Site icon NTV Telugu

Samantha: బాలీవుడ్‌లో అవమానం.. ‘సెకండ్’ ముద్ర!

Samantha

Samantha Bollywood Issue

బాలీవుడ్ మీద మోజుతో, అక్కడికెళ్ళిన దక్షిణాది భామలకు దాదాపు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కకపోవడం, ఆఫర్లు కూడా అంతంత మాత్రమే రావడం, అందునా సెకండ్ హీరోయిన్ పాత్రలకే పరిమితం కావడం లాంటివి జరిగాయి. ఒకరిద్దరు మినహాయిస్తే, మిగతా హీరోయిన్ల పరిస్థితి అక్కడ ఆల్మోస్ట్ గల్లంతే! ఇదీ.. మన దక్షిణాది భామలపై బాలీవుడ్‌కి ఉన్న చిన్నచూపు! పచ్చిగా చెప్పాలంటే.. కూరలో కరివేపాకులా చూస్తారు. ఇప్పుడు సమంత విషయంలోనూ బాలీవుడ్ మేకర్స్ అలాంటి వ్యవహార శైలే చూపిస్తున్నారని సమాచారం.

ద ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‌తో సమంతకి వచ్చిన ప్రశంసలు, పాన్ ఇండియా క్రేజ్ చూసి.. ఇక ఈ అమ్మడు బాలీవుడ్‌లో రాజ్యమేలడం ఖాయమని అంతా అనుకున్నారు. అక్కడి స్టార్ భామల కంటి మీద కునుకు లేకుండా దూసుకెళ్తుందని భావించారు. కానీ, అందుకు భిన్నంగా సమంత ఇప్పటివరకూ ఒక్క బాలీవుడ్ ప్రాజెక్ట్‌ని కూడా ఓకే చేయలేదు. రోజులు, నెలలు గడుస్తున్నాయి.. బాలీవుడ్ ఎంట్రీపై రకరకాల వార్తలూ వస్తున్నాయి.. కానీ స్పష్టత మాత్రం రావట్లేదు. ఎందుకు? సమంతకి ఆఫర్లు రావడం లేదా? లేక సమంతనే బ్యాక్‌స్టెప్ వేస్తుందా? అదే నిజమైతే, అందుకు కారణాలేంటి? అని ఇండస్ట్రీలో చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఓ షాకింగ్ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఆల్రెడీ మనం పైన చెప్పుకున్నట్టుగా.. సమంత దక్షిణాదికి చెందిన నటి కావడంతో, కేవలం సెకండ్ హీరోయిన్ పాత్రలే బాలీవుడ్ మేకర్స్ ఆఫర్ చేస్తున్నారట! పోనీ, వాటికి కనీసం ప్రాధాన్యత అయినా ఉందా అంటే, అదీ లేదని తెలిసింది. సౌత్‌లో తిరుగులేని స్టార్డమ్ కలిగిన తాను, మరీ ఇంత చీప్ రోల్స్‌ ఇవ్వడమేంటని అవమానంగా భావించి.. వాటిని ఒప్పుకోవడం లేదని తెలిసింది. ఈ కారణం చేతనే సమంత బాలీవుడ్ అరంగేట్రం ఆలస్యం అవుతోందని తెలుస్తోంది. మరి, సమంత బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో, కాలమే సమాధానం చెప్పాలి.

Exit mobile version