విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న యన్.టి.రామారావు నటించిన చివరి చిత్రం ‘మేజర్ చంద్రకాంత్’. ఈ మాట చెబితే కొందరు అనుమానంగా చూడవచ్చు. ఎందుకంటే ఆయన చివరి సినిమాగా విడుదలయినది ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’. అయితే, ఆ సినిమా అంతకు ముందే యన్టీఆర్ తన నటనాభిలాష కోసం తీసుకున్నది. కానీ, ఆయన నటించిన చివరి చిత్రం అక్షరాలా ‘మేజర్ చంద్రకాంత్’. కానీ, ఈ సినిమా ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’ కంటే ముందుగా విడుదలయింది. యన్టీఆర్ తో మరపురాని ఘనవిజయాలను చవిచూసిన కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రామారావును ‘అన్న’ అంటూ అభిమానించే నటప్రపూర్ణ మోహన్ బాబు ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రాన్ని తమ శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై నిర్మించారు. 1993 ఏప్రిల్ 23న విడుదలైన ‘మేజర్ చంద్రకాంత్’ ఘనవిజయం సాధించి, ఆ యేడాది బ్లాక్ బస్టర్ గా నిలచింది.
‘మేజర్ చంద్రకాంత్’ కథ ఏమిటంటే- సరిహద్దుల్లో శత్రుమూకలను చెండాడి విజయం సాధించిన మేజర్ చంద్రకాంత్ రిటైర్డ్ అయిన తరువాత కుటుంబసభ్యులతో గడపడానికి వస్తారు. సమాజంలో పేరుకున్న అవినీతి, సాగుతున్న అన్యాయాలు, అక్రమాలు చంద్రకాంత్ ను కలచి వేస్తాయి. అసలైన శత్రువులు సరిహద్దుల్లో కాదు, దేశంలోనే మన మధ్యే ఉన్నారని భావించి, అలాంటి దుష్టులను ఏరి పారేయాలనుకుంటారు. చంద్రకాంత్ కొడుకు శివాజీ తండ్రి సరిహద్దుల్లో ఉన్న సమయంలో అనుకోని పరిస్థితులలో తన అక్క భర్తను కాపాడడం కోసం ఓ మోసం చేస్తాడు. తరువాత అదే అలవాటై మోసాలు చేస్తూ ఉంటాడు.
Read Also:Etela Rajendar: భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా రేవంత్ ప్రమాణం.. ఈటల రియాక్షన్ ఇదే..
చంద్రకాంత్ కు డాక్టర్ భారతి, ఝాన్సీ అనే కూతుళ్ళు ఉంటారు. ఆయన భార్య సావిత్రి. ఆనందంగా మనవడు, మనవరాలుతోనూ గడుపుతుంటారు చంద్రకాంత్ దంపతులు. ఓ సారి అనుకోకుండా శివాజీ, సామూహిక వివాహాల్లో సీత అనే అమ్మాయికి తాళి కడతాడు. నిజానికి సీత, మేజర్ చంద్రకాంత్ న్నేహితుని కూతురు. ఇక ఆ ఊరిలో ఎమ్.పి. జ్ఞానేశ్వర్ తనకు తిరుగేలేదు అంటూ సాగుతూఉంటాడు. అతని కొడుకులు జనాన్ని నానా విధాల దోచుకుంటూ ఉంటారు. రాజకీయ నాయకుల అన్యాయలపై చంద్రకాంత్ పోరాటం చేస్తారు. లాఠీ దెబ్బలకు గురవుతారు. మీకెందుకు ఇవన్నీ అంటాడు శివాజీ. దాంతో తనలోని దేశభక్తిని కుటుంబసభ్యులకు అర్థమయ్యేలా చేస్తారు చంద్రకాంత్. తరువాత శివాజీలో పరివర్తన కలుగుతుంది. మోసాలకు దూరంగా జరుగుతాడు.
ఎమ్.పి. పగబట్టి చంద్రకాంత్ అంతుచూడాలని చూస్తాడు. చంద్రకాంత్ భార్య అనారోగ్యంతో కన్నుమూస్తుంది. చంద్రకాంత్ ను నాశనం చేయాలని ఎమ్.పి. చేసే ప్రయత్నాలు ఫలించవు. దేశద్రోహం చేయాలని ప్రయత్నించి, సరిహద్దు రహస్యాలను చెప్పవలసిందిగా చంద్రకాంత్ ను బంధిస్తాడు ఎమ్.పి. అతని కుటుంబాన్నీ కట్టకట్టి తెస్తారు ఎమ్.పి. మనుషులు. ఓ వైపు శివాజీ, మరోవైపు చంద్రకాంత్ తమ కుటుంబాన్ని రక్షించుకుంటారు. ఎమ్.పి. నేరాలకు తగిన సాక్ష్యాలను సేకరించి, అసెంబ్లీ ముందుకు తీసుకు వస్తాడు చంద్రకాంత్. ఇలాంటి నేరస్థులు దేశంలో ఉంటే దేశానికే ప్రమాదం అని చెప్పి, ప్రజాప్రతినిధులకు ఎమ్.పి.ని అప్పగిస్తాడు చంద్రకాంత్. తీవ్రగాయాల పాలయిన చంద్రకాంత్ కన్నుమూయడంతో కథ ముగుస్తుంది.
మోహన్ బాబు, నగ్మా, రమ్యకృష్ణ, శారద, అమ్రిష్ పురి, గుమ్మడి, బాలయ్య, బ్రహ్మానందం, బాబూమోహన్, పరుచూరి గోపాలకృష్ణ, శ్రీహరి, సాయికుమార్, రాఖీ, బాలాజీ, చలపతిరావు, రాళ్ళపల్లి, నర్రా, అనంత్, ఐరన్ లెగ్ శాస్త్రి, అన్నపూర్ణ, సుధ, కిన్నెర, శివపార్వతి, మాస్టర్ మంచు మనోజ్, బేబీ శ్రేష్ఠ నటించారు. ఈ చిత్రానికి పరుచూరి సోదరులు రచన చేయగా, కీరవాణి సంగీతం సమకూర్చారు. ఇందులో జాలాది రాసిన “పుణ్యభూమి నా దేశం నమో నమామీ…” గీతం విశేషాదరణ చూరగొంది. ఈ పాటలో యన్టీఆర్ శివాజీగా, అల్లూరి సీతారామరాజుగా, వీరపాండ్య కట్టబ్రహ్మనగా, నేతాజీగా కనిపించడం విశేషం! ఈ పాట ప్రతి జాతీయ పర్వదినాన ఏదో ఒక రీతిన జనం మదిని తడుతూనే ఉంటుంది. రసరాజు, గురుచరణ్, కీరవాణి కూడా పాటలు పలికించారు. ఇందులోని “ముద్దులతో ఓనమాలు దిద్దించనా…”, “ఉలికి పడకు అల్లరి మొగుడా…”, “నీక్కావలసింది నా దగ్గరవుంది…”, “లప్పం టప్పం గాళ్ళకి…”, “బుంగమూతి…”, “సుఖీభవా సుమంగళీ…” అంటూ సాగే పాటలు సైతం ఎంతగానో అలరించాయి.
యన్టీఆర్ మేజర్ చంద్రకాంత్ గా జీవించారు. మిగిలిన పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు నటించారు. విశేషమేమంటే, ఈ సినిమాలో యన్టీఆర్ తో నటించాలని ఇందులో నటించిన ప్రముఖులందరూ ఆశించారు. అందుకు తగ్గట్టుగా సన్నివేశాలను రూపొందించడంలో పరుచూరి బ్రదర్స్ తమదైన బాణీ పలికించారు. ఒక్క సీనయినా రామారావుతో నటించాలని అభిలషించిన వారందరూ ఈ రోజున ఆ మహానటునితో మేమూ కలసి నటించామని గొప్పగా చెప్పుకుంటున్నారు.
ఈ చిత్రం అనేక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. ఈ సినిమా వందరోజుల పండుగను తిరుపతిలో నిర్వహించారు. ఆ వేడుకలోనే తాను లక్ష్మీపార్వతిని పెళ్ళాడనున్నట్టు రామారావు ప్రకటించి, సంచలనం సృష్టించారు. అప్పట్లో ప్రతిపక్ష నాయకునిగా ఉన్న రామారావు ఆ ప్రకటన చేయగానే, రాజకీయ సమీకరణాలు మారిపోతాయని, తరువాత రాష్ట్రంలో హంగ్ వస్తుందే తప్ప తెలుగుదేశం పూర్తి మెజారిటీ సాధించలేదని కొందరు రాజకీయ పండితులు జోస్యం చెప్పారు. వారందరి మాటను తలకిందులు చేస్తూ యన్టీఆర్ అంతకు ముందు పాలన చేసిన కాంగ్రెస్ పార్టీని 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 26 సీట్లకే పరిమితం చేసి, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ఏది ఏమైనా యన్టీఆర్ చివరి చిత్రంగా రూపొందిన ‘మేజర్ చంద్రకాంత్’ జనాన్ని విశేషంగా అలరించింది. యన్టీఆర్ శతజయంతి సందర్భంలో ‘మేజర్ చంద్రకాంత్’ 30 ఏళ్ళు పూర్తి చేసుకోవడమూ ఓ విశేషంగానే నిలచింది.
Read Also: Nushrratt Bharuccha: రాజమౌళి నార్త్ స్టార్ ని కూడా తెలుగుకి వచ్చేలా చేశాడు