంలో తృప్తి పాటిల్, సుధీర్ యాళంగి మహీంధర్ నారల నిర్మించారు. ఈ యేడాది ఇప్పటికే చైతన్యరావు నటించిన ‘ఏ జర్నీ టూ కాశీ’ విడుదలైంది. సో… ఇదే నెలలో వస్తున్న అతని రెండో సినిమా ఇది. ఈ సినిమాలతో పాటే… ఇప్పటికే మలయాళంలో విడుదలై ఘన విజయం సాధించిన ‘మాలికాపురం’ చిత్రమూ జనం ముందుకు వస్తోంది. వీటితో పాటే జనవరి 26న రావాల్సిన ‘రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం’ ఫిబ్రవరి 3కు, ‘బుట్టబొమ్మ’ సినిమా 4కు వాయిదా పడ్డాయి. ఆ రకంగా ఈ వారంలో మూడు స్ట్రయిట్ సినిమాలతో పాటు రెండు డబ్బింగ్ సినిమాలు విడుదల అవుతున్నాయి.
