Site icon NTV Telugu

Tollywood: ఈ వారం థియేటర్లలో ఈ చిత్రాలదే సందడి!

T

T

This weekend movies: గత వారం వచ్చిన సినిమాల్లో సమంత పాన్ ఇండియా మూవీ ‘యశోద’కు పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే కలెక్షన్లు మాత్రం ఆ స్థాయిలో లేవన్నది వాస్తవం. అదే వారం వచ్చిన హాలీవుడ్ మూవీ ‘బ్లాక్ పాంథర్’కూ చక్కని ఆదరణే లభించింది. ఇక ఈ వారం ఆరు స్ట్రయిట్ తెలుగు సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. ఇందులో చెప్పుకోవాల్సింది ‘మసూద’ గురించి. నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ‘మళ్ళీరావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాల తర్వాత నిర్మించిన మూడో చిత్రమిది. దీని ద్వారా సాయికిరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తల్లీ కూతుళ్ళ మధ్య ప్రేమ; మధ్య తరగతి కుటుంబాల్లోని బాధలు, స్నేహాలు నేపథ్యంలో ఈ మూవీ రూపుదిద్దుకుంది. తిరువీర్, కావ్య కళ్యాణ్‌ రామ్, ‘శుభలేఖ’ సుధాకర్, అఖిలా రామ్, బాంధవి శ్రీధర్, ‘సత్యం’ రాజేశ్, సత్యప్రకాశ్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం సమకూర్చారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ విడుదల కాబోతున్న ఈ హారర్ థ్రిల్లర్ మూవీపై ప్రేక్షకులలో కాస్తంత అంచనాలు ఉన్నాయి.

ఈ వారం వస్తున్న మరో చెప్పుకోదగ్గ సినిమా ‘గాలోడు’. జబర్దస్త్ ప్రోగ్రామ్ తో గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన సినిమా ఇది. గతంలో అతనితో ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ మూవీని తెరకెక్కించిన దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పులిచర్ల…. ఇప్పుడు స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించారు. ‘చోర్ బజార్’ ఫేమ్ గెహనా సిప్పి హీరోయిన్ గా నటించింది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రంలో సప్తగిరి, షకలక శంకర్, పృథ్వీరాజ్, సత్య కృష్ణన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ వారం జనం ముందుకు వస్తున్న మరో ప్రేమకథా చిత్రం ‘సీతారామపురంలో…’. ఒక ప్రేమ జంట అనేది దీని ట్యాగ్ లైన్. వినయ్ బాబు దర్శకత్వంలో రణధీర్ ను హీరోగా పరిచయం చేస్తూ బీసు చందర్ గౌడ్ ఈ సినిమాను నిర్మించారు. నందిని హీరోగా నటించింది.

ఇదే వీకెండ్ లో రాబరీ డ్రామా ప్రధానాంశంగా తెరకెక్కిన ‘అలిపిరికి అల్లంత దూరంలో’ సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. రావణ్ నిట్టూరి హీరోగా నటించిన ఈ సినిమాను రమేశ్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర నిర్మించారు. నందినీరెడ్డి శిష్యుడు ఆనంద్ జె ఈ మూవీతో దర్శకుడిగా పరిచయవుతున్నాడు. అలానే గణేశ్ దోరాల దర్శకత్వంలో పార్థు రెడ్డి నిర్మించిన ‘బెస్ట్ కపుల్’ మూవీ సైతం ఈ శుక్రవారమే జనం ముందుకు వస్తోంది. జయంత్ వదాలి, శగ్న శ్రీ, చలాకి చంటి, ఇమ్మనుయెల్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలతో పాటు ‘భరత పుత్రులు’ సినిమా సైతం జనాన్ని పలకరించబోతోంది. వీటితో పాటే జూనియర్ ఎన్టీయార్ నటించిన ‘బాద్ షా’ చిత్రం 19వ తేదీ పలు థియేటర్లలో రీ-రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉంటే, ఈ శుక్రవారం ‘దిల్’ రాజు తమిళ సూపర్ హిట్ మూవీ ‘లవ్ టుడే’ను తెలుగులో డబ్ చేసి విడుదల చేయాలని అనుకున్నారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ హఠాన్మరణంతో దాని ప్రమోషన్స్ వాయిదా పడ్డాయి. అలానే సినిమా రిలీజ్ కూడా పోస్ట్ పోన్ అయింది.

Exit mobile version